నిరుద్యోగ తేనెతుట్టును కదిపారా.. జగన్ కు మూడినట్టేనా? 

గొప్ప కోసం పోతే...తిప్పలు తప్పలేదా? జగన్ అనవసరంగా తేనెతుట్టును కదిపారా? అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. చేయలేనప్పుడు చేయలేననే చెబుతానని గతంలో రైతు రుణ మాఫీపై గట్టిగా నొక్కి చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చాక ఎందుకిలా మేనేజ్ చేయాలని చూస్తున్నారో అర్ధం కావడం లేదనే కామెంట్లు వినపడుతున్నాయి. జాబ్ క్యాలెండర్ అంటూ ఆయన చేసిన హంగామా నిరుద్యోగులను రోడ్డెక్కించింది. మనసులోనే మదనపడుతూ ఆవేదన చెందుతున్నవారిని ఆవేశంతో బయటకు రప్పించింది. ఏదో ఇస్తాడు.. చేస్తాడు..విన్నాడు..ఉన్నాడు లాంటి స్లోగన్లు వినివినీ ఉన్నవారికి ఈ క్యాలెండర్ తగలబెట్టాలన్నంత కోపం వచ్చేసింది. కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్..అవి కూడా డిపార్టుమెంట్లు మారినవాటిని కూడా ఉద్యోగాల్లా లెక్కేసి చెప్పడంతో ముందు షాకైనా..తర్వాత తిట్టుకోవడం మొదలెట్టారు నిరుద్యోగులు.

ప్రతి ఏడాది డీఎస్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చిన పెద్దమనిషి.. ఇప్పుడు ఇలా తూతూ మంత్రం క్యాలెండర్ ఇవ్వడంతో వారికి మండిపోతోంది.అందుకే దాదాపు అన్నిజిల్లాల్లో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారికి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం చెప్పలేదు ఆందోళనలు చేయమని..కాని వారే స్వచ్చంధంగా రోడ్డుమీదకు వచ్చి నిరసన చేస్తుండటంతో.. టీడీపీ నేతలు సైతం అలర్టయ్యారు.
గౌరవవేతనానికి పనిచేసే వలంటీర్లను, మినిమమ్ శాలరీకి చేస్తున్న సచివాలయ ఉద్యోగులను లెక్కేసి లక్షల ఉద్యోగాలిస్తున్నట్లు ప్రకటించుకోవడం జగన్ కే చెల్లిందనే కామెంట్లు వస్తున్నాయి. అంతే కాదు వారికిచ్చేదానికన్నా..వారితో చేయించుకునే పనులు మాత్రం వంద రెట్లు ఉంటున్నాయని.. పైగా వారు రాజకీయంగా అధికారపార్టీకే పనిచేయాలని ఓపెన్ గానే ఆదేశాలిస్తున్నారని.. ఆ ఇబ్బందులు పడుతూనే ఉద్యోగాలు చేస్తున్నవారు... జగన్ ప్రకటనలు చూసి నివ్వెరపోతున్నారు. జీతం పెంచమంటే మీది ఉద్యోగమే కాదన్నవాడు.. నేడు ఉద్యోగాల లెక్కల్లో తమని చూపించడంతో ఏమనాలో అర్ధం కాక అయోమయంగా చూస్తున్నారు.

హెల్త్ వర్కర్లు, నర్సింగ్ కలిపే 7 వేలు పైనఉండగా..మొత్తం 10 వేల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ అని ప్రకటించడం..హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. హెల్త్ డిపార్ట్ మెంట్ లో చేసే రిక్రూట్ మెంట్లు అన్నీ కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద ఇచ్చే నిధులతోనే అని కూడా వారు క్లారిటీ ఇస్తున్నారు. గ్రూప్ 1, 2 రెండు కేటగిరీలు కలిపి 36 పోస్టులు ఉన్నట్లు చూపించారు.

లెక్కల తప్పులు సంగతి తర్వాత..అసలు ప్రకటించినదానినైనా సక్రమంగా అమలు చేస్తారా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం..వీటికి బడ్జెట్ కేటాయింపులు చేసి అన్నీ అయ్యేసరికి..పుణ్యకాలం దాటిపోతుందని.. ఈలోపు నోటిఫికేషన్లు, పరీక్షల పేరుతో క్యాలెండర్ ఫాలో అయి..అసలు రిక్రూట్ మెంట్ మాత్రం చేయరనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఏమైనా అసలే ఆర్ధిక సంక్షోభం, ఆ పై కోవిడ్ సంక్షోభంతో అల్లాడిపోయి అలిసిపోయి ఉన్న ప్రజలను..జగన్ మేలుకొలిపినట్లయింది ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటనతో.  ఈ సంక్షోభాలతో ప్రైవేటులో ఉన్న ఉద్యోగాలు కూడా పోయి నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో వారంతా ఇప్పుడు ఆగ్రహావేశాలతో ఆందోళనలకు దిగుతున్నారు. జగన్ కదిపిన ఈ తేనెతుట్టు.. ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రాజకీయంగా ఇది తమకు నష్టమే చేస్తుందని వైసీపీ నేతలు కూడా గింజుకుంటున్నారని తెలుస్తోంది.