హరీషే విపక్షాలకు ఆయుధమా! సిద్ధిపేటే కారు కొంప ముంచనుందా?

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పన్నెండు రోజుల్లో గడవు ముగియనుండటంతో అభ్యర్థుల, పార్టీల నేతలంతా గడపగడప తిరిగి ఓట్లు అడుగుతున్నారు. మూడు ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ముఖ్యనేతలంతా దుబ్బాకలోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ కు మాత్రం మంత్రి హరీష్ రావే అంతా తానై వ్యవహరిస్తున్నారు. కారు పార్టీ ఆశలు కూడా ఆయనపైనే ఆధారపడి ఉన్నాయని చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావే విపక్షాలకు ప్రధానంగా మారినట్లు దుబ్బాక పొలిటికల్ సీన్ కనిపిస్తోంది. హరీష్ రావు టార్గెట్ గానే.. ఆయన వల్లే దుబ్బాక వెనకబడిందనే ప్రచారాన్ని ఎక్కువగా చేస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. విపక్షాల వాయిస్ కు జనాల నుంచి స్పందన వస్తుండటంతో అధికార పార్టీలో ఆందోళన పెరుగుతుందని చెబుతున్నారు. ట్రబుల్ షూటరే టీఆర్ఎస్ కు ట్రబుల్ గా మారారనే చర్చ కూడా జరుగుతోంది. 

 

దుబ్బాక నియోజకవర్గం సిద్ధిపేట జిల్లాలో ఉంది. జిల్లా మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. అయితే జిల్లా మెత్తాన్ని పట్టించుకోకుండా సిద్ధిపేట నియోజకవర్గంలోనే మంత్రి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయన్నది విపక్షాల ఆరోపణ. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. సిద్ధిపేట, దుబ్బాక తనకు రెండు కండ్లు అంటున్న హరీష్ రావు.. ఇప్పటివరకు ఒక కన్నునే ఎందుకు కాపాడుకున్నారని ప్రశ్నిస్తున్నారు. సిద్ధిపేటలాగా దుబ్బాక ఎందుకు లేదని హరీష్ రావును నిలదీస్తున్నారు. సిద్ధిపేటలో రోడ్లు అద్దాల్లా మెరుస్తుంటే.. దుబ్బాక నియోజకవర్గంలో ఎందుకు బీటలు పడ్డాయో హరీష్ రావు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాకు వచ్చిన నిధులన్ని సిద్ధిపేటకే ఖర్చు పెట్టారని రేవంత్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు ప్రజల్లోకి బాగా వెళుతున్నాయని అంటున్నారు. సిద్ధిపేటతో పోలుస్తూ దుబ్బాకలో అభివృద్ధిపై నియోజకవర్గ ఓటర్లు చర్చించుకుంటున్నారని, ఇది తమకు కలిసివస్తుందని హస్తం నేతలు ఆశలో ఉన్నారు.

 

ఇక బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావుతో పాటు కమలం నేతలు కూడా హరీష్ రావునే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదని.. దుబ్బాక పాలిట శాపమని ఘాటుగా విమర్శిస్తున్నారు . దుబ్బాక నియోజకవర్గాన్ని మొదటి నుంచి కేసీఆర్ కుటుంబం నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తున్నారు రఘునందన్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణలో గజ్వేల్ రైతులకు ఎక్కువ ప్యాకేజీ ఇచ్చి.. దుబ్బాక రైతులకు తక్కువ ఇచ్చారనే విషయాన్ని ప్రచారంలో చెబుతున్నారు. సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో వేల  కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతూ.. పక్కనే ఉన్న దుబ్బాకను ఎందుకు వలిదేశారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి మద్దతుగా  ఉంటున్న యువత కూడా హరీష్ రావు లక్ష్యంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవన్ని తమకు ప్లస్ అవుతాయని కాషాయ నేతలు ధీమాగా ఉన్నారు. 

 

దుబ్బాకలో మారుతున్న రాజకీయ సమీకరణలతో గులాబీ పార్టీలో గుబులు పెరుగుతుందని తెలుస్తోంది. ట్రబుల్ షూటర్ అనుకుంటున్న హరీష్ రావే తమకు ట్రబుల్ గా మారే అవకాశం ఉందనే చర్చ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతల్లోనూ జరుగుతుందట. హరీష్ రావుపై జనాల్లో మంచి పేరున్నా.. సిద్దిపేట లాగా దుబ్బాకలో అభివృద్ధి పనులు చేపట్టలేదన్న అంశం తమకు ఇబ్బందిగా మారుతుందని అధికా ర పార్టీ నేతలు లోలోపల ఆందోళన చెందుతున్నారట. ఈ పరిస్థితిని గమనించే హరీష్ రావు మరింత స్పీడ్ పెంచారని, ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నారని  చెబుతున్నారు.