ఆర్థిక సంక్షోభాన్ని పెంచే దిశగా జగన్ సర్కార్ చర్యలు- రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్ర భవిష్యత్ ఫణ

ఆంధ్రప్రదేశ్ లో  కొత్త జిల్లాల చిచ్చు ఇంకా చల్లారలేదు. తాజాగా కోనసీమ జిల్లా పేరును బీఆర్ ఆంబేడ్కర్ కోససీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ చిచ్చుకు అజ్యం పోసింది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. జగన్ సర్కార్ రాష్ట్రంలో గతంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచిన సంగతి తెలిసిందే.. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. అయితే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వానికి వినతులు అందాయి.

దీంతో సానుకూలంగా స్పందించి పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే ఈ జిల్లాకు డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీని కోసం పలుచోట్ల నిరసన, ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. దీంతో కోనసీమ జిల్లా పేరులో  బి.ఆర్‌.అంబేద్కర్‌ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వర్గాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ మార్పు అంబేడ్కర్ కు వ్యతిరేకంగా కాదనీ, నిర్ణయించిన పేరు ను మార్చడానికేననీ ఆందోళణ చేపట్టిన వర్గాలు అంటున్నాయి. దశాబ్దాలుగా కోనసీమ వాసుల కల కోనసీమ జిల్లా అనీ, ఇంత కాలానికి అది సాకారం అయ్యిందన్న ఆనందం లేకుండా కోనసీమ జిల్లా పేరును బీఆర్ అం బేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చడంపైనే తమ అభ్యంతరం అనీ వారు స్పష్టం చేస్తున్నారు. 

అసలు రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షో భ పరిస్థితుల్లో జాల్లాల పెంపు నిర్ణయం సముచితమా అన్న వాదన కూడా జిల్లాల సంఖ్య పెంపు సందర్భంగా గట్టిగానే వినిపించింది. జిల్లాలు పెంచడంతో జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం, కొత్త జిల్లాల ఏర్పాటు ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న అంశాలే. అయితే రాష్ట్రంలో ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే ధ్యేయంగా  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేసేసింది. ప్రజా సమస్యలపై దృష్టి మరల్చాలన్న ధ్యేయం నెరవేరిందా, లేదా అన్న విషయం పక్కన పెడితే కొత్త జిల్లాల ఏర్పాటు మరిన్ని సమస్యలకు దారి తీసింది.

జిల్లాల ఏర్పాటులో అనుసరించిన విధానానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు చెలరేగాయి. సాక్షాత్తూ వైసీపీ నేతలూ ఆ నిరసనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అది సద్దుమణిగిందనుకునే లోపు కోనసీమ జిల్లా పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోససీమ వ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. చాలా చోట్ల పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగారు. సంతకాల సేకరణ ఉద్యమానికి తెరతీశారు. అసలే ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్న సమయంలో సర్కార్ అనవసరంగా తేనెతుట్టెను కదిపిందన్న భావన అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నది. కొత్త జిల్లాల్లో పాలన ఇంకా కుదురుకోని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. ఉన్న అదనపు వ్యయానికి తోడు  క్యాబినెట్ ర్యాంక్ తో సలహాదారుల నియామకంతో సర్కార్ మరింత ఆర్థిక భారాన్ని నెత్తిన వేసుకుంటున్నది.

తాజాగా వ్యవసాయ సహకార శాఖకు సలహాదారుగా ప్రకాశం జిల్లా కారంచేడు మండలం ఎర్రమ్మవారి పాలెంకు చెందిన బత్తుల బ్రహ్మానందరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసలే ప్రభుత్వం రోజు వారీ ఖర్చులకు కూడా అప్పుల కోసం వెతుకులాడుతుంటే.. మరింత ఆర్థిక భారం తలకెత్తుకునే విధంగా జిల్లాల ఏర్పాటు, సలహాదారుల నియామకాలు చేపట్టడం అవసరమా అని పరిశీలకులు అంటున్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యా రాష్ట్రా ఆర్థిక సంక్షోభాన్ని మరింతగా పెంచేదిగానే ఉంటోందనీ, అయితే ప్రభుత్వం మాత్రం ఆర్థిక క్రమ శిక్షణ కంటే వచ్చే ఎన్నికలలో రాజకీయ ప్రయోజనమే లక్ష్యంగా రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతోందనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.