సర్కారు వారి పాట!.. ఎకరా పది కోట్లు.. అమరావతి భూముల విక్రయానికి జీవో!

మొండివాడు రాజుకంటే బలవంతుడు. పిచ్చోడి చేతిలో రాయి వంటి సామెతలన్నీ వరుసపెట్టి గుర్తుకు వచ్చేలా జగన్ పాలన ఉంది. అమరావతే ఏపీ రాజధాని దానికి మా పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తోంది అంటూ విపక్ష నేతగా నిండు అసెంబ్లీలో ప్రకటించిన జగన్ అధికారంలోకి రాగానే నిర్లక్ష్యం చేశారు.

అమరావతి పురోగతిని, అభివృద్ధిని పాతాళంలోకి పాతేశారు. ఆయన మనసు తెలుసుకున్న వైసీపీ నేతలు అమరావతిని శ్మశానం అంటే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతి పనికిరాదన్నారు. వరదలు వస్తే మునిగిపోతుందన్నారు. ఎన్నెన్నో చెప్పారు. మూడు రాజధానులన్నారు. అమరావతి కోసం.. రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా విధాలుగా వేధించారు. వెరసి ఈ మూడేళ్లలో అమరావతిలో ఒక్క పని చేపట్టలేదు. జరుగుతున్న పనులను ఆపేశారు. అమరావతి కోసం చారిత్రక పోరాటం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ ఎకసెక్కాలాడారు. వారిపై కేసులు పెట్టారు. ఇక ఇప్పుడు రాజధాని అభివృద్ధి కోసం నిధుల సేకరణ అంటూ అమరావతి భూముల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అభివృద్ధిని అన్ని విధాలుగా అణగదొక్కేసిన జగన్ సర్కార్ మూడేళ్ల తరువాత అభివృద్ధి కోసమంటూ రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తే అవి నిరాకరించాయి.

దీంతో ప్రభుత్వం కన్ను అమరావతి భూములపై పడింది. దీంతో వీటి అమ్మకానికి రెడీ అయిపోతోంది. ఈ మేరకు ఎకరాకు రూ.10 కోట్లు ధర నిర్ణయించి సర్కారు వారి వేలం పాటకు రెడి అయిపోతోంది జగన్ ప్రభుత్వం.  మొత్తం 600 ఎకరాల విక్రయానికి ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ జీవో జారీ చేసింది. తొలి విడతలో 248.34 ఎకరాల విక్రయానికి రెడీ అయిపోయింది.

జగన్ సర్కార్ విక్రయించడానికి నిర్ణయం తీసుకున్న భూములన్నీ గత ప్రభుత్వం వివిధ విద్యా సంస్థలకు కేటాయించినవే. తొలి విడతలో విక్రయానికి సిద్ధం చేసిన భూములలో బీఆర్ షెట్టీ మెడిసిటీ కోసం కేటాయించిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజీకి కేటాయించిన 148 ఎకరాలు ఉన్నాయి. ఆయా సంస్థలతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నిటినీ అధికారంలోకి రాగానే జగన్ సర్కార్ రద్దు చేసింది. ఇప్పుడేమో కేటాయించిన భూములలో సంస్థలు ప్రారంభించేందుకు ఆయా సంస్థలు ముందుకు రాని కారణంగా కేటాయింపులు రద్దు చేసి భూములను విక్రయిస్తున్నామంటూ చెబుతోంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థల పెట్టుబడులను ఉద్దేశపూర్వకంగా నిరాకరించి, ఇప్పుడేమో ఆదాయం కోసం వాటికి కేటాయించిన స్థలాలను విక్రయించడానికి సిద్ధపడిపోయింది జగన్ సర్కార్.

గత ప్రభుత్వంలోనే ఆయా సంస్థలకు భూముల కేటాయింపు జరిగింది. ఆ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని అభివృద్ధి చేసి ఆ తరువాత మిగులు భూములను విక్రయిస్తే లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని ప్రకటించారు. జగన్ ప్రభుత్వమేమో అభివృద్ధిని విస్మరించి 2,480 కోట్ల నామ మాత్రపు ధరకు తొలి విడతలో దాదాపు 250 ఎకరాల భూముల విక్రయానికి సిద్ధమైపోయింది. అయితే భూముల విక్రయానికి రైతులు అంగీకరిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. రైతులు న్యాయపోరాటంలో విజయం సాధించినా ప్రభుత్వం కోర్టు తీర్పును అమలు చేస్తుందన్న విశ్వాసం లేక ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధుల సేకరణ అంటూ భూముల విక్రయానికి తెగబడితో మరో సారి కోర్టుకు వెళ్లడం ఖాయమని రైతులు అంటున్నారు. ముందుగా ఒప్పందం ప్రకారం తమకు అభివృద్థి చేసిన భూములు అప్పగించిన తరువాతనే ప్రభుత్వం భూ విక్రయం చేయాలని వారు పట్టుబడుతున్నారు. అందుకు భిన్నంగా ప్రభుత్వం ముందుకు వెళితే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేస్తున్నారు. అయినా జగన్ సర్కార్ మాత్రం మొండిగా ముందుకే వెళుతోంది. సర్కార్ వారి వేలం పాట ఖాయమని చెబుతోంది.