మా భూమి పట్టా పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు? పులివెందులలో వైఎస్ భారతిని నిలదీసిన రైతు!

కడప రాజకీయం మారిపోతోంది. ఆ జిల్లాలో వైఎస్ జగన్ ఆధిపత్యం రోజురోజుకూ తగ్గిపోతోంది. అసలు వైఎస్ కుటుంబానికి పెట్టని కోట లాంటి కడప జిల్లాలో ఆ కుటుంబంలో నిట్టనిలువుగా వచ్చిన చీలిక కారణంగా.. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబీకులకు ఎదురు నిలిచి మాట్లాడే పరిస్థితే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన వారితో ఎదురుపడి మాట్లాడటమే కాదు, నిలబెట్టి ప్రశ్నిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందులోనూ ఏపీ సీఎం సొంత నియోజకవర్గమైన కడపలో ఈ ధిక్కారం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవల సీఎం జగన్ పులివెందులలో పర్యటించిన సందర్భంలో పెద్ద సంఖ్యలో జనం నియోజకవర్గ సమస్యపై నిలదీశారు. నిరసన వ్యక్తం చేశారు. పోలీసు బందోబస్తుతో పరదాల చాటున తిరిగే జగన్ కు ప్రజలు పరదాలను చీల్చుకుని మరీ ఎదురుపడి నిలదీయడం ఇబ్బందికరంగా మారింది. అప్పట్లొ ఆయన జనం ప్రశ్నలకు తనదైన ప్రత్యేక చిరునవ్వుతో సమాధానం చెప్పకుండా వెళ్లి పోగలిగారు. కానీ ఎన్నికల వేళ ఆయన తరఫున నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి వైఎస్ భారతికి మాత్రం అటువంటి వెసులుబాటు దక్కలేదు. జనం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వారిని వదిలించుకు వెళ్లలేక తలవంచుకు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఔను భర్త జగన్ కోసం ప్రచారం చేస్తున్న వైఎస్ భారతికి ఓ సామాన్యుడు బాంబు లాంటి ప్రశ్న సంధించాడు. మా తాతముత్తాతల నుంచీ నాకు సంక్రమిచిన భూమి పట్టాపై ముఖ్యమంత్రి జగన్ పొటో ఎందుకని అతడు నిలదీశారు. ఆ వ్యక్తి పేరు భాస్కరరెడ్డి. అంటే జగన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. అంతే కాదు..ఆయన వైసీపీకి చెందిన వ్యక్తే. కుమ్మరంపల్లె మాజీ సర్పంచ్ భర్త. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమ్మరంపల్లె వచ్చిన భారతి మాజీ సర్పంచ్ ఇంటికి వెళ్లి జగన్ కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. అయితే భాస్కరరెడ్డి, తమ భూమికి సంబంధించిన పాస్ పుస్తకాన్ని చూపుతూ తన భూమి పట్టాపుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు అని నిలదీశారు. అలాగే రైతు భరోసా పేరుతో జగన్ రైతులకు ఇస్తున్నదేమిటని నిలదీశారు. రైతు భరోసాలో సగానికి పైగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందనీ, మరి జగన్ చేసిందేమిటని ప్రశ్నించారు. రైతు భరోసా సొమ్ములు పెంచాల్సిందిగా జగన్ కు చెప్పాలని భారతిని కోరారు. భాస్కరరెడ్డి సంధించిన ఈ ప్రశ్నలలో వేటికీ వైఎస్ భారతి సమాధానం చెప్పలేదు. భాస్కరరెడ్డి నిలదీస్తున్నంత సేపూ మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత మాట్లాడకుండా అక్కడ నుంచి కదిలి వెళ్లిపోయారు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో పార్టీల నేతలకు ప్రజల నుంచి డిమాండ్లు ఎదురు కావడం సహజమే. సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారంటూ నిరసనలు ఎదురుకావడం కూడా కద్దు. అయితే పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని నిలదీసి ప్రశ్నించడం అంటే అదో అసాధారణ ఘటనే. అదీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిని నిలబెట్టి ప్రశ్నించడం అన్నది ఎవరూ ఊహించను కూడా ఊహించలేరు. కానీ సోమవారం పులివెందులలో ప్రచారం సందర్భంగా ఈ చేదు అనుభవం సీఎం సతీమణికి ఎదురైంది. ఈ ఒక్క సంఘటన చాలు పులివెందుల నియోజకవర్గంలో జగన్ రెడ్డికి ఎదురుగాలి వీస్తోందని చెప్పడానికి.  వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని వెనకేసుకు రావడం, దానికి ఎత్తి చూపుతూ సొంత చెల్లి జగన్ పై విమర్శలు గుప్పించడంతో ఆ కుటుంబంలో చీలిక వచ్చిందనీ, నియోజకవర్గ ప్రజలు షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారనీ ఈ సంఘటనను ఉదహరిస్తూ స్థానికులు చెబుతున్నారు.   
Publish Date: Apr 30, 2024 2:16PM

ఓటరుకి ప్రజాస్వామ్యానికి పెళ్ళంట! శుభలేఖ అదిరిందంట!

ఎన్నికల సందర్భంగా ఎవరి ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళది. రాజకీయ నాయకులు ఎవరి స్థాయిలో వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. మధ్యలో ఇంకొంతమంది ఎవరికి తోచినట్టుగా వారు వినోదం పంచుతున్నారు. ఓటింగ్ మీద అవగాహన పెంచడం కోసం కొంతమంది వినోదాత్మక బాటను ఎంచుకున్నారు. ఓటరుకి, ప్రజాస్వామానికి పెళ్ళి చేస్తున్నామంటూ పూణెకి చెందిన కొంతమంది ఒక  వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను ముద్రించారు. ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వెడ్డింగ్ కార్డులో వధూవరుల పేర్ల స్థానంలో ప్రజాస్వామ్యం, ఓటరు అని రాసి వుంది. వివాహ వేదిక స్థానంలో ‘మీ పోలింగ్ కేంద్రం’ అని రాశారు. ‘ఓటు వేయడం మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. మన దేశాన్ని సుసంపన్నం చేసే దిశగా ముందడుగు వేయాలంటే పార్లమెంటులో మన గళాన్ని ప్రతిధ్వనించే మన ఓటును వినియోగించుకోవడం చాలా ముఖ్యం’ అని ఆ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.
Publish Date: Apr 30, 2024 2:13PM

బీజేపీ, వైసీపీ లవ్ స్టొరీ కంటిన్యూస్...?

మనసు ఒక చోట..మనువు ఒకచోట అన్నట్లుగా ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ వైఖరి ఉంది. గత ఐదేళ్లుగా వైసీపీ, బీజేపీల రహస్య మైత్రి ఎంత దృఢంగా కొనసాగిందో తెలిసిందే. అయితే   కేంద్రంలో అధికారాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి దక్షిణాది నుంచి కూడా మద్దతు అనివార్యం అన్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ పార్టీ పాతమిత్రులకు ఆహ్వానం పలికింది. ముఖ్యంగా ఏపీలో ప్రజాభిమానం మెండుగా ఉన్న తెలుగుదేశం అవసరం బీజేపీకి తప్పని సరి అయ్యింది. పాతిక లోక్ సభ స్దానాలున్న ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా ఒక్క స్థానంలో కూడా గెలిచే   అవకాశాలు లేని బీజేపీకి.. అక్కడ అధికార వైసీపీతో బంధం కంటే.. తెలుగుదేశంతో పొత్తు వల్లనే ఎక్కువ ప్రయోజనం, రాజకీయ లబ్ధి దొరుకుతుందని అర్ధమైంది. అందుకే  ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమితో జట్టు కట్టింది. పొత్తులో భాగంగా రాష్ట్రంలో తన వాస్తవ బలం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా  సీట్లనూ సంపాదించుకుంది. కేంద్రంలో అధికారంలో ఉంది కనుక బీజేపీ తమ జట్టులో ఉంటే జగన్ సర్కార్ ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్టపడుతుందనీ, కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందనీ తెలుగుదేశం, జనసేనలు భావించి.. కొన్ని త్యాగాలు సైతం చేశాయి. అయితే.. తెలుగుదేశం, జనసేనతో పొత్తు ముడి పడినా, మనసు మాత్రం వైసీపీతోనే ఉందని వరుసగా జరుగుతున్న పరిణామాలు పదేపదే రుజువు చేస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడగింపు విషయంలోనైతేనేమి, సీఎస్ జవహర్ రెడ్డి, ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలపై కూటమి నేతలు చేసిన ఫిర్యాదులను పట్టించుకోకపోవడం,  ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు జగన్, మోడీల రహస్య బంధం ఎంత పటిష్టంగా ఉందో అవగతం చేస్తున్నది. సాధారణంగా ఎన్నికల సమయంలో ఇన్ చార్జ్ ల స్థానంలో పూర్తి స్థాయి అధికారులను నియమించడం విధాయకం. అలాగే డెప్యూటేషన్ మీద ఉన్న అధికారులను కూడా మార్చేస్తారు. ఏమిటో మరి ఏపీ స్పెషల్. ఇక్కడ అలా జరగడం లేదు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలపై కూటమి నేతలు ఫిర్యాదులు చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన ఫిర్యాదును కూడా ఎన్నికల సంఘం బుట్టదాఖలు చేసినట్లు కనిపిస్తోంది. ధర్మారెడ్డి డెప్యుటేషన్ గడువు ముగుస్తున్న తరుణంలో ఆయనను టీటీడీ ఈవోగా మార్చడం ఖాయమనే అంతా భావించారు. రిటైర్మెంట్ ముందు సొంత శాఖకు పంపించేయడం ఆనవాయితీ. అయితే ధర్మారెడ్డి విషయంలో మాత్రం ఆ ఆనవాయితీని పాటించకుండా ఆయనకు పొడగింపు ఇవ్వడం జగన్, మోడీ బంధం కొనసాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సరే ఆనవాయితీలు అవీ పక్కన పెట్టినా..  ధర్మారెడ్డిని బదిలీ చేయాలని, ఆయన  తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉంటే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందే శ్వరి ఈసీతోపాటు కేంద్రానికీ లేఖ రాశారు. అలాగే  బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి సైతం  ధర్మారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన పలుకుబడి-అధికారాన్ని వైసీపీ విజయం కోసం వినియోగిస్తున్న ధర్మారెడ్డిని   బదిలీ చేయాలని ఈసీని కోరారు. అటు కూటమిలోని తెలుగుదేశం, జనసేనలు కూడా ధర్మారెడ్డిని తప్పించాలని కోరాయి.  కోరింది కూటమి కాబట్టి.. ఇంకేముంది ధర్మారెడ్డి బదిలీ ఖాయమనే అంతా భావించారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం  ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగించాలన్న జగన్ అభ్యర్ధనను ఓకే చేసింది. ఇదే జగన్ మోడీల మధ్య ఉన్న లవ్ స్టోరీ కంటిన్యూ అవుతోందన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది.  ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడగింపు కూటమి భాగస్వామ్య పక్షాలకు ఇస్తున్న సంకేతాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ ఏపీలో జగన్ మాటే కేంద్రంలో చెల్లుతుందన్న సంకేతాలు వెళితే ప్రజలకు కూటమి పట్ల విశ్వాసం ఎలా కలుగుతుంది? అసలు కూటమిలో బీజేపీకి తెలుగుదేశం, జనసేన ఓట్లు బదిలీ అవుతాయా?  అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం తెలుగుదేశం, జనసేన బలాన్ని వాడుకుని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు సాధించాలన్న వ్యూహంతోనే బీజేపీ ఏపీలో తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ఎన్నికల సమయంలో జగన్‌కు అనుకూలంగా ఉండే అధికారుల మార్పు, విపక్ష నేతలకు పోలీసు వేధింపులూ లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయన్న  భావనతోనే బీజేపీని కలుపుకున్నాం అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదని తెలుగుదేశం, జనసేనలు   అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.  ఎన్నికల సంఘం  జనసేన సింబల్ గ్లాసు గుర్తును ఇతరులకూ కేటాయిస్తోంది. డీజీపీ, సీఎస్‌ను ఇంతవరకూ మార్చలేదు. ధర్మారెడ్డిని మార్చమంటే, ఆయన డెప్యుటేషన్ పొడిగించారు.  బీజేపీతో జగన్ సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయని, ఆయనను మోడీ ఇప్పటికీ దత్తపుత్రుడిగానే చూస్తున్నారని చెప్పడానికి ఇంత కంటే నిదర్శనాలేం కావాలని తెలుగుదేశం, జనసేన శ్రేణులు అంటున్నాయి.   ఈ పరిస్థితిలో తెలుగుదేశం, జనసేన ఓట్లు బీజేపికీ బదిలీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఏపీలో ఎన్నికల నిబంధనలు సరిగా అమలయ్యేలా దృష్టి సారించాలనీ, అలా కాకుండా ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అంటూ నంగనాచి కబుర్లు చెబితే ఫలితం ఉండదనీ అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో రెండు దశల పోలింగ్ పూర్తయిన తరువాత ఉత్తరాదిలో బీజేపీ భారీగా నష్టపోతోందన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ విషయంలో జగన్ పార్టీకి వత్తాసుగా వ్యవహరిస్తే ఇక్కడ కూడా బీజేపీ తీవ్రంగా నష్టపోక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేవలం అధికారుల అండ, పోలీసుల దండతో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనీ, జనం డిసైడైపోతే డబ్బు అధికారం ఏవీ కాపాడలేవన్న సంగతి.. బీహార్, కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన తరువాతైనా బీజేపీ అర్థం చేసుకోకపోతే తగు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. 
Publish Date: Apr 30, 2024 1:36PM

కేసీఆర్ బస్సు యాత్ర ఆపేస్తారా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టారు. మే 10వ తేదీ వరకు ఆయన బస్సు యాత్రలో వివిధ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం చేయాలని సంకల్సించారు. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారంలో వున్న ఆయన మే 10వ తేదీ వరకు ఎన్నికల ప్రచారం చేస్తారా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సు సర్వ సదుపాయాలు వున్న ఏసీ బస్సు, బస్సులో కేసీఆర్‌కి అవసరమైన అన్ని ఏర్పాట్లు వున్నప్పటికీ బస్సు యాత్రను ఎక్కువ రోజులు కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్‌లో క్షీణిస్తున్న ఓపిక అని తెలుస్తోంది. బస్సు యాత్ర ప్రారంభించిన రెండు మూడు రోజుల్లో కేసీఆర్ మాట్లాడిన తీరుకు, ఇప్పుడు మాట్లాడుతున్న తీరుకు ఎంతో తేడా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. భయంకరమైన ఎండల  ఎఫెక్ట్.తోపాటు అధికారం కోల్పోయిన ఎఫెక్ట్, కూతురు జైల్లో వున్న ఎఫెక్ట్, వయసు పైబడిన ఎఫెక్ట్ కేసీఆర్ మీద ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు. దాంతో ఆయన చాలా వరకు నెమ్మదించారని చెబుతున్నారు. చెప్పిన విషయాలే చెప్పడం, తిట్టిన తిట్లే తిట్టడం లాంటి చేసినపనే చేయడం కూడా ఆయనకు నిరాసక్తత కలగడానికి కారణం అయి వుండవచ్చని అంటున్నారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఊహించని విధంగా అధికారం కోల్పోవడం, కవిత జైలుకు వెళ్ళడం కేసీఆర్‌ని బాగా కుంగదీశాయని అంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కి ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పక్క రాష్ట్రం తాలూకు ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సమాచారం అందుకునే నెట్ వర్క్ వున్న కేసీఆర్‌కి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటో కూడా తెలిసే వుంటుంది. కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చే అవకాశం వుందని వినిపిస్తున్న వార్తలు కూడా కేసీఆర్‌ని మరింత కుంగదీసి వుండవచ్చు. వయసు, వాతావరణ పరిస్థితులు, ఒత్తిడి, ప్రోత్సాహకరంగా లేని రాజకీయ పరిస్థితులు... ఇవన్నీ కేసీఆర్‌ బస్సు యాత్రని మధ్యలోనే ముగించేలా చేసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Publish Date: Apr 30, 2024 12:49PM

జనరంజకంగా కూటమి మేనిఫెస్టో

టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి మేనిఫెస్టో విడుదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. గతంలో సూపర్‌ సిక్స్‌ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టోను విడుదల చేసింది. సూపర్‌ సిక్స్‌ పేరుతో ఇచ్చిన ఆరు హామీలకు మరి కొన్ని అంశాలను జత చేసి ఇప్పుడు మూడు పార్టీలు కలిసి పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలోని కీలకమైన హామీలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు 2024 ఏప్రిల్ 30న మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి వెళుతున్న ఎన్డీఏ కూటమి మరికొన్ని హామీలతో ఈ మేనిఫెస్టోను తయారు చేసింది. పలు కీలకమైన హామీలతో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి మేనిఫెస్టో 2024ను రూపొందించారు. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో పింఛన్లు, మహిళలకు పథకాలపై ఫోకస్ పెట్టారు. సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలు ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు. వీటితో పాటుగా మెగా డీఎస్సీపై మొదటి సంతకం, సామాజిక పింఛను రూ.4 వేలకు పెంచడంతో పాటుగా.. ఇది 2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపచేస్తారు. దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు..బీసీలకు 50 ఏళ్లకే పింఛను అందిస్తామన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేస్తామని ఇప్పటికే ప్రకటించారు.యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి హామీలను ఇప్పటికే ఇచ్చారు. 'తల్లికి వందనం' కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం.. వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు వంటి హామీలు ఉన్నాయి. ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం.. నాణ్యమైన సామగ్రితో మంచి ఇంటి నిర్మాణం వంటి హామీలు కూడా చేర్చారు. ఇసుక ఉచితం.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.. ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.. భూ హక్కు చట్టం రద్దు.. కరెంటు ఛార్జీలు పెరగవు అంటున్నారు. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీని చేర్చారు. పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ.. పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.. నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ వంటివి ఉన్నాయి. రైతులకు గతంలో టీడీపీ ప్రభుత్వం అందించిన రాయితీ పథకాల పునరుద్ధరణ.. ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ. చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు కూడా ఉన్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు 11 నెలల క్రితమే రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో సూపర్‌ సిక్స్‌ పేరుతో మినీ మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేనతో పొత్తు ఖరారయ్యాక ఆ పార్టీతో సంప్రదించి మరికొన్ని హామీలను జోడించారు. టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు ఖాయమయ్యాక మూడు పార్టీల నేతలు ఉమ్మడి మేఫెస్టోపై కసరత్తు చేశారు. నేటి అవసరాలు తీరుస్తాం- రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం అంటూ ఈ మేనిఫఎస్టోను రూపొందించారు. సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతి కోసం మరిన్ని కొత్త పథకాలను ఎన్డీఏ కూటమి ప్రకటించింది. 2014-2019 మధ్య టీడీపీ కొన్ని పథకాలను అమలు చేసింది.. అయితే వాటిలో నిలిచిపోయిన వాటిని మళ్లీ అమలు చేయాలని నిర్ణయించారు. అన్న క్యాంటీన్‌లు, పండుగ కానుకలు వంటివి ఉన్నాయి. టీడీపీ గతంలో ప్రకటించిన సూపర్ సిక్స్‌ను ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రింట్‌, టీవీ, సోషల్ మీడియాలో ప్రకటనల రూపంలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.
Publish Date: Apr 30, 2024 12:29PM

పతనం దిశగా రామ్‌దేవ్ పతంజలి!?

రామ్‌దేవ్ బాబా చిచ్చరపిడుగులాగా యోగాసనాలు చేస్తుంటే జనం చూశారు. చప్పట్లు కొట్టారు. ఆయన అక్కడితో ఆగకుండా తన స్నేహితుడు బాల‌కృష్ణతో కలసి పతంజలి ఉత్పత్తుల సంస్థని ప్రారంభించారు. తనకున్న ఛరిష్మాతో పతంజలి ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్ సృష్టించి బాగానే సొమ్ము చేసుకున్నారు. పతంజిలి సంస్థ ఆయుర్వేద మందులు, ఉత్పత్తులు అమ్ముకుని ప్రశాంతంగా ఉంటే ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండేది కాదు. ఆధునిక అల్లోపతి వైద్యాన్ని విమర్శిస్తూ ప్రకటనలు జారీ చేయడమే పతంజలి సంస్థ పతనానికి బీజం పడేలా చేసింది. ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా మందులు తయారు చేయడం కూడా దీనికి తోడైంది. చివరికి విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి రామ్‌దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టుకు పదేపదే క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిలా వుంటే, పతంజలి సంస్థకు చెందిన పలు ఔషధాల తయారీ మీద ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది. స్వసరి గోల్డ్,  దృష్టి ఐ డ్రాప్స్, బ్రోన్‌కమ్, స్వసరి ప్రవాహి, లివొగ్రిట్, స్వసరి అవలేహ్, లిపిడామ్,స్వసరి వాటి, బీపీ గ్రిట్, మధుగ్రిట్, మధునషిని వాటి ఎక్స్ ట్రా పవర్, ముక్తా వాటి ఎక్స్‌ట్రా పవర్, లివమ్రిత్ అడ్వాన్స్, ఐగ్రిట్ గోల్డ్... నిషేధిత మందుల జాబితాలో వున్నాయి. 
Publish Date: Apr 30, 2024 12:12PM