ఓటమి భయమా.. కేసీఆర్ పై నమ్మకం పోయిందా? గులాబీ నేతల్లో పెరుగుతున్న అసహనం..

తెలంగాణలో అధికారంలో ఉన్న  టీఆర్ఎస్ పార్టీలో అసహనం దేనికి సంకేతం? నిజానికి అధికార పార్టీ అనే కాదు, ఏ పార్టీ లేదా నాయకుడిలో అసహనం పెరుగుతోందంటే, అందుకు మూల కారణం అశాంతి, భయం. ఆ భయం ఏదైనా కావచ్చును.  ఊరించి నోటిదాకా వచ్చిన పదవి పుటుక్కున చేజారి పోవడం కావచ్చును. కూర్చున్న కుర్చీ నేలలోకి కూరుకు పోవడం కావచ్చును. అంతర్గత కుమ్ములాటలు కావచ్చును. రేపటి ఎన్నికల్లో ఓటమి ముందుగానే ఖరారు కావడం కావచ్చును.. ఈ అన్నింటినీ మించిన భయం అవినీతి అక్రమాస్తుల కేసుల భయం. ఈ అన్నీ కూడా కావచ్చును. ఇలా భయం నీడలా వెంటాడుతున్నప్పుడు సహజంగానే నాయకులలో అసహనం పెరుగుతుంది.  

కారణాలు ఏవైనా అధికార తెరాస నాయకుల్లో, మరీ ముఖ్యంగా ముఖ్య నేతల్లో అలాంటి అసహనం పెరుగుతోందా,అంటే, పార్టీ శ్రేణులు, క్రిందిస్థాయి నాయుకులు అవుననే అంటున్నారు.ముఖ్యంగా, పెద్ద సారుల రుసరుసలు ఎక్కువయ్యయీని అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వ్యవహరాన్ని చాలా తేలిగ్గా తీసుకున్న, మంత్రి కేటీఅర్ సహా అందరినీ ఓటమి భయం చాలా చాలా వత్తిడికి గురిచేస్తోందని, నాయకుల మాటలో, నడకలో ఆ తేడా కనిపిస్తోందని అంటున్నారు. 

రాష్ట్రంలో ప్రతిపక్షాలు దూకుడు పెంచుతున్నాయి. సొంతపార్టీలో నేతల మధ్య కలహాలు, నిరసన ధ్వనులు ఎక్కువయ్యాయి. పార్టీ  సంస్థాగత కమిటీ ఏర్పాటులో మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆయన కుమారుడు, మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి మధ్య సాగిన బాహాబాహీ యుద్ధం వంటి సంఘటనలు సహజంగానే నాయకులను కలతకు గురుచేస్తున్నాయి. చివరకు జడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి రాజీనామాకు సిద్దమయ్యారు. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుంటేనే గానీ,పరిస్థితి చక్కబడలే దంటే పరిస్థితి ఎంతగా విషమించిందో వేరే చెప్పనక్కర లేదు.  

కేంద్ర ప్రభుత్వం బొక్కలు వెతికే పనిలో పడిందని, పాత చిట్టాలను తిరగతోడి, కొత్త కేసుల చిట్టా సిద్డంచేస్తోందని వస్తున్న వార్తలువెన్నులో చలి పుట్టిస్తున్నాయో ఏమో, ఆ ఆందోళన కూడా నేతల పోకడలలో కనిపిస్తోందని అంటున్నారు. ఇంత కాలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు, అరెస్ట్ తప్పదంటూ చేస్తూ వచ్చిన హెచ్చరికలను అంతగా పట్టించుకోక పోయినా తాజా సమాచారం ప్రకారం ఉచ్చు బిగుసుకుంటున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయని అంటున్నారు. ఇలా అన్ని దిక్కుల నుంచి వత్తిళ్ళు పెరగడం వల్లనే, తెరాస నాయకుల్లో అసహనం బుసలు కొడుతోందని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడంలో ప్రభుత్వ విప్‌‌లు విఫల మయ్యారని వారిపై మండిపడినట్లు సమాచారం. 

శుక్రవారం శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నేపధ్యంలో కేటీఆర్ విప్‌‌లతో జరిపిన సమవేశంలో వారిపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌‌పై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నా విప్‌‌లు నోరు విప్పడం లేదని ఇంతమంది విప్‌‌లు ఉండి ఏం లాభమని ప్రశ్నించారని సమాచారం. ప్రతిపక్షాలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే పదవుల్లో ఉన్నవాళ్లు చూస్తూ ఊరుకోవద్దని, వారు ఏ భాషలో మాట్లాడుతున్నారో అదే విధంగా తిరిగి సమాధానం ఇవ్వాలని అన్నట్లు తెలిసింది. నిజానికి, ఒక్క విప్’లనే కాదు పార్టీ నాయకులు అందరూ ప్రతిపక్షాలపై మాటల దాడి  చేయాలని కేటీఆర్ ఎప్పుడోనే చెప్పారు. అదలా ఉంటే,  అధికార పార్టీలో ఇంతలా అసహనం పెరిగిపోవడం వలన పార్టీకే నష్టమని విజ్ఞులు సూచిస్తున్నారు.