క‌ర్నె ప్ర‌భాక‌ర్‌కు షాక్‌.. పార్టీ నుంచి గెంటేసిన‌ట్టేనా?

క‌ర్నె ప్ర‌భాక‌ర్‌. టీఆర్ఎస్ మౌత్‌పీస్‌. మాజీ ఎమ్మెల్సీ. మీడియాలో పార్టీ వాయిస్‌ను గ‌ట్టిగా వినిపించే లీడ‌ర్‌. ప్ర‌తిప‌క్షాల‌ను ఎండ‌గ‌ట్టే పార్టీ స్పోక్ ప‌ర్స‌న్‌. అలాంటి క‌ర్నె గొంతు కొన్నాళ్లుగా మూగ‌బోయింది. పార్టీ స‌మావేశాల్లో కానీ, మీడియా చ‌ర్చ‌ల్లో కానీ ప్ర‌భాక‌ర్ క‌నిపించ‌డం లేదు..వినిపించ‌డం లేదు. క‌ర్నె ప్ర‌భాక‌ర్‌ను కేసీఆర్ ప‌క్క‌న పెట్టేశారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అందుకు బ‌ల‌మైన కార‌ణం కూడా ఉందన్నారు.

ముఖ్య‌మంత్రి మాజీ పీఆర్వో విజ‌య్‌కుమార్‌ పార్టీ, ప్ర‌భుత్వ అంత‌ర్గ‌త స‌మాచారాన్ని లీక్ చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న‌పై వేటు వేసిన విష‌యం తెలిసిందే. ఆ కోవ‌లోనే క‌ర్నె ప్ర‌భాక‌ర్ సైతం పాల‌సీ మేట‌ర్స్ ప్ర‌త్య‌ర్థుల‌కు రివీల్ చేస్తున్నార‌నే అనుమానంతో ఆయ‌న్ను కేసీఆర్ సైడ్ చేశార‌ని అన్నారు. చాలాకాలంగా పార్టీతో ఆయ‌న‌, ఆయ‌న‌తో పార్టీ.. ట‌చ్ మీ నాట్ అన్న‌ట్టు ఉంటున్నారు. క‌ర్నెకు  బీజేపీ గాలం వేసింద‌ని కొంద‌రు.. కాదు కాదు కాంగ్రెస్ వైపు చూస్తున్నార‌ని ఇంకొంద‌రు.. ఇలా గుస‌గుస‌లు న‌డుస్తున్నాయి. కార‌ణం ఏదైనా క‌ర్నె ప్ర‌భాక‌ర్ కొన్ని నెల‌లుగా కారు పార్టీకి దూరంగా ఉన్నార‌నేది మాత్రం వాస్త‌వం. కానీ, ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ కేటీఆర్ ద్వారా పార్టీ లైన్‌లోకి వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్న క‌ర్నెకు మ‌ళ్లీ అనుకోని షాక్ త‌గిలింది.

తాజాగా.. మాజీ ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో తీవ్ర అవ‌మానం జ‌రిగింది. తెలంగాణ భవన్ గేటు దగ్గర కర్నెను పోలీసులు అడ్డుకున్నారు. ఆయ‌నకు టీఆర్ఎస్ భ‌వ‌న్‌లోకి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అదేంటి.. తాను టీఆర్ఎస్ ప్లీనరీ మీడియా కోఆర్డినేటర్‌గా ఉన్నానంటూ కర్నె ప్రభాకర్ పోలీసుల‌తో చెప్పిన ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ఆహ్వానితుల జాబితాలో క‌ర్నె పేరు లేదంటూ పోలీల‌సులు ఆయ‌న్ను తిప్పిపంపించేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం సంద‌ర్భంగా కర్నె ప్ర‌భాక‌ర్‌కు ఇలాంటి చేదు అనుభ‌వం ఎదురైంది. 

ఇది అనుకోకుండా జ‌రిగిన ఘ‌ట‌నా?  లేక‌, నిజంగానే క‌ర్నెను పార్టీ ఆఫీసులోకి రానీయ‌కుండా అడ్డుకున్నారా? అనే చ‌ర్చ‌ జ‌రుగుతోంది. గ‌తంలో టీఆర్ఎస్‌కు చెందిన‌ రాజ్య‌స‌భ స‌భ్యుడు డి.శ్రీనివాస్‌ను సైతం ఇలానే అవ‌మానించి వెన‌క్కి పంపించారు. ప‌రోక్షంగా డీఎస్‌ను పార్టీ నుంచి వెలివేశారు. సేమ్ టు సేమ్ డీఎస్‌లానే క‌ర్నె ప్ర‌భాక‌ర్‌కు సైతం పార్టీ ఆఫీసులోకి నో ఎంట్రీ అని ముఖం మీదే చెప్పేసి.. ఇక నీ దారి నువ్వు చూసుకో అనేలా ఇన్‌డైరెక్ట్ మెసేజ్ ఇచ్చేశార‌ని అంటున్నారు. క‌ర్నె ప్ర‌భాక‌ర్ కొంత‌కాలంగా టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటూ.. వేరే పార్టీలతో ట‌చ్‌లో ఉంటున్నార‌నే సమాచారం మేర‌కే.. గులాబీ బాస్ ఆయ‌న‌పై క‌న్నెర్ర చేసిన‌ట్టు తెలుస్తోంది. తాజా ప‌రిణామంతో ఇక క‌ర్నె ప్ర‌భాక‌ర్ కారు పార్టీని విడిన‌ట్టేనంటున్నారు. బీజేపీ.. కాంగ్రెస్‌.. రెండింటిలో ఏ పార్టీ కండువా క‌ప్పుకుంటారో అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.