Top Stories

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించి ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు.   సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ పై ఈ నెల 10న విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. కాగా వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలు కోరారు.  
Publish Date: Feb 4, 2025 12:21PM

తెలుగుదేశం ఖాతాలోనే తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో తెలుగుదేశం జయభేరి మోగించింది. తెలుగుదేశం కార్పొరేటర్, టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు  26 మంది కార్పొరేటర్లు మద్దతు పలుకుతూ ఓటు వేయగా,  వైసీపీ అభ్యర్థికి కేవలం 21 ఓట్లు వచ్చాయి.  చేతులెత్తే పద్ధతిలో ఈ ఎన్నిక జరిగింది.  తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా మునికృష్ణ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.  తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. వీటిలో మూడు ఖాళీగా ఉన్నాయి. దీంతో డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కావాలంటే 26 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో  మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు ఓటు వేయగా, వైసీపీ అభ్యర్థి భాస్కరరెడ్డికి 21 మంది కార్పొరేటర్లు ఓటు వేశారు. దీంతో టీడీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు.  
Publish Date: Feb 4, 2025 11:51AM

ఇలా మొదలై అలా వాయిదా పడిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు  ఇలా ప్రారంభమై అలా వాయిదా పడ్డాయి. ప్రారంభమయ్యాయి. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికను సభలో ప్రవేశపెట్టి చర్చించే లక్ష్యంగా మంగళవారం (ఫిబ్రవరి 4) తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సభలో ప్రవేశ పెట్టడానికి ముందు కేబినెట్ సమావేశమై ఈ నివేదికను ఆమోదించాల్సి ఉంది. అయితే కేబినెట్ భేటీ జాప్యం కావడంతో అసెంబ్లీ స్పెషల్ సెషన్ ప్రారంభం కాగానే  కేబినెట్ భేటీ కారణంగా సమావేశాలను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేయాలని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ కు కోరారు.  సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రివర్గ సభ్యులందరూ కేబినెట్ భేటీలో ఉన్నారనీ అది ముగియడానికి కొంత సమయం పడుతుందనీ, అందుకే అసెంబ్లీని మధ్యాహ్నానికి వాయిదా వేయాలని శ్రీధర్ బాబు కోరారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా వేశారు.  అలాగే శాసన మండలి కూడా మధ్యాహ్నానికి వాయిదా పడింది. 
Publish Date: Feb 4, 2025 11:26AM

ప్రతిపక్ష నేతగా తొలగాలి.. కేసీఆర్ కు లీగల్ నోటీసు

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బిగ్ షాక్ తగిలింది. 2023 డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై అధికారానికి దూరమైన సంగతి తెలిసిందే. పార్టీ అధికారం కోల్పోయిన తరువాత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయాలలో ఏమంత క్రియాశీలంగా ఉండటం లేదు. పార్టీ విపక్షానికి పరిమితమై ఏడాది దాటినా ఇప్పటి వరకూ ఆయన ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. అంతే ఆయన పూర్తిగా పామ్ హౌస్ కు పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ఫామ్ హౌస్ లోనే తనను కలిసిన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై పోరాడాలి.. లేదా విపక్ష నేత పదవి నుంచి వైదొలగాలి అంటూ లీగల్ నోటీసు అందింది. ఈ నోటీసు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ పంపింది. ఆ అసోసియేషన్ తరఫున అడ్వకేట్   పాదూరి శ్రీనివాస్ రెడ్డి మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా  కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపారు. అసెంబ్లీకి గైర్హాజరౌతున్న కేసీఆర్ కు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత లేదని ఆ నోటీసులో పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరవ్వాలని కాంగ్రెస్ నేతలు సైతం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ నుంచి లీగల్ నోటీసులు అందడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నోటీసుపై కేసీఆర్ ఎలా స్పిందిస్తారన్నది ఆసక్తిగా మారింది.  
Publish Date: Feb 4, 2025 11:03AM

ఎమ్మెల్సీ పోరుకు బీఆర్ఎస్ దూరం?.. ఓటమి భయమే కారణమా?

 తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మాటలు కోటలు దాటుతున్నాయి. అయితే చేతలు మాత్రం ఫామ్ హౌస్ గడప కూడా దాటని పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికలలో పోటీకి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ఇప్పటికింకా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.. కానీ ఆ పార్టీ తీరు చూస్తుంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టమౌతోంది. పార్టీ క్యాడర్ కు అదే సంకేతాలను పంపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ పార్టీకీ మద్దతు ఇచ్చేది లేదని చెబుతుండటమే స్వయంగా బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపడం లేదని చెప్పేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉండనుంది.  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇరువురూ కూడా రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు అధికారం అప్పగించామా అని వగస్తున్నారనీ, అవకాశం ఉంటే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ను అధికార పీఠంపై కూర్చోపెట్టేందుకు రెడీగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. నిజంగా అలాంటి పరిస్థితే కనుక ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దిగితే తాము చెప్పే మాటలలో వాస్తవం ఎంత ఉందో ఫలితాలలో తేలిపోతుంది. అయితే ఆలా తేల్చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు.   ఇప్పటికిప్పుడు కేసీఆర్ ను సీఎంను చేయడానికి ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని ఢంకా బజా యించి చెబుతున్న కేటీఆర్ కానీ, కాంగ్రెస్ కు అధికారపగ్గాలు ఇచ్చినందుకు జనం బాధపడుతు న్నారని చెప్పుకుంటున్న కేసీఆర్ కానీ తాము చెబుతున్న మాటలను తామే విశ్వసించడం లేదనడానికి నిదర్శనం ఎమ్మెల్సీ బరిలోకి దిగకపోవడమేనని విశ్లేషకులు అంటున్నారు. వారు చెబుతున్న విధంగా  రేవంత్ సర్కార్ పై నిజంగానే ప్రజలలో వ్యతిరేకత ఉంటే.. దానిని బీఆర్ఎస్ కు అనుకూలంగా మలచుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక అందివచ్చిన అవకాశంగా భావించాల్సిన బీఆర్ఎస్ ఆ ఎన్నికలకు దూరం అవ్వడం అంటే.. ప్రజలలో తమ పార్టీ పట్ల సానుకూలత లేదని అంగీకరించడమేనని చెప్పాలి. వాస్తవంగా గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ప్రజల మూడ్ ను చాటి చెబుతుంది. ఎందుకంటే ఆ రెండు వర్గాలూ కూడా ప్రజలపై ప్రభావం చూపగలిగే వర్గాలే.  అటువంటి టీచర్, గ్యాడ్యుయేట్   ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి బీఆర్ఎస్ వెనుకాడటం చూస్తుంటే.. ప్రజలలో తమ పార్టీకి ఏమంత పలుకుబడి లేదని బీఆర్ఎస్ అంగీకరిం చేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Feb 4, 2025 10:45AM

రేవంత్ రెడ్డి రూటు మార్చకుంటే కష్టమేనా?

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అంశం ఏదైనా మ‌రి కొద్ది రోజుల్లో ఎన్నిక‌లు జరగనున్నాయా అన్నట్లుగా అధికార‌, విప‌క్ష పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతోంద‌న్న చ‌ర్చ ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ట్విట‌ర్ ఖాతాలో పోల్ వ్య‌వ‌హారం, ఎమ్మెల్యేల ర‌హ‌స్య మీటింగ్, సీఎంకు తెలియ‌కుండానే కులగ‌ణ‌న వివ‌రాలను మీడియాకు లీకవ్వడం, మ‌ధ్య మ‌ధ్య‌లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పార్టీ సీనియ‌ర్ నేత‌ల వ్యాఖ్య‌లు.. ఇలా..  రేవంత్ ప్ర‌భుత్వంలో ఏదో జ‌రుగుతోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  వాస్త‌వానికి.. రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి క్యాబినెట్ లోని సీనియ‌ర్ మంత్రుల‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఎవ‌రినీ నొప్పించ‌కుండా అంద‌రినీ క‌లుపుకొనిపోతూ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నారు. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా సీనియ‌ర్ మంత్రుల‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయినా.. ప్ర‌భుత్వంలో కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ తీరు ప‌ట్ల కాస్త అసంతృప్తితో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనంత‌టికీ రేవంత్ రెడ్డి అతి మంచిత‌న‌మే కార‌ణ‌మ‌న్న‌ వాద‌న పార్టీ వర్గాల నుంచే వినవస్తోంది.  సీఎం హోదాలో రేవంత్ రెడ్డి.. కొంద‌రు మంత్రుల‌కు అతి మ‌ర్యాద ఇస్తుండ‌టంతో దాన్ని వారు అలుసుగా తీసుకొని ప్ర‌భుత్వంలో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నార‌న్న వాద‌నను కాంగ్రెస్ లోని ఓ వ‌ర్గం నేత‌లు వినిపిస్తున్నారు.  రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ప్ర‌జ‌ల‌కు మేలుచేసేలా కృషి చేస్తున్నారు. ప్ర‌భుత్వం లోటు బ‌డ్జెట్‌లో ఉన్నా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తూ వ‌స్తున్నారు. అయితే, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో పార్టీ క్యాడ‌ర్   విఫ‌ల‌మ‌వుతోంది. రైతు రుణ‌మాఫీకి స‌రైన ప్ర‌చారం క‌ల్పించ‌క‌పోవ‌టంతో ప్ర‌భుత్వంపై విప‌క్ష పార్టీల నేత‌లకు విమర్శలు చేసే అవకాశం చిక్కిందని అంటున్నారు.  ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాలుగు కొత్త ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ ప‌థ‌కాల అమ‌లుపైనా.. ఎవ‌రికి ల‌బ్ధిచేకూరుతుంద‌నే విష‌యాల‌పైన స్ప‌ష్టంగా గ్రామ‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫ‌ల‌మ‌య్యార‌న్న వాద‌న ఉంది. దీనికి తోడు ప్ర‌భుత్వంలో మంత్రుల మ‌ధ్య స‌ఖ్య‌త‌ లేద‌ని.. కొంద‌రు మంత్రులు రేవంత్ కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు రోజురోజుకు తీవ్ర‌మ‌వుతున్నాయి.  తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ స‌ర్కార్‌కు ఇటీవ‌ల వ‌రుస‌గా దెబ్బ‌ మీద దెబ్బ‌  త‌గులుతోంది.   వారం రోజుల కిందట మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ స‌ర్కార్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల త‌రువాత నుంచి ఫాంహౌస్ కే ప‌రిమితం అయిన కేసీఆర్ ఒక్క‌సారిగా  అదే ఫామ్ హౌస్ నుంచి సమర గ‌ర్జ‌న చేశారు. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తన అలవాటు అని చెబుతూనే.. రేవంత్ స‌ర్కార్ కు ఇక ద‌బిడిదిబిడే అంటూ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల త‌రువాత‌ ప‌ది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ర‌హ‌స్యంగా భేటీ కావ‌టం తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పాల‌మూరు జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యే త‌న ఫాంహౌస్ లో ప‌ది మంది ఎమ్మెల్యేల‌కు విందు ఇచ్చారు. ఈ విందు భేటీలో వారి ఇబ్బందుల‌ను ఒక‌రికొక‌రు చెప్పుకున్న‌ట్లు స‌మాచారం. కొంద‌రు మంత్రులు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌టం లేదని,  ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు స‌రియైన స‌హ‌కారం అంద‌డం లేద‌నీ ఈ భేటీలో వారు చర్చించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే  ఈ రహస్య విందు భేటీ వెనుక కేసీఆర్ హ‌స్తం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ట్విట‌ర్ ఖాతాలో పెట్టిన పోల్‌కు ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఫామ్‌హౌస్ పాల‌న కావాలా.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న‌ కావాలా..? అంటూ పోల్ పెట్ట‌గా.. ఫామ్ హౌస్ పాల‌నే కావాలంటూ అధిక శాతం మంది  ఓటు వేశారు. ఈ ప‌రిణామం కాంగ్రెస్ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీంతో అస‌లు పార్టీలో ఏం జ‌రుగుతోంది అనే చ‌ర్చ‌కు దారితీసింది. కులగ‌ణ‌న వివ‌రాల విష‌యంలో కొంద‌రు మంత్రులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రంగా మారింది. కుల గణన నివేదికపై తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ముందుగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి అందులో ఈ నివేదికను ఆమోదించాలని భావించారు. అయితే ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా కొందరు అధికారులు, మంత్రులు ఆ నివేదికను ముందుగానే మీడియాకు లీక్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వంలో సమన్వయం లేదని ప్రజలు భావించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చీవాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. మ‌రో వైపు కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌భుత్వ ప‌థ‌కాల విష‌యంలో అన‌వ‌స‌ర‌పు వ్యాఖ్య‌లు చేస్తుండ‌టం కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారింది.  కాంగ్రెస్ నేత‌ జ‌గ్గారెడ్డి ఇటీవల మీడియా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేరు మ‌ర్చిపోవ‌టంపైనా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. జ‌గ్గారెడ్డి కావాల‌నే రేవంత్ పేరు మ‌ర్చిపోయారా అన్న అనుమానాల‌ను కొంద‌రు కాంగ్రెస్ నేత‌లే వ్య‌క్తం చేస్తున్నారు. చూసేందుకు అది చిన్న‌విష‌య‌మే అయినా, సీఎం రేవంత్ ప‌ట్ల కాంగ్రెస్ నేత‌ల్లోనే తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డుతుంద‌ని, త‌ద్వారా ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం స‌న్న‌గిల్లుతుంద‌న్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టి ప్ర‌భుత్వాన్ని సీరియ‌స్ గా న‌డిపించాలంటే రేవంత్ రెడ్డి  రూటు మార్చాల‌న్న వాద‌న‌ను కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు గట్టిగా వినిపిస్తున్నారు.   వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌ర‌హార‌లో   లైన్ దాటిని వారిపై కొర‌డాఝుళిపించాల‌న్న డిమాండ్ కాంగ్రెస్ నేతల నుంచి గట్టిగా వినిపిస్తోంది. 
Publish Date: Feb 4, 2025 9:51AM