జగన్మోహన్ రెడ్డికీ జయలలిత పరిస్థితే ఎదురవుతుందా?

posted on: Sep 27, 2014 9:42PM

 

అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు, ఆమె అనుచరులకు ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షలు చూస్తున్నవారికి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కూడా మనసులో మెదలడం సహజం. జయలలితపై రూ.63 కోట్ల అక్రమాస్తుల కేసులు నమోదు అయితే జగన్ పై వేల కోట్ల అక్రమాస్తుల కేసులు నమోదు చేయబడ్డాయి. జయలలితపై కేవలం ఒక్క కేసు మాత్రమే ఉండగా, జగన్మోహన్ రెడ్డిపై ఏకంగా పదకొండు చార్జ్ షీట్లు నమోదు చేయబడి ఉన్నాయి. వాటిలో పదింటిని నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్ష్మినారాయణ పూర్తి సాక్ష్యాధారాలతో చాలా పకడ్బందీగా నమోదు చేసారు. ఒకవేళ ఆ పది చార్జ్ షీట్లలో ఏ కొన్నిటిలో జగన్మోహన్ రెడ్డి, మిగిలిన నిందితులు దోషులుగా నిర్ధారించబడినా శిక్షలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించడం కూడా కష్టమే. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెయిలుపై బయట ఉన్నప్పటికీ, సీబీఐ కోర్టుకు తరచూ హాజరవుతూనే ఉన్నారు. ఇదివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చలువ వలననే ఆయన బయటున్నారనే వాదనలు వినబడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన తీవ్రంగా వ్యతిరేఖించే తెదేపా మిత్రపక్షమయిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక ఆయన కేసుల విషయంలో కలుగజేసుకోకపోవచ్చును. జయలలిత అక్రమాస్తుల కేసులను ఆమె లాయర్లు దాదాపు రెండు దశాబ్దాలు నెట్టుకు రాగలిగారు. కానీ చివరికి శిక్షపడకుండా మాత్రం ఆమెను కాపాడలేకపోయారు. అందువలన ఆయన తరపున వాదిస్తున్న లాయర్లు ఈ కేసులన్నిటినీ ఎంత సమర్ధంగా, ఎంత ఎక్కువ కాలం పొడిగించగలరనే దానిపైనే ఆయన భవిష్యత్ ఆధారపడిఉందని చెప్పవచ్చును. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తరపున వాదిస్తున్న లాయర్లు కూడా కనీసం వచ్చే ఎన్నికలవరకు కేసులను సాగదీయగలిగితే, అప్పటికి రాష్ట్రంలో కానీ, కేంద్రంలో గానీ రాజకీయ పరిస్థితులలో మార్పులు వస్తే ఆయనకు ఎంతో కొంత ఉపశమనం దొరకవచ్చును. కానీ ఈలోగానే ఆయన కేసులలో ఏ ఒక్కటి కొలిక్కి వచ్చినా ఆయనకు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు తప్పక పోవచ్చును.

 

జయలలిత అక్రమాస్తుల కేసులు ఆమె రాజకీయ భవిష్యత్తును ఏవిధంగా ప్రభావితం చేసాయో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కూడా ఆయన రాజకీయ భవిష్యత్ పై తీవ్ర ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...