Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భోగాపురం విమానాశ్రం ప్రారంభోత్సవం.. క్రెడిట్ చోరీకి జగన్ యత్నాలు.!
posted on: Jul 30, 2026 4:53PM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల.. మరో రెండు రోజుల్లో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆగస్టు 1న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవాన్ని కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ఒక వేడుకగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేసే ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పురోగతికి బాటలు పడతాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అయితే ఇక్కడే వైసీపీ తీరు నగుబాటు అవుతోంది. ఈ విమానాశ్రయ నిర్మాణ క్రెడిట్ కొట్టేయడానికి వైసీపీ పడుతున్న ఆత్రం, తాపత్రయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వంటి ఉత్తరాంధ్ర నాయకులు సహా .. పలువురు.. విమానాశ్రయం క్రెడిట్ వైపీపీ ఖాతాలో వేసేందుకు నేల విడిచి సాము చేస్తున్నారు. 2023 మేలో అప్పటి సీఎం జగన్.. ఈ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారనీ, స్వల్ప వ్యవధిలోనే పనులను పరుగులు తీయించారనీ ఊరూవాడా ఏకం చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే అదే సమయంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో భోగాపురం విమానాశ్రయ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పాత వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండడం ఆ పార్టీని ఇరకాటంలోకి పడేయడమే కాకుండా.. నాటి విమర్శలు, నేటి క్రెడిట్ డ్రామాలపై నెటిజనులు పెద్ద ఎత్తున జగన్ ను, వైసీపీనీ ట్రోల్ చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేళ జగన్, వైసీపీ క్రెడిట్ చోరీ ప్రయత్నాలు వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న విశేష సానుకూల స్పదన వైసీపీకి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఈ సానుకూలత.. ఉత్తరాంధ్రలో వైపీపీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందా అన్న భయం ఆ పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర నేతల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆ భయంతోనే ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్లు మీడియా ముందుకు వచ్చి క్రెడిట్ జగన్ కు, వైపీపీకీ అపాదించడానికి శతధా ప్రయత్నిస్తున్నారు.
అయితే ఆ ప్రయత్నాలకు నెటిజనులు జగన్మోహన్ రెడ్డి పాత ప్రసంగాల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తూ గండి కొడుతున్నారు. గతంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణ సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన క్రెడిట్ చోరీ యత్నాలను ప్రజల ముందు బ్లాక్ అండ్ వైట్ లో ఎండగడుతున్నాయి. ఎర్ర బస్సే సరిగా రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు, అయినా ఇప్పటికే పక్కనే విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండగా, మళ్ళీ వేల ఎకరాలు ధారబోసి భోగాపురంలో ఇంకో విమానాశ్రయం నిర్మించడం దేనికి? అంటూ ఆయన చేసిన విమర్శలు, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి. ఒక ప్రాజెక్టుపై అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా మాట్లాడడం వైసీపీ స్థిరత్వం లేని రాజకీయాలకు అద్దం పడుతోందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
భోగాపురం విమానాశ్రయం అంశంలో గతంలో భూసేకరణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన నాటి ప్రతిపక్షం, అధికారంలోకి వచ్చాక కూడా నిర్మాణాన్ని ఏళ్ల తరబడి జాప్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలోనే విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ మెజారిటీ భాగం పూర్తయి, శంకుస్థాపనకు సిద్ధమైనప్పటికీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సమీక్షల పేరుతో పక్కన పెట్టిందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఆ తర్వాత సుదీర్ఘ కాలం అలసత్వం వహించి.. పదవీ కాలం ముగిసే ముందర 2023లో అరకొరగా శంకుస్థాపన డ్రామాలు ఆడారనీ, ఇప్పుడు తీరా ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రపంచ స్థాయి ఎయిర్‌పోర్ట్ ప్రారంభమవుతుంటే మధ్యలో వచ్చి క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Bhogapuram International Airport, YS Jagan Mohan Reddy, AP Politics, Narendra Modi Bhogapuram Airport, Dharmana Prasada Rao YSRCP



.webp)


