మాజీ స్పీకర్ మండలి చైర్మన్?

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో... ఎప్పుడు ఎవరిని ఏ పదవి ఎప్పుడు ఎలా వరిస్తుందో, కొన్ని కొన్ని సందర్భాలలో ఊహకు కూడా చిక్కదు. తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్’గా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకున్న, మధుసూదనాచారి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా భూపాలపల్లి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడి పోయారు. అప్పటి నుంచి ఏ పదవీ లేక,  ఒక విధంగా విరహ వేదన అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడు అనుకోకుండా, ఆయన్ని ఎమ్మెల్సీ పదవి వరించింది. అది కూడా కొంచెం ఎక్కువ గౌరవప్రదమైన గవర్నర్ నామినేషన్ కోటాలో, ఆయన ఎమ్మెల్సీగా పెద్దల సభలో కాలు పెట్టారు. 

నిజానికి ఈ గౌరవం, కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి దక్కవలసింది.  అయన పార్టీలో చేరిన 15 రోజులకే ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన్ని గవర్నర్ కోటాలో నామినేషన్’కు ఎంపిక చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రి వర్గం కూడా, కౌశిక్ రెడ్డ్డి  పేరును నామినేటెడ్ ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ తీర్మానం చేసింది. గవర్నర్’ కు కూడా పద్దతిగానే పంపించారు. అయితే, ముఖ్యమంత్రి ఒకటి తలిస్తే గవర్నర్ వేరోకటి తలిచారో ఏమో కానీ, ఎందుకనో నెలలు గడచినా గవర్నర్ ఆ ఫైల్ క్లియర్ చేయలేదు. 

ఇంతలో పుణ్య కాలం కూడా ముగిసి పోయింది . హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. తెరాస ఓడిపోయింది. అయినా, ముఖ్యమంత్రి కౌశిక రెడ్డిని మాత్రం బోడి మల్లయ్యను చేయలేదు. ఎమ్మెల్ల్యే కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆయన  ఏకగ్రీవంగా గెలిచారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అలా కౌశిక రెడ్డికి దక్కవలసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి,  మధుసూదనాచారికి దక్కింది . ఆఫ్కోర్సే, అది కాకపోతే, ఎమ్మెల్సీ కోటాలో లేదా స్థానిక కోటలోనో  మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవి దక్కితే దక్కేదేమో, కానీ, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కావడంతో ఆయనకు ఇంకొంచెం ఎక్కువ   గౌరవం దక్కిందని అనికోవచ్చును . 

అదలా ఉంటే, తెలంగాణ తోలి అసెంబ్లీ స్పీకర్’గా చరిత్రలో స్థానం సంపాదించుకున్న మధుసూదనాచారి ఇప్పుడు, ఉభయ సభల అధ్యక్ష పదవిని అందుకున్న తొలి వ్యక్తిగా    మరో చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారని సమాచారం. అసెంబ్లీ స్పీకర్’గా పనిచేసిన ఆయన్ని మండలి చైర్మన్’ గా నియమిచాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. మండలి తొలి చైర్మన్  స్వామి గౌడ్ పదవీ కాలం ముగిసిన తర్వాత మండలి చైర్మెన్‌గా ఉన్న ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవి కాలం కూడా ముగిసింది. ప్రస్తుతం ప్రొటెం చైర్మెన్‌గా ఉన్న భూపాల్‌రెడ్డి పెద్దల సభను నడిపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ  స్థానంలో మధుసూదనాచారిని నియమించే అవకాశం ఉన్నట్టు పార్టీ  వర్గాల సమాచారం. గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా మళ్ళీ మండలికి ఎన్నికయ్యారు. అయితే, ఆయనకు  చైర్మన్ పదవి కంటే మంత్రి పదవి పై మక్కువని అంటారు. అందుకే ఆయన ‘ఒక్క అవకాశం’ కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కూడా అందుకు సుముఖంగానే ఉన్నారని సమాచారం. సో..ఆయనకు మంత్రి పదివి ఎలా ఉన్నా మధుసూదనాచారికి మాత్రం చైర్మన్ పదవి ఖాయమని అంటున్నారు. 

ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి చైర్మెన్‌గా చారిని నియమించడంతోపాటు అసెంబ్లీ మాజీ స్పీకర్‌కు తగిన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంలో సీఎం ఆ బాధ్యతలు ఆయనకు అప్పగిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది. ఎమ్మెల్యే కోటాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పరుపాటి వెంకట్రా మిరెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం చైర్మెన్‌ భూపాల్‌రెడ్డి శాసనమం డలిలోని తన చాంబర్‌లో వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ నేపధ్యంలో మధుసూదనాచారి కాబోయే చైర్మన్ అనే ముచ్చట పార్టీ వర్గాల్లో షికార్లు చేస్తోంది. నిజానికి ఇప్పటికే ఆయన అభిమానులు బొకేలు, పూల దండలు సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం ..