జగన్ హెల్త్‌కి అసలేమైంది?


 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన రెడ్డికి కేసులు కొత్తకాదు... కోర్టుల చుట్టూ తిరగడం కొత్తకాదు.. ఎన్నికలలో ఆయన పార్టీ ఓటమి పాలు కావడమూ కొత్తకాదు..  గతంలో ఇలాంటి  అనుభవాలు ఎన్నిసార్లు కలిగినా, జనంలోకి వస్తే ముఖం మీద చిరునవ్వు చెరగకుండా కనిపించే ఆయన ఇటీవలి కాలంలో ముఖం వాడిపోయి, బక్క చిక్కినట్టుగా, ముఖం మీద చిరునవ్వు లేకుండా కనిపిస్తున్నారు. పైగా ఎప్పుడూ క్లీన్ షేవ్‌లో కనిపించే ఆయన గత కొద్ది రోజులుగా కేశ సంస్కారం లేకుండా కనిపిస్తు్న్నారు. జగన్‌లో ఈ ఆకస్మిక మార్పుకి కారణమేంటి? ఒకవైపు నంద్యాలలో ఘోర పరాజయం, ఇంకో వైపు కాకినాడలో దారుణమైన అవమానం, ఇంకోవైపు జగన్ పాదయాత్ర చేయాలనుకుంటున్నది కోర్టుకు హాజరు నుంచి తప్పించుకోవడానికేనని సాక్షాత్తూ హైకోర్టే వ్యాఖ్యానించడమా? ఇవేవీ కాకుండా... నంద్యాలలో ప్రచారం ముగియగానే తన ఆరోగ్యం బాగాలేదంటూ జగన్ కాకినాడకు దూరంగా వున్నారు.. జగన్‌కి నిజంగానో ఆరోగ్యం బాగాలేదా? ఇంతకీ జగన్ ఆరోగ్యానికి ఏమైంది?

 

తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు ఆరోగ్యం క్షీణించాలని, ఆయనకు ఏదో జరిగిపోయి తాను ముఖ్యమంత్రి అయిపోవాలని జగన్ కలలు కంటూ వుంటారు. అలాంటి ఇప్పుడు చెడపకురా చెడేవు అనే సామెతలాగా జగన్ ఆరోగ్యమే క్షీణిస్తోందా? ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఈ ఆందోళన పెరిగిపోయింది. దెబ్బమీద దెబ్బ అన్నట్టుగా జగన్‌కి షాక్ వెంట షాకులు మొత్తం మూడు షాకులు తగిలాయి. ఆ షాకుల ప్రభావం వల్ల జగన్  డల్ అయిపోయారా? లేక నిజంగానే ఆరోగ్యం బాగాలేదా అనే విషయంలో క్లారిటీ లేక వైసీపీ వర్గాలు తల్లడిల్లుతున్నాయి. గతంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా, నెలల తరబడి జైల్లో వుండి వచ్చినా ఎంతమాత్రం తొణకని, బెణకని జగన్ ఇప్పుడు ఇంతలా నీరసించిపోవడం పార్టీ వర్గాల్లో ఆందోళన పెంచుతోంది.

 

అసలింతకీ జగన్ ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్య ఏమిటనేది వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయినదానికీ, కానిదానికీ అనవసరంగా ఆవేశపడిపోవడం వల్ల బీపీ పెరిగిపోయిందా? లేక మరేదైనా  అనారోగ్య సమస్య తలెత్తిందా అని అనుకుంటున్నారు. పాదయాత్ర మీద హైకోర్టు కామెంట్లు చేయడం వల్ల ఇప్పట్లో జగన్ పాదయాత్ర చేసే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ పాదయాత్ర మీద న్యాయమూర్తులు ఎలాంటి  వ్యాఖ్యలు చేయపోయినట్టయితే జగన్ తప్పనిసరిగా పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వుండేది. అసలే క్షీణించిన ఆరోగ్యంతో వున్న జగన్ సహజంగానే పాదయాత్ర చేయలేకపోయేవారు. అది అధికార తెలుగుదేశానికి అడ్వాంటేజ్‌గా మారేది. తిడితే తిట్టిందిగానీ, కోర్టు మంచికే తిట్టిందనే అభిప్రాయంలో వైసీపీ వర్గాలు వున్నాయి. తమ నాయకుడు మళ్ళీ పూర్తి ఆరోగ్యాన్ని పొంది అధికార పార్టీని తిట్టే పనిలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నాయి.