ఇంతకీ ఏపీ పీసీసీ చీఫ్ నల్లారేనా?- సోనియాతో గంట భేటీ తరువాత కూడా వెలువడని అధికారిక ప్రకటన

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ముఖ్యమంత్రి హోదాలో హస్తినలో తన కేబినెట్ మొత్తంతో ధర్నా చేసిన సంచలనం సృష్టించి అప్పట్లో సమైక్యాంధ్ర చాంపియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ హై కమాండ్ తో గట్టిగా పోరాడిన వ్యక్తి. అయితే ఇప్పుడు అదంతా గతించిన గతం.

ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఉనికి కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించేందుకు పార్టీ హై కమాండ్ కు ఒక ఆశా జ్యోతిగా కనిపిస్తున్నారు. నాయకులూ, కార్యకర్తలూ కూడా లేని పార్టీగా ఏపీలో కాంగ్రెస్ డీలా పడింది. ఆ పార్టీలో జవసత్వాలు నింపి, పునర్వైభవం తీసుకువచ్చేందుకు నల్లారికి ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు కట్టబెట్టాలని అధిష్టానం భావిస్తోంది. అందుకే ఆయనను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడింది.

అధినేత్రి సోనియా గాంధీయే దాదాపు గంట సేపు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించారు. ఇంకే ముంది ఏపీ పీసీసీ చీఫ్ గా నల్లారి నియామకం జరిగిపోయినట్లు అంతా భావించారు. కానీ సోనియాతో గంట సేపు భేటీ అనంతరం కూడా నల్లారి నియామకంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కారణమేమిటంటే..నల్లరే ఏపీ పీసీసీ చీఫ్ పదవి చేపట్టేందుకు సుముఖంగా లేరు. ఈ సమాచారం కాంగ్రెస్ వర్గాల నుంచే వచ్చింది. ఇందుకు నల్లారి చెప్పిన కారణం తన సోదరుడు తెలుగుదేశం పార్టీలో క్రియా శీలంగా ఉన్నారని. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వేరు వేరు పార్టీల్లో ఉండటం జనాలకు తప్పుడు సంకేతం ఇస్తుందని నల్లారి అధిష్టానానికి చెబుతున్నారట.

గతంలో కూడా ఒక సారి ఏపీ పీసీసీ చీఫ్ పదవి చేపట్టాల్సిందిగా హై కమాండ్ ఇచ్చిన ఆఫర్ ను నల్లారి తిరస్కరించడంతోనే అప్పట్లో సాకే శైలజానాథ్ ను నియమించారని ఒక ప్రచారం ఉంది. ఇప్పుడు మరోసారి కూడా పార్టీ హై కమాండ్ ఆఫర్ ను నల్లారి తిరస్కరించారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం పిలిచి పదవి ఇస్తానన్నా నల్లారి నో అనడం గతంలోలా కాంగ్రెస్ హై కమాండ్ కమాండింగ్ పొజిషన్ లో లేదనడానికి నిదర్శనం అని పరిశీలకులు అంటున్నారు. 

గతంలో పీసీసీ చీఫ్‌గా నియమిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన విముఖత వ్యక్తం చేయడంతో ఆ స్థానాన్ని సాకే శైలజానాథ్‌కు ఇచ్చారు. ఇప్పుడు మరోసారి కిరణ్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించడానికి ప్రయత్నాలను హైకమాండ్ చేసింది. కానీ కిరణ్ అదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తన సోదరుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారని.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరితే… తన నియామకం టీడీపీ సిఫార్సుతో జరిగిందన్న ప్రచారం చేస్తారని దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని కిరణ్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తన సోదరుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. 

ఏది ఏమైనా ఏపీలో నామమాత్రంగా మిగిలిన పార్టీకి పునర్వైభవం తీసుకురావడం మాట అటుంచి కనీసం ఉనికినైనా చాటేలా చేయడానికి కూడా ఆ పార్టీ నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పీసీసీ చీఫ్ గా సాకే శైలజానాథ్ కు ముందు బాధ్యతలను నిర్వహించిన రఘువీరారెడ్డి కూడా ఎప్పుడు ఆ పదవి నుంచి తప్పుకుందామా అని ఎదురు చూశారనీ.. ఎన్ని సారు రాజీనామాకు సిద్ధపడినా అధిష్టానం వెయిట్ చేయమంటూ నిలువరించిందనీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

చివరికి రాహుల్ గాంధీ ఏఐసీసీ చీఫ్ గా రాజీనామా చేసిన సందర్భాన్ని అందిపుచ్చుకుని ఆయనకు మద్దతుగా అంటే రఘువీరారెడ్డి చాకచక్యంగా ఆ బాధ్యత నుంచి వైదొలగారని అంటున్నారు. ఆయన తరువాత మరెవరూ ముందుకు రాని పరిస్థితుల్లో సాకే శైలజానాథ్ కు బలవంతంగా పార్టీ హైకమాండ్ ఏపీ పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టిందంటున్నారు. ఇప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఏపీలో పార్టీని గట్టెక్కించాలని కోరుతున్నా ఆయన ససేమిరా అంటున్నారని సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో పార్టీని గాడిలో పెట్టేందుకు నల్లారే సరైన వ్యక్తి అని అధిష్టానం భావిస్తోందనీ, అందుకే ఆయనపై ఒత్తిడి పెంచేందుకు పార్టీ సినియర్లు రంగంలోకి దిగారని అంటున్నారు.