మరణమంటే జీవితంలో బాగమని చెప్పకనే చెప్పిన తత్వవేత్త.. జిడ్డు కృష్ణమూర్తి వర్థంతి..!
posted on Feb 17, 2025 9:30AM

జె.కె అంటే ఆధ్యాత్మికత, తత్వ చింతనల గురించి, వాటికి సంబంధించిన వ్యక్తులు, పుస్తకాలను అధ్యయనం చేసిన వారికి బాగా తెలిసి ఉంటుంది. కానీ చాలామందికి జె.కె అంటే జిడ్డు కృష్ణమూర్తి అని తెలియదు. జిడ్డు కృష్ణమూర్తి భారతదేశపు ప్రసిద్ధ తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త, రచయిత, ఉపన్యాసకుడు. నిజానికి జిడ్డు కృష్ణమూర్తి ఒక గొప్ప గురువు అని చెప్పవచ్చు. కానీ ఆయన గురువు అని పిలిపించుకోవడానికి నిరాకరించారు. ఫిబ్రవరి 17, 1986లో జిడ్డు కృష్ణమూర్తి మరణించారు. ఈ సందర్బంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకుంటే..
జిడ్డు కృష్ణమూర్తి గొప్ప తత్వవేత్త, ఆధ్యాత్మిక బోధనలు ఎన్నో ఈయన నుండి వెలువడ్డాయి. ఈయన చేసిన బోధనలలో అశాశ్వతం అనే ఇతివృత్తం గురించే ఎక్కువ ప్రస్తావన ఉంది. ఈయన ఇచ్చిన తొలి ఉపన్యాసం నుండి చివరి వరకు మరణాన్ని అర్థం చేసుకోవాల్సిన అవశ్యత గురించి ఈయన ఎక్కువ మాట్లాడారు. మరణానికి భయపడకూడదని, మరణాన్ని వాయిదా వేయకూడదని, మరణాన్ని తిరస్కరించకూడదని జిడ్డు కృష్ణమూర్తి చెప్పారు.దీన్ని బట్టి మరణాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలనేది జిడ్డు కృష్ణమూర్తి తత్వమని అర్థం అవుతుంది. అంటే.. మరణం గురించి అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ప్రతి మనిషి జీవించడం పట్ల ఎంత ఉత్సుకతతో.. ఎంత ఆశతో ఉంటాడో.. మరణం విషయంలో కూడా అంతే ఉత్సుకతతో ఉండాలని జిడ్డు కృష్ణమూర్తి చెప్తారు.
జిడ్డు కృష్ణమూర్తి మరణాన్ని గమనిస్తే.. ఆయన మరణం గురించి, మరణాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయం గురించి ఆయన చెప్పిన విషయాలకు ఒక రూపం ఇస్తే ఆయన మరణం వైపు సాగిన ప్రయాణం కూడా అదే విధంగా ఉంటుంది. జీవితంలో ప్రతి అంశానికి ఒక స్పష్టత ఉంటుంది. అదే విధంగా మరణానికి కూడా ఒక స్పష్టత అనేది ఉంటుంది. దాన్ని ఇతర విషయాల లాగే భావించినప్పుడు మరణం అంటే భయం, బాధ, తప్పించుకోవాలని పారిపోవాలనే ప్రవర్తన అస్సలు ఉండవట. జిడ్డు కృష్ణమూర్తి మరణం గురించి చెప్పిన విషయాలు అక్షరాలా పాటించాడని చెప్పడానికి ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులే సాక్ష్యులు.
జిడ్డు కృష్ణమూర్తి మరణాన్ని జీవితానికి విరుద్దమైన అంశంగా ఎప్పుడూ చూడలేదు. ఆయన మరణానికి చేరువ అవుతున్న కొద్దీ ఆయన శరీరం క్షీణిస్తూ ఉంటే.. ఆయన మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేవారట. చాలా తక్కువగా మాట్లాడేవారట, ఎలాంటి డ్రామా జరగకుండా చాలా ప్రశాంతంగా జిడ్డు కృష్ణమూర్తి మరణం జరిగిందని అంటారు. కాలం వల్ల, మనిషి తాను ఊహించుకునే విషయాలు, మనిషి తాను అనుభూతి చెందే ఎన్నో రాగద్వేషాల నుండి విముక్తి పొంది అవగాహనతో జీవించడం, మరణించడం అనేది జిడ్డు కృష్ణమూర్తి మాటల్లోనూ,చేతల్లోనూ కూడా చూపించారు.
ప్రముఖ వ్యక్తులు తమ చివరి రోజుల్లో లేదా చివరి ఘడియల్లో కొన్ని విషయాలు ప్రధానంగా ప్రస్తావించి ఉంటారు. జిడ్డు కృష్ణమూర్తి చివరి మాటలు కూడా చాలా సరళమైనవే అయినా చాలా లోతుగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన చివరి మాటలలో ఒక వాక్యం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది."శరీరం ఇంకేమి తట్టుకోగలదో నాకు ఖచ్చితంగా తెలియదు" అని ఆయన అన్నారు. ఈ మాట ఆయన శరీరం చివరి రోజుల్లో ఎంత బాధ అనుభవించి ఉంటుందో, ఆయన ఎంత బాధపడి ఉంటారో చెప్పకనే చెబుతుంది. అయినా సరే.. అవన్నీ మానవ శరీరానికి తప్పవనే నిజాన్ని ఆయన అంగీకరించారు. ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు, దాన్ని ప్రతి మనిషిని అంగీకరించినప్పుడు మరణం గురించి అందరికీ అర్థం అవుతుంది. మరణం మీద అవగాహన వస్తుంది. మరణం అంటే భయం పోతుంది.
*రూపశ్రీ.