బీజేపీ వైపు క‌విత ఆస‌క్తి!.. క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో కుంప‌టి..

క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో రాజ‌కీయ‌ కుంప‌టి. క‌విత‌తో తండ్రికి, అన్న‌కు విభేదాలు. కేటీఆర్‌కు క‌విత రాఖీ క‌ట్ట‌లేదు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఇంటి ఆడ‌బిడ్డ బ‌తుక‌మ్మ ఆడ‌టానికి రాలేదు. ఎప్ప‌టి నుంచో న‌డుస్తున్న గుస‌గుస‌ల‌కు ఈ రెండు సంద‌ర్భాలు మ‌రింత ఆజ్యం పోశాయి. పైగా, ఇటీవ‌ల శాస‌న‌మండ‌లిలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ఎమ్మెల్సీ క‌విత గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌డం మ‌రింత అనుమానాల‌కు కార‌ణ‌మైంది. క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీలో గొడ‌వ‌లు తారాస్థాయికి చేరాయ‌ని తేలిపోయింది. కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేయ‌డం క‌విత‌కు ఇష్టం లేద‌ని అందుకే వారి మ‌ధ్య తేడా వ‌చ్చింద‌ని అంటున్నారు. ఆస్థి త‌గాదాల వ‌ల్లే వైరం పెరిగింద‌ని కూడా చెబుతున్నారు. కార‌ణ‌మేంటో తెలీదు కానీ.. క‌విత‌ను కేసీఆర్‌, కేటీఆర్ ప‌క్క‌న పెట్టేశార‌నే మాత్రం వాస్త‌వ‌మే..అంటున్నారు. 

వాట్ నెక్ట్స్‌. తండ్రి ద‌గ్గ‌ర‌కు తీసుకోవ‌డం లేదు. అన్న దూరం పెట్టేశాడు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోకీ అడుగుపెట్ట‌లేనంతా గ్యాప్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మ‌రోక‌రైతే ఇంతే ప్రాప్తం అనుకుని.. ఉన్న‌దాంతో అడ్జ‌స్ట్ అయ్యేవారు. కానీ.. ష‌ర్మిల‌, క‌విత లాంటి రాజ‌కీయ ర‌క్తం పారుతున్న నేత‌లు అంత ఈజీగా ప‌ట్టిన ప‌ట్టు విడిచిపెట్టారు. తామేమీ కూర‌లో క‌రివేపాకులం కాద‌ని.. వాడుకొని వ‌దిలేస్తే ఊరుకునేది లేద‌ని.. గ‌ట్టిగా ఎదురుతిరిగే ర‌కం. అందుకే, వైఎస్ ష‌ర్మిల అన్న‌ను వ‌దిలేసి వ‌చ్చి సొంత‌పార్టీ పెట్టేసుకున్నారు. ష‌ర్మిల‌లానే క‌విత సైతం వేరు కుంప‌టి పెట్టుకుంటారా? లేక‌, వేరే పార్టీలో చేరిపోతారా? ఇలా ర‌క‌ర‌కాల చ‌ర్చ జ‌రుగుతోంది. క‌విత కొత్త పార్టీ పెట్టుకుంటార‌ని.. తెలంగాణ జాగృతినే రాజ‌కీయ పార్టీగా మార్చుతార‌ని.. అందుకే ఇటీవ‌ల ఏఆర్ రెహ‌మాన్‌, గౌత‌మ్‌మీన‌న్‌ల‌తో ప్ర‌త్యేకంగా బ‌తుక‌మ్మ పాట రిలీజ్ చేసి ముంద‌స్తు మెసేజ్ ఇచ్చారంటూ ఓ టాక్ న‌డుస్తోంది. తాజాగా, క‌విత బీజేపీలో చేరుతారంటూ కొత్త వాద‌న తెర‌పైకి వ‌చ్చింది. 

కేసీఆర్‌ను ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టి నిల‌బ‌డ‌టం అంత వీజీ కాద‌ని అంద‌రికంటే క‌విత‌కే బాగా తెలిసుంటుంది. అందుకే, కొత్త పార్టీ కాకుండా వేరే పార్టీ అయితేనే బెట‌ర్ అనేది ఆమె ఆలోచ‌న‌లా ఉంది. రేవంత్‌రెడ్డి ఉన్నారు కాబ‌ట్టి, కాంగ్రెస్‌లో ఆయ‌న‌దే హ‌వా కాబ‌ట్టి.. ఆ పార్టీలో చేరినా క‌విత‌కు పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌క‌పోవ‌చ్చు. అందుకే, బీజేపీనే క‌విత‌కు బెస్ట్ ఆప్ష‌న్ అంటున్నారు. ఆ ప్ర‌చారానికి మ‌రింత బ‌లం చేకూర్చేలా.. జ‌ల‌విహార్‌లో బండారు ద‌త్తాత్రేయ నిర్వ‌హించిన అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మంలో.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్‌, క‌విత‌లు ప‌క్క ప‌క్క‌నే కూర్చొని చ‌ర్చించుకోవ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

అల‌య్ బ‌ల‌య్ క‌దా.. పార్టీల‌కు అతీతంగా క‌లుసుకోవ‌డం, మాట్లాడుకోవ‌డం కామ‌నే క‌దా అనుకోవ‌డానికి లేదు. ఎందుకంటే నిజామాబాద్‌లో ఎంపీగా పోటీ చేసిన క‌విత‌ను ఓడించింది బీజేపీనే. కేసీఆర్ కుటుంబానికి మాత్ర‌మే ప‌ద‌వులు వ‌చ్చాయ‌ని.. క‌విత భారీగా అక్ర‌మ ఆస్తులు కూడ‌బెట్టార‌ని.. బండి సంజ‌య్ ప‌దే ప‌దే ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇంత‌కు ముందెప్పుడూ సంజ‌య్‌-క‌విత‌లు మ‌ర్యాద‌పూర్వకంగానైనా మాట్లాడుకున్న‌ది లేదు. అస‌లు ఆ ప్రోగ్రామ్‌కు క‌విత ఇంత‌కుముందెప్పుడూ హాజ‌రుకాలేదు కూడా. ఈసారే క‌విత‌ అల‌య్ బ‌ల‌య్‌కు రావ‌డం.. కావాల‌నే బండి సంజ‌య్‌తో ముచ్చ‌ట్లు పెట్ట‌డం వెనుక‌.. తెర వెనుక ఏదో జ‌రుగుతోంద‌ని అంటున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ల‌కు ఝ‌ల‌క్ ఇచ్చేందుకే క‌విత బీజేపీ అధ్య‌క్షుడితో ప‌రిచ‌యం పెంచుకుంటున్నారా?  కావాల‌నే కాషాయ పార్టీకి ద‌గ్గ‌ర‌వుతున్నారా? అనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ప‌రిస్థితులు నిషితంగా గ‌మ‌నిస్తే.. త్వ‌ర‌లోనే క‌విత కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉందంటున్నారు. చూడాలి ఏం జ‌రుగుతుందో.. ఏమో, గుర్రం ఎగ‌రావ‌చ్చు.. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే క‌దా....