జగన్ లండన్ యాత్ర.. కథ చెప్పిన మంత్రి బుగ్గన

జగన్ పాలనలో కథలు అల్లడంలో పోలీసులు, మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఇనుము దొంగలు కోర్టులో కీలక పత్రాలను చోరీ చేశారని పోలీసులు కథలల్లితే, హోంమంత్రి తానేటి వనిత రేపల్లె రైల్వే స్టేషన్లో సామూహిత అత్యాచారానికి పాల్పడిన వారికి అసలా ఉద్దేశమే లేదనీ, చోరీకి వచ్చిన వారు పొరపాటున అత్యాచారం చేశారనీ మరో కథ అల్లారు. తాజాగా ఇప్పుడు మంత్రి బుగ్గన జగన్ లండన్ ల్యాండింగ్ పై మరో స్టోరీ చేప్పారు. 

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ లండన్ ల్యాండింగ్ కు కారణం ఎయిర్ ట్రాఫిక్ అట. దావోస్ కు అని బయలు దేరి జగన్ లండన్ లో ప్రత్యక్షం అయినట్లు అంగీకరించిన ఏపీ సర్కార్.. ఆయన లండన్ లో ల్యాండ్ కావడానికి కారణం ఎయిర్ ట్రాఫిక్ అధికంగా ఉండటమే కారణమని వివరణ ఇచ్చింది.

ఈ వివరణ ఇచ్చింది మంత్రి, ముఖ్యమంత్రి దావోస్ పర్యటన బృందంలో సభ్యుడు అయిన బుగ్గన రాజేంద్రనాథ్. ఎవరూ నమ్మడానికి వీల్లేని పకడ్బందీ కథ చెప్పారని సామాజిక మాధ్యమంలో బుగ్గన కథనంపై ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇంతకీ బుగ్గన చెప్పినదేమిటంటే.. గన్నవరం విమానాశ్రయంలో ప్రైవేటు విమానంలో బయలు దేరిన జగన్( దీనికి అద్దె గంటకు ఐదు లక్షల రూపాయలు మాత్రమే) ఇంధనం నింపుకోవడానికి ఇస్తాంబుల్ లో ఆగింది.అక్కడ ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది.

దీంతో పాపం అనివార్యంగా ఇస్తాంబుల్ లో జాప్యం అయ్యింది. దాంతో లండన్ ఎయిర్ పోర్టుకు చేరడానికి మరింత ఆలస్యం అయ్యింది. లండన్ లో కూడా ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా ఉండటంతో జ్యూరిచ్ లో ల్యాండ్ అయ్యేందుకు ట్రావెల్ షెడ్యూల్ టైం దాటిపోయింది.  దాంతో అధికారులు మళ్లీ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారట. ఈ జాప్యం కారణంగానే జగన్ లండన్ లో బస చేయాల్సి వచ్చిందట. జ్యూరిచ్ లో ల్యాండింగ్ కు అనుమతి వచ్చినప్పటికీ పైలట్లు అలసిపోయి ఉండటంతో బయలు దేరలేదట. డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలట్టు నిర్ణీత సమయం విశ్రాంతి తీసుకున్న తరువాతే జగన్ ప్రత్యేక ఫ్లైట్  (మరోసారి గుర్తు చేసుకోవాలి ఈ ఫ్లైట్ అద్దె గంటకు ఐదు లక్షల రూపాయలు మాత్రమే.) బయలుదేరిందట. ఇక్కడ మంత్రివర్యులు బుగ్గన  చెప్పని విషయం ఏమిటంటే.. జ్యూరిచ్ వెళ్లేందుకు లండన్ వెళ్లాల్సిన అవసరమే లేదు.  ఇన్ని అవాస్తవాలు, అబద్ధాలతో జగన్ లండన్ బసను కవర్ చేయడానికి బుగ్గన ప్రయత్నిస్తున్నారంటేనే ఏదో మతలబు ఉందని పరిశీలకులు అంటున్నారు.