Latest News

తెదేపా-వైకాపాల రాజకీయ యుద్ధం మళ్ళీ షురూ

posted on: Jun 11, 2014 6:51AM

 

ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తెదేపా, వైకాపాలు రెండూ కూడా ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకోకుండా నిన్న మొన్నటి వరకు సంయమనం పాటించాయి. ఎప్పుడూ చంద్రబాబును తిట్టిపోసే జగన్ కు చెందిన సాక్షి మీడియా కూడా చంద్రబాబు కార్యక్రమాల వివరాలు ప్రసారం చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ మళ్ళీ జగన్ చంద్రబాబుపై వ్యవసాయ రుణాల విషయంలో యుద్ధం ప్రకటించగానే సహజంగానే సాక్షి మీడియా కూడా ఆయనను అనుకరిస్తూ యధాప్రకారంగా చంద్రబాబుపై విమర్శలు మొదలుపెట్టేసింది. కానీ మోడీ ప్రభుత్వం గురించి మాత్రం నేటికీ సాక్షి మీడియా నాలుగు మంచి ముక్కలే చెపుతోంది. ఓటమిపాలయిన జగన్మోహన్ రెడ్డే స్వయంగా తమ ప్రభుత్వంపై యుద్ద శంఖం పూరించడంతో, విజయోత్సాహంతో ఉన్న తెదేపా నేతలు కూడా వైకాపాతో యుద్దానికి ‘సై’ అనడంతో రాష్ట్ర రాజకీయాలు మళ్ళీ క్రమంగా వేడెక్కసాగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తూ బహిరంగ లేఖలు వ్రాస్తుంటే దానికి సాక్షి మీడియా వంత పాడుతోంది. అందుకు తెదేపా నేతలు కూడా అంతే ఘాటుగా ప్రతివిమర్శలు చేయడమేకాక, పరిటాల సునీత, గాలి ముద్దుకృష్ణం నాయుడు వంటివారు తమ ప్రభుత్వం త్వరలోనే జగన్మోహన్ రెడ్డిపై ఉన్న వివిధ కేసులను వేగవంతం చేస్తుందని స్పష్టం చేసారు. వారు చెపుతున్నట్లుగా ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై చర్యలకు ఉపక్రమిస్తే ఆ రెండు పార్టీల మధ్య యుద్ధం మళ్ళీ పతాకస్థాయికి చేరుకోవడం ఖాయం.

 

ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తమపై తెదేపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైకాపా ఆరోపిస్తే, తెదేపా నేతలు చట్టం తనపని తాను చేసుకుపోతుందనో లేకపోతే చట్టం నుండి ఎవరూ ఎల్లకాలం తప్పించుకోలేరనో ‘స్టాండర్డ్ సమాధానం’ చెప్పవచ్చును. దానితో ఆ రెండు పార్టీల యుద్ధం మళ్ళీ పతాక స్థాయికి చేరవచ్చును. ఏమయినప్పటికీ, అవినీతి విషయంలో మోడీ ప్రభుత్వం తన స్వంత మంత్రులనే ఉపేక్షించేందుకు సిద్దంగా లేదని స్పష్టమవుతోంది గనుక అనేక కేసులలో A-1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి మున్ముందు మళ్ళీ కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు తప్పకపోవచ్చును. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తెదేపాపై తన యుద్ధం కొనసాగిస్తూనే ఉండవచ్చును. తెదేపా కూడా అంతే ధీటుగా బదులివ్వకామానదు. అయితే రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకోవలసిన సమయంలో ఆ రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు ఈవిధంగా రాజకీయ యుద్ధం చేయడాన్ని ప్రజలు మాత్రం హర్షించరనే సంగతి అవి గ్రహిస్తే బాగుంటుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...