లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ భయం!

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీల మధ్య ఎప్పడూ ఘర్షణ వాతావరణమే. రాష్ట్రంలో ఏం జరిగినా ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి. టార్గెట్  చేసేందుకు  ఏ చిన్న అవకాశం వచ్చిన వదులుకోవు ఇరు పార్టీలు. ఇటీవల టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడు పెంచారు. పంచ్ డైలాగులతో అదరగొడుతున్నారు. పదునైన విమర్శలతో ఒక రకంగా అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు చినబాబు. దీంతో లోకేష్ లక్ష్యంగా ఏపీ మంత్రులు రెచ్చిపోతున్నారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్నామన్న సంగతి మర్చిపోయి మరీ.. బూతులు మాట్లాడుతున్నారు. 

తాజాగా తాడేపల్లిలో వెలుగుచూసిన గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు దగ్గరలోనే ఘోరం జరగడంతో పోలీసులు, వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్ కు కౌంటరిచ్చిన ఏపీ మంత్రి పేర్ని నాని.. జూనియర్ ఎన్టీఆర్ ను మధ్యలోకి లాగారు.  నారా లోకేశ్ ఇప్పుడు సొంత పార్టీలోనే ఉనికి కోసం తాపత్రయపడుతున్నాడని విమర్శించారు. లోకేశ్ కు జూనియర్ ఎన్టీఆర్ భయం పట్టుకుందన్నారు నాని.  జూనియర్ ఎన్టీఆర్ రావాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటుండడమే అందుకు కారణమని తెలిపారు.

టీడీపీ  కార్యకర్తలు "రావాలి జూనియర్ ఎన్టీఆర్, కావాలి జూనియర్ ఎన్టీఆర్" అంటుండడంతో... "జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు నేనే సరిపోతాను" అంటూ జగన్ మోహన్ రెడ్డిపై  నోటికొచ్చినట్టు నారా లోకేష్  మాట్లాడుతున్నాడని పేర్ని నాని మండిపడ్డారు. అసభ్యంగా, విచక్షణ లేకుండా ఏరా, ఒరే అని మాట్లాడుతున్నారని.. తాము కూడా అలాగే మాట్లాడగలమని హెచ్చరించారు.  గడ్డం పెంచినవాడల్లా గబ్బర్ సింగ్ కాలేడని లోకేశ్ ను ఎద్దేవా చేశారు నాని .  లోకేశ్ ఉద్యోగం పోయిన రాజకీయ నిరుద్యోగి అని  సెటైర్ వేశారు. లోకేశ్ ప్రస్తుతం తీవ్ర అసహనంలో ఉన్నారని, అతన్ని చూస్తుంటే జాలి  కలుగుతోందని కామెంట్ చేశారు పేర్ని నాని.