ఇక్క‌డి OTS.. అక్క‌డి LRS మాదిరే దెబ్బ కొడుతుందా?

40 ఏళ్లుగా ఉంటున్న ఇల్లు. ఇప్పుడు స‌డెన్‌గా జ‌గ‌న‌న్న వ‌చ్చి ఈ ఇల్లు అక్ర‌మం అంటున్నారు. మేం స‌క్ర‌మం చేస్తాం.. 20 వేలు క‌ట్ట‌మంటూ ముక్కుపిండుతున్నారు. అదేంటి? ఏళ్లుగా ఉంటున్నాంగా.. ఇంత వ‌ర‌కూ త‌మ‌ను ఎవ‌రూ అడ‌గ‌లేదుగా? అని అడుగుదామంటే వినేవాడు లేడు. క‌డ‌తావా? క‌ట్ట‌వా? అంటూ కాబూలీ వాలాలా డ‌బ్బుల కోసం ఒత్తిడి చేసే వాలంటీర్లే కానీ.. పేద‌ల గోడు వినే నాథుడే లేడు. వ‌న్‌టైమ్ సెటిల్‌మెంట్- ఓటీఎస్ పేరుతో ఏపీలో అరాచ‌కం సృష్టిస్తున్నార‌ని అంటున్నారు. అటు, టీడీపీ నేత‌లేమో ప్ర‌జ‌లెవ‌రూ ఓటీఎస్ క‌ట్టొద్ద‌ని.. తాము అధికారంలోకి వ‌చ్చాక ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేష‌న్ చేసిస్తామ‌ని చెబుతున్నారు.  

ఉన్న‌ట్టుండి.. 10 వేలు.. 20 వేలు అంటే మాములా? అది కూడా ఏదో కొత్త ప‌థ‌కానికో.. అంత‌కంటే విలువైన‌దేదో ఇవ్వ‌డానికో కాదుగా. హ్యాపీగా ఇప్పుడుంటున్న‌ ఇంటికే.. ఈ అద‌న‌పు వాయింపు ఏంటంటూ జ‌నం జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వంపై తిర‌గ‌డుతున్నారు. ఇంటికి 10వేలు అంటే.. ఈ లెక్క‌న ఏపీ ఖజానాకు బాగానే కాసులు జ‌మ అయ్యేలా ఉన్నాయే అంటూ లెక్క‌లేస్తున్నారు? పేద‌ల నుంచి వేల కోట్లు రాబ‌ట్టాల‌నేదే జ‌గ‌న్ స్కెచ్ అంటున్నారు. ప్ర‌స్తుత క్లిష్ట ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వానికి 10 రూపాయ‌లు దొర‌క‌డ‌మే క‌ష్టంగా మారింది. అలాంటిది.. ఉన్న‌ప‌ళంగా.. ఏ ప‌నీ చేయకుండా.. వేల కోట్లు వ‌చ్చిప‌డే ఓటీఎస్ స్కీమ్‌ జ‌గ‌న‌న్న‌కు కామ‌ధేనులా క‌నిపిస్తోంద‌ట‌. అందుకే సిబ్బందికి టార్గెట్లు పెట్టిమ‌రీ.. కాసుల దండ‌యాత్ర‌కు ఉసుగొల్పుతున్నార‌ని అంటున్నారు. 

సచివాలయాలు, మండలం, పట్టణాల వారీగా లక్ష్జ్యాలు నిర్దేశించారు. ప్రతి మండలానికి రోజుకు 50, సచివాలయానికి 5 చొప్పున ఓటీఎస్‌ కింద కట్టించాలని టార్గెట్ పెట్టారు. వార్డు, గ్రామ వాలంటీరు రోజుకు ఒకటి, పంచాయతీ కార్యదర్శి 3కు తక్కువ లేకుండా చూడాలని మండల స్థాయి అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఇలా అందరికీ ఒక్కో తరహా లక్ష్యం విధించారు. పాల‌కుల ప్రెజ‌ర్‌తో అధికారులంతా ఓటీఎస్ వ‌సూళ్ల కోసం పరుగులు పెడుతున్నారు. పేదలను పీక్కుతింటున్నారు. డ‌బ్బులు లేవంటే.. డ్వాక్రా గ్రూపుల నుంచి అప్పు ఇప్పిస్తామ‌ని.. దాచుకున్న‌ది తీసుకుంటామని.. ర‌క‌ర‌కాల కుయుక్తులు ప‌న్నుతున్నారు. పేద‌ల సొమ్ము కాజేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుందంటూ వైసీపీ ప్ర‌భుత్వంపై అంతా మండిప‌డుతున్నారు. 

గ‌తంలో తెలంగాణ స‌ర్కారు సైతం ఖ‌జానా ఖాళీ అవుతున్న స‌మ‌యంలో ఇలానే భూములు, ఇండ్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ స్కీమ్‌- ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది. గజం స్థ‌లానికి ఇంత సొమ్ము క‌డితే.. అక్ర‌మ లేఅవుట్లు, ఇండ్లు స‌క్ర‌మం చేస్తామంటూ ఊద‌ర‌గొట్టింది కేసీఆర్ సర్కారు. కానీ, ఎల్ఆర్ఎస్‌పై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఆ ప్ర‌జాగ్ర‌హం.. ఆ స‌మ‌యంలో జ‌రిగిన జీహెచ్ఎమ్‌సీ ఎన్నిక‌ల‌పై ప‌డింది. టీఆర్ఎస్‌కు ఓడినంత ప‌నైంది. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్టు.. ఆ వెంట‌నే ఎల్ఆర్ఎస్‌ను విత్‌డ్రా చేసుకుంది కేసీఆర్ స‌ర్కార్‌. 

సేమ్ టు సేమ్‌.. ఏపీలోనూ ఇప్పుడు అలాంటి ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి. న‌వ‌ర‌త్నాల పేరుతో పేద‌ల‌కు ప‌ప్పుబెల్లాలు పంచుతూ.. ఖ‌జానా ఖాళీ చేసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. ఇప్పుడు ఓటీఆఎస్ పేరుతో అదే పేద‌ల నుంచి ఏక‌మొత్తంగా 10 నుంచి 20 వేలు వ‌సూలు చేయ‌డం దారుణ‌మంటూ ప్ర‌జ‌లంతా తిరగ‌బ‌డుతున్నారు. జ‌నాలు ఓటీఆఎస్‌కు స‌సేమిరా అంటుండ‌టంతో.. ప్ర‌భుత్వ పథకాలు ఆపేస్తున్నారు. డ్వాక్రా డబ్బులు తీసేసుకుంటున్నారు. ఇంతా చేసినా.. జ‌నం నుంచి స్పంద‌న అంతంత మాత్రంగానే ఉంటోంది. ఏపీలో ఓటీఆఎస్‌.. తెలంగాణ‌లోని ఎల్ఆర్ఎస్ మాదిరే తుస్సు మంటుంది అని అంటున్నారు. ప్ర‌జాగ్ర‌హం వెల్లువెత్త‌క ముందే ఓటీఎస్‌పై జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం పున‌రాలోచించుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.