Top Stories

గబ్బర్‌సింగ్ ట్రీట్‌మెంట్ రుచి చూస్తున్న పోసాని

సినీ ఇండస్ట్రీలో కామెడీ క్యారెక్టర్‌ ఇమేజ్‌తో అంతో ఇంతో డిమాండ్ ఉన్న టైమ్‌లో వైసీపీలోకి వచ్చి .. అటు సినీ అవకాశాలు తగ్గిపోయి, ఇటు పొలిటికల్‌గా ఏం సాధించలేక, సెల్ఫ్ గోల్ చేసుకున్నారు వైసీపీ నేత,  సినీ నటుడు పోసాని కృష్ణమురళి. ఇండస్ట్రీలో డిమాండ్ తగ్గిపోయినా ఇప్పుడు ఆయనకు ఇంకో రకంగా డిమాండ్ పెరిగిపోతోంది . రాజంపేట సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఇంకా ఆయనపై వస్తున్న ఫిర్యాదులకు అయితే లెక్కే లేదు. కేసులు నమోదైన పోలీసు స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు.  ప్రస్తుతం 3 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు. మేం కోర్టు అనుమతి తీసుకున్నాం,  ముందుగా మాకే పోసానిని అప్పగించాలి అని నరసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోసానిని విచారించడానికి పల్నాడు జిల్లాకు షిఫ్ట్ చేశారు. అక్కడ విచారణ అనంతరం నరసరావుపేట కోర్టులో హాజరు పరచడంతో ఆయనకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ని నరసరావుపేట సబ్‌జైలుకు తరలించారు. అయితే పోసానిని విచారించాలని వివిధ జిల్లాల పోలీసులు పీటీ వారెంట్లతో జైళ్లకు క్యూ కడుతున్నారు. దాంతో ఎప్పుడు ఏ జిల్లా పోలీసుల కస్టడీకి పోసానిని అప్పగిస్తారనేది సస్పెన్స్‌గా మారింది. ఈ  వ్యవహారం అంతా చూస్తూ మొత్తానికి పోసానికి ఇప్పుడు ఇలా డిమాండ్ పెరిగిపోతోందన్న సెటైర్లు తెగ వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళీ ఏ రేంజ్ లో చెలరేగిపోయారో వేరే చెప్పనక్కర్లేదు.  జనసేనాని పవన్‌కళ్యాణ్‌తో పాటు ఆయన ఫ్యామిలీని ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు. సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులతో పాపులర్ అయిన పోసాని, పాలిటిక్స్‌లో డైరెక్ట్‌గా బూతు ప్రయోగాలతో అసహ్యకరమైన  ట్రెండ్‌కు తెర లేపారు. తన నోటి దూకుడుతో పవన్, ఆయన భార్య పిల్లలు,  ఇత‌ర కుటుంబ స‌భ్యుల గురించి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడారు. తనకు కూడా పెళ్లాం బిడ్డలు ఉన్నారన్న విషయం మర్చిపోయినట్లు జుగుప్సాకరమైన భాషతో పవన్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఆఖరికి రాజకీయాల నుంచి రిటైర్ అయి పద్దతిగా తన సినిమాలు తాను చేసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవిని కూడా పోసాని వదలి పెట్టలేదు. పీఆర్పీతో వ్యాపారం చేశారని, కాపులకు వెన్నుపోటు పొడిచారని అవాకులు, చెవాకులు పేలారు. వైసీపీ అధికారంలో వుండ‌డంతో అప్పట్లో జనసైనికులు  పోసానిపై ఎన్ని కేసులు పెట్టినా పోలీసులు యాక్షన్ తీసుకోలేదు . కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జ‌న‌సేన నాయ‌కులు మళ్లీ ఫిర్యాదు చేయడంతో కడప జిల్లా పోలీసులు గంట‌ల వ్యవ‌ధిలోనే హైద‌రాబాద్‌కు వెళ్లి పోసానిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు . వైసీపీ గద్దె దిగాక కూడా కొంత కాలం పోసాని తన నోటికి పని చెప్తూనే వచ్చారు.  టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ముఖ్యమంత్రిపై తన స్టైల్లో నోరు పారేసుకున్నారు. ఇంత జరిగాక రెండు నెలల క్రితం మీడియా ముందుకొచ్చి, తనకు జ్ఞానోద‌యం అయిందని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ఇకపై తనకు రాజకీయాలకు సంబంధంలేదని  ప్రకటించి సెంటిమెంట్ పండించాలని చూశారు. టీడీపీ , జనసేన నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు పోసాని  క్షమాపణలు కూడా కోరారు. మంత్రి నారా లోకేష్‌కి తన పట్ల సాఫ్ట్ కార్నర్ ఉందని, పార్టీలోకి కూడా ఆహ్వానించారనే విషయాన్ని పోసాని గతంలోనే వెల్లడించారు. ఆ క్రమంలో పోసాని క్షమాపణలు కోరడంతో, ఆయన ఆరోగ్య రీత్యా కేసుల విషయంలో నారా లోకేష్  వెయిట్ అండ్ సీ పాలసీ అవలంబిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఓవర్ నైట్ పోసాని ఏపీ పోలీసులకు బుక్ అయ్యారు. ఈ సడన్ ట్విస్ట్ వెనుక డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పట్టుదలే కారణమంట. తన తల్లి, ఫ్యామిలీ మెంబర్స్‌పై పోసాని కామెంట్స్‌ చేయడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్‌, ఆయన వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారంట. దానికి తగ్గట్లే పోసానిపై జనసైనికులు వరుసగా కేసులు పెట్టారు.. ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి..  పవన్‌ కల్యాణ్‌, ఆయన కుటుంబసభ్యులపై చేసిన కామెంట్స్‌ను అటాచ్ చేస్తూ జనసేనికులు పోసానిపై కంప్లైంట్లు గుప్పిస్తున్నారు.. పోసానిని అరెస్ట్ చేసిన కడప జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌‌లో నమోదైన కేసు కావచ్చు, పీటీ వారెంట్‌తో నరసరావుపేట పోలీసులు ఆయన్ని విచారణకు తీసుకెళ్లిన కేసు ఇవన్నీ పవన్‌పై పోసాని చేసిన కామెంట్స్‌కు సంబంధించినవే కావడం గమనార్హం.  ఎవ‌రైనా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విమ‌ర్శలు చేస్తే, జైలు కెళ్లక త‌ప్పద‌ని జనసేన పీఏసీ చైర్మన్,  మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించడం పవన్ పట్టుదలకు నిదర్శనంగా చెబుతున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే స‌హించేది లేద‌ని, అలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడ‌ని ఆయ‌న ప‌రోక్షంగా పోసాని విష‌యాన్ని గుర్తు చేశారు..  నాదెండ్ల ప‌వ‌న్‌పై ఎవ‌రైనా ఏమైనా మాట్లాడితే, పోసానికి ప‌ట్టిన గ‌తే పడుతుందని ఇన్‌డైరెక్ట్‌గా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను భవిష్యత్తు చెప్పేశారు నాదెండ్ల. మొత్తమ్మీద పోసాని  కేసులు చక్రబంధంలో చిక్కుకుపోయారు.. చేసుకున్నోడికి చేసుకున్నంత... అన్నట్లు జగన్ మెప్పు కోసం బూతు పురాణాలు వినిపించిన పోసానికి తగిన శాస్తే జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.. మరిక  పీటీ వారెంట్ల ఎఫెక్ట్‌తో పోసాని ఇంకెన్ని జిల్లాల పోలీసు స్టేషన్ల మెట్లు ఎక్కుతారో చూడాలి.
గబ్బర్‌సింగ్ ట్రీట్‌మెంట్ రుచి చూస్తున్న పోసాని Publish Date: Mar 4, 2025 11:28AM

రేపటి నుంచే తెలంగాణ ఇంటర్ పరీక్షలు... ఐదునిమిషాలు ఆలస్యమైనా అనుమతి 

తెలంగాణ ఇంటర్ బోర్డు  విద్యార్థులకు గుడ్ న్యూస్  చెప్పింది. ఇప్పటివరకు పరీక్షా కేంద్రానికి ఒక్క నిమషం ఆలస్యమైనా అనుమతించేవారు కాదు. ఆ నిబంధనను సడలించింది.  ఐదు నిమిషాలు ఆలస్యమైనా  పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య  మంగళవారం తెలిపారు. బుధవారం  (5వ తేదీ) నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు  ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో  వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతాయి.  ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. 9.05 గంటలకు వచ్చినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలో  అనుమతిస్తారు. 8.45 గంటల నుంచి 9 గంటల వరకు ఓఎంఆర్ పత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.  
రేపటి నుంచే  తెలంగాణ ఇంటర్ పరీక్షలు... ఐదునిమిషాలు ఆలస్యమైనా అనుమతి  Publish Date: Mar 4, 2025 11:17AM

మెగా ఫ్యామిలీ నుంచి మూడో అమాత్యుడు.. నాగబాబుకు కన్‌ఫర్మ్ అయిన ఎమ్మెల్సీ పదవి!

ఏపీ క్యాబెనెట్లో ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవి జనసేనాని సోదరుడు, మెగా బ్రదర్ నాగబాబుకు‌ కన్‌ఫర్మ్ అయినట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ దిశగా కూటమి పార్టీలు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశాయి. నాగబాబుని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారంట. తాజాగా శాసనసభలో భేటీ అయిన సీఎం, డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సహా వివిధ అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై ఇద్దరూ కొద్ది సేపు చర్చించినట్లు తెలిసింది. ఆ క్రమంలో ఎన్నికలు జరగనున్న ఐదు స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఖరారు చేశారంట. సీఎం చంద్రబాబు శాసనసభలో తన స్థానంలో కూర్చుని ఉండగా.. పవన్‌ కల్యాణ్‌ ఆయన వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చుని కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి ఛాంబర్‌కు వెళ్లారు. రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయింపులపై పవన్‌ కల్యాణ్‌ ఈ సందర్భంగా తన అభిప్రాయాలు చెప్పడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావన తెచ్చారంట. మొత్తం మీద నాగబాబుని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేయాలని నిర్ణయించడంతో.. ఇక ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం లాంఛనంగానే కనిపిస్తుంది.   ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ, ఆరు కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నాగబాబు కొణిదెల ఫ్యామిలీ నుంచి మూడో మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
మెగా ఫ్యామిలీ నుంచి మూడో అమాత్యుడు.. నాగబాబుకు కన్‌ఫర్మ్ అయిన ఎమ్మెల్సీ పదవి! Publish Date: Mar 4, 2025 11:13AM

ట్రంప్ కు జెలన్ స్కీ ఝలక్.. కక్కలేక, మింగలేక అమెరికా అధ్యక్షుడు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఝలక్ ఇచ్చారు. తాను ఉక్రెయిన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటాననీ, అయితే ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వాలని కండీషన్ పెట్టారు. దీంతో ట్రంప్ పరిస్థితి కక్కలేకా, మింగలేకా అన్నట్లుగా తయారైంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడానికి చాలా కారణాలు ఉండొచ్చు కానీ, తాను అధికారంలోకి రాగానే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానన్న హామీ కూడా ఆ కారణాలలో కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఆ విషయం తెలుసు కనుకనే ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్యలు ఆరంభించారు. అయితే మధ్యవర్తిగా ఇరు దేశాల మధ్యా రాజీనామా చేయాల్సిన ట్రంప్ అందుక భిన్నంగా ఏకపక్షంగా వ్యవహరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిని రాజీనామా చేయాలని, అలాగే ఉక్రెయిన్ కూడా త్యాగాలకు సిద్ధపడాలని షరతులతో కూడిన సంధికి జెలెన్ స్కీని ఒప్పించేలా ఒత్తిడి తెచ్చాడు. ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం అన్న మాటే మరచిపోవాలని దాదాపు హుకుం జారీ చేశారు. అయితే ఇందుకు జెలన్ స్కీ గట్టి బదులే ఇచ్చారు.    నాటో సభ్యత్వం తన లక్ష్యమనీ, దేశాధ్యక్ష పదవి తనకేం ప్రధానం కాదనీ కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇస్తే.. అధ్యక్షుడిగా తాను దిగిపోతాననీ, రాజీనామా చేస్తాననీ షరతు పెట్టారు.  ట్రంప్ తో విభేదించిన తరువాత లండన్ చేరిన జెలెన్ స్కీ అక్కడ యూరోపియన్ దేశాల సమావేశంలో మాట్లాడారు. ఆ సందర్భంగా ట్రంప్ కు ఈ షరతు పెట్టారు. గత వారం వైట్ హౌస్ లో ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్ తో జెలెన్ స్కీ గొడవపడ్డ విషయం తెలిసిందే. అమెరికాతో శాంతి ఒప్పందం, ఖనిజ ఒప్పందాలు చేయకుండానే వెళ్లిపోయారు.ఆ తరువాత శాంతి ఒప్పందానికి జెలెన్ స్కీ  అడ్డంకీగా మారాడని,రాజీనామా చేయ్యాలని ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు జెలెన్ స్కీ దీటుగానే బదులిచ్చారు.అమెరికాకు కృతజ్ఞతగా ఉంటామని,మళ్లీ ఆహ్వానిస్తే నిర్మాణాత్మక చర్చల కోసమైతే అమెరికా రావడానికి తనకు అభ్యంతరం లేదనీ చెబుతూనే.. రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ ప్రాంతాలను తిరిగి అప్పగించాలనీ డిమాండ్ చేశారు.  అంతే కాదు రష్యా భవిష్యత్ లో మళ్లీ ఉక్రెయిన్ పై దాడి చేయకూడదనీ, ఆ మేరకు స్పష్టమైన హామీ ఇవ్వాలనీ, అలాగైతేనే  శాంతి చర్చలకు అర్ధం ఉంటుందనీ కుండబద్దలు కొట్టారు.  అయితే ఉక్రేయిన్ కు నాటో సభ్యత్వం మొదటి నుంచి రష్యా వ్యతిరేకిస్తున్నది. ట్రంప్ కూడా నాటో సభ్యత్వం డిమాండ్ ను తోసిపుచ్చారు.    మొత్తం మీద ట్రంప్ శాంతి ప్రయత్నాలు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు సంగతి అలా ఉంచితే ప్రపంచ దేశాలను మరో యుద్ధం వైపు నడిపిస్తున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 
ట్రంప్ కు జెలన్ స్కీ ఝలక్.. కక్కలేక, మింగలేక అమెరికా అధ్యక్షుడు Publish Date: Mar 4, 2025 11:03AM

టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వంశీ రిమాండ్ 

 గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి  మరోసారి రిమాండ్ విధించారు.  గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో  వంశీ ఎ71 నిందితుడిగా ఉన్నారు.  మూడో తేదీలోగా కోర్టుకు హాజరుపర్చాలని   విజయవాడలోని ఎసిజెఎం కోర్టు  ఆదేశించింది.  టిడిపి కార్యాలయంలో  కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్దన్  కిడ్నాప్ కేసులో వంశీ ప్రధాన నిందితుడు. ఈ కేసులో వంశీని హైద్రాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ సబ్ జైలులో ఉన్న వంశీని వర్చువల్ గా కోర్టుకు హాజరుపర్చారు.  నిందితుడు వంశీకి 17 వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఒక్కరే ఉండే జైలు గది నుంచి ఎక్కువ మంది ఖైదీలు  ఉండే బ్యారక్ లో మార్చేందుకు ఎస్సి ఎస్టి కోర్టు అనుమతించింది.  సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న గంట వీర్రాజు,   వేల్పూరువంశీలను పోలీసు కస్టడీకి ఇవ్వాలని  పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై ఎస్ సి ఎస్ టి కోర్టు  న్యాయాధికారి హిమ బిందు తీర్పు నిచ్చారు.  మంగళ, బుధవారాలు పోలీసు కస్టడీకి ఇవ్వాలని తీర్పు నిచ్చారు.  ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరు పోలీసు కస్టడీలో ఉండాలని ఆదేశించారు. 
టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వంశీ రిమాండ్  Publish Date: Mar 4, 2025 10:57AM

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో పురంధేశ్వరి

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్కేదెవరికి అన్న ఉత్కంఠ కమలనాథుల్లోనే కాదు.. అందరిలోనూ వ్యక్తం అవుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా వారసుడెవరన్న ప్రశ్నకు సమాధానంగా ఇంత కాలం ఓ నాలుగైదు పేర్లు వినిపించినా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ నెల 15, 16 తేదీలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎవరన్నది పార్టీ హైకమాండ్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.  ప్రస్తతం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్ంలో ఆయన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది. కేంద్రంలో  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉండటంతో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది.  బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం రేసులో పదుల సంఖ్యలో నాయకులు ఉన్నప్పటికీ పార్టీ అధిష్ఠానం మాత్రం సమర్థుడైన నేతను ఎన్నుకోవాలన్న కృత నిశ్చయంతో ఉంది. మరో నాలుగేళ్ల పాటు కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యత అంటే ఆషామాషీ వ్యవహారం కాదనీ, కూటమి పార్టీలతో సమన్వయంతో  వ్యవహరించడమే కాకుండా, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేయాల్సి ఉంటుందనీ అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పదుల సంఖ్యలో పదవి కోసం పోటీ పడుతున్న నేతలను ఫిల్టర్ చేసింది. ఆ తరువాత ప్రధానంగా రేసులో కేంద్ర మంత్రి, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె, బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, పార్టీ సీనియర్ నేత వినోద్ ధావ్డేలు ముందు వరుసలో నిలిచారని పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈ నలుగురిలో ఎవరో ఒకరు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని గట్టిగా వినిపించింది. అయితే అనూహ్యంగా, ఈ రేసులోకి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దూసుకు వచ్చారు.  ఆమెతో పాటు తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వనతి శ్రీనివాసన్   మహిళామోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు.  ఆమె కోయంబత్తూర్ ఎమ్మెల్యే కూడా.   దక్షిణాదిలో పార్టీ పటిష్టత, తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు ఇలా పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అగ్రనాయకత్వం వీరిద్దరిలో ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తోందని  తెలుస్తోంది.    ఏది ఏమైనా నడ్డా వారసుడిని పార్టీలో ఏకాభిప్రాయ సాధన ద్వారానే ఎంపిక చేస్తారన్నది నిర్వివాదాంశం.   ఇప్పటికే పార్టీ హైకమాండ్ దక్షిణాదికి చెందిన మహిళా నేతకు పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చేసిందనీ, దగ్గుబాటి పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ లలో ఒకరిని ఎంపిక చేయడం ఖాయమనీ పార్టీ వర్గాలు అంటున్నాయి. దక్షిణాదికి చెందిన మహిళా నేతను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఎంపిక చేయడం ద్వారా  పార్టీని అక్కడ బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందన్నది కమలనాథుల భావనగా కనిపిస్తోంది.   2014 నుంచి బీజేపీలో ఉన్న పురంధేశ్వరి.. సంస్థాగత నైపుణ్యాలలో దిట్ట. పురంధేశ్వరిని దక్షిణాది సుష్మా స్వరాజ్ గా చెబుతుంటారు. బీజేపీ క్యాడర్ లో ఉన్న పాపులారిటీ, ఐదు భాషల్లో ప్రావీణ్యం పురంధేశ్వరికి బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి అదనపు అర్హతలుగా చెప్పవచ్చు.   ఇక వనతి విషయానికి వస్తే.. ఆమె పార్టీ మహిళామోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలతో నేరుగా పరిచయం ఉన్న వ్యక్తి.  ఇక విషయానికి వస్తే రాజకీయ అవసరాలు కూడా బీజేపీ అధ్యక్ష పదవి ఎంపికపై ప్రభావం చూపుతాయి.  ఉత్తర ప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా చర్చించిన తరువాత మాత్రమే పార్టీ కొత్త అధ్యక్షుడెవరన్న నిర్ణయానికి కమలనాథులు వస్తారు. అయితే దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కోసం రేసులో పురంధేశ్వరి ముందు వరుసలో ఉంటారనడంలో సందేహం లేదు.   
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో పురంధేశ్వరి Publish Date: Mar 4, 2025 10:14AM