స్పుత్నిక్ వీతో హెచ్ఐవీ ముప్పు! దక్షిణాఫ్రికా ప్రకటనతో కలకలం..

ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ప్రధానం కావడంతో అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా చేపట్టాయి. యుద్ధప్రాతిపదికన టీకాలను సమకూర్చుకుని దేశ ప్రజలకు అందిస్తున్నాయి. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న టీకాలను కొనుగోలు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితమే వ్యాక్సినేషన్ లో భారతదేశం అద్బుత మైలురాయిని క్రాస్ చేసింది. వంద కోట్ల టీకాలతో బహుబలిగా నిలిచింది.   

అయితే వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్న సమయంలో దక్షిణాఫ్రికా చేసిన ఓ ప్రకటన ఇప్పుడు కలకలం రేపుతోంది.రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీతో హెచ్ఐవీ ముప్పుందంటూ దక్షిణాఫ్రికా సంచలన కామెంట్లు చేసింది. అడినోవైరస్ టైప్ 5 వెక్టార్లతో హెచ్ఐవీ ముప్పు ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయని.. అదే వెక్టార్ తో తయారైన స్పుత్నిక్ వ్యాక్సిన్ వల్ల పురుషుల్లో హెచ్ఐవీ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. హెచ్ఐవీ ముప్పు ఉంది కాబట్టి రష్యా వ్యాక్సిన్ ను అనుమతించలేమని దక్షిణాఫ్రికా ఔషధ నియంత్రణ సంస్థ గత సోమవారం తేల్చి చెప్పింది. దానికి సంబంధించిన డేటానూ రష్యా సమర్పించలేదని, ఆ డేటాను అందజేశాక టీకా అనుమతులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

దక్షిణాఫ్రికా ప్రకటనతో ఆఫ్రికా దేశమైన నమీబియా స్పుత్నిక్ వ్యాక్సిన్లను తాత్కాలికంగా నిలిపేసింది. ఇప్పటికే అక్కడ జనానికి స్పుత్నిక్ టీకాలు ఇస్తున్న ఆ దేశం.. మధ్యలోనే ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నమీబియా ప్రకటన చేసింది. దక్షిణాఫ్రికా ప్రకటనను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చేంత వరకు స్పుత్నిక్ వ్యాక్సిన్ ను నిలిపేస్తున్నామని తేల్చి చెప్పింది. దక్షిణాఫ్రికా ఆరోగ్య సంస్థ ప్రకటన, నమీబియా నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు స్పుత్నిక్ వీ టీకా  తయారుదారు సంస్థ మాత్రం దక్షిణాఫ్రికా ప్రకటనను ఖండించింది. స్పుత్నిక్ వీ టీకాతో హెచ్ఐవీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది.