ఈటలని వెంటాడుతున్న ఓటమి భయం.. ఎందుకో తెలుసా?

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కి ఇంకా ఎంతో సమయం లేదు. రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ప్రచార జోరు పెంచారు. ఇంత వరకు  నవరాత్రి ఉత్సవాలు, దీక్షల్లో ఉన్న రాజకీయ పార్టీల పెద్దలు ప్రచారంలో జోష్ పెంచేందుకు హుజూరాబాద్ చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఎలాగైనా గెలవాలని ఆరాట పడుతున్న అధికార తెరాస ... తెరాసను ఓడించి పంతం నెగ్గించుకోవాలని పట్టు మీదున్న బీజేపీ ... ప్రచార వేడినిని పెంచుతున్నాయి. తెరాస ప్రచార బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న మంత్రి హరీష్ రావు, ఎప్పటికప్పుడు కొత్త అస్త్రాలతో బీజీపీకి సవాళ్ళు  విసురుతున్నారు. బ్రహ్మాస్త్రం అనుకున్న దళిత బంధుతో సహా ఇంతవరకు ప్రయోగించిన అన్ని అస్త్రాలు తుస్సుమన్నాయో ఏమో ... ఇప్పుడు కొత్తగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలను  ఆశ్రయించారు. గ్యాస్ టాక్స్’లో రాష్ట్రం వాటా పై చర్చకు రావాలని బీజేపీని  సవాలు చేశారు. అయితే బీజేపీ తరపున దుబ్బాక ఎమ్మెల్యే  రఘునందన్ రావు  ప్రతిసవాల్ కు మాత్రం హరీష్ సమాధానం చెప్పలేదు. 

బీజేపీ అభ్యర్ధి ఈటల హరీష్ సవాళ్ళకు అంతగా భయపడ లేదు కానీ,ఆయన్ని భయపెడుతున్న అంశం వేరొకటుంది. హుజూరాబాద్ నియోజక వర్గం నుంచి ఆరు సార్లు గెలిచిన ఈటల అన్నిసార్లు ‘కారు’ గుర్తు మీదనే గెలిచారు. ఈటల అంటే కారు ... కారంటే ఈటల అన్నంతగా, ఈటల గుర్తు కారని, ప్రజల మనసుల్లో ముద్ర పడిపోయింది. అయితే ఇప్పుడు, గుర్తు మారింది. బీజేపీ గుర్తు కమలం గుర్తు పై ఈటల పోటీ చేస్తున్నారు. ఈమధ్య ఈటల శిబిరం నుంచి తెరాస శిబిరానికి చేరిన నాయకుడొకరు, అలవాట్లో పొరపాటుగా ఈటలకు జై కొట్టినట్లుగా, రేపు జనాలు అదే అలవాట్లో పొరపాటుగా కారు గుర్తుకు గుద్దేస్తే ... ఇప్పుడు ఈటలను, బీజేపీని భయపెడుతున్న విషయం ఇదే. 

ప్రధాన పోటీ తెరాస, బీజేపీ మధ్యనే అయినా  కాంగ్రెస్’ తో పాటుగా ఇద్దరు ముగ్గురు, చిన్నా చితకా పార్టీల అభ్యర్ధులు,ఒకరిద్దరు ఇండిపెండెంట్ అభ్యర్ధులు, అధికార పార్టీ వ్యతిరేక ఓటును గాట్టిగానే పట్టుకు పోతారు. అదొక ముప్పు అలా ఉంటే, ఈటల గుర్తు ‘కారు’ అనుకుని, ముఖ్యంగా నిరక్షరాస్యులైన వృద్ధులు, మహిళలు అలవాటులో పొరపాటున కారు బటన్ నొక్కేస్తే ఎలా అనే ఆందోళన ఈటలను వెంటాడుతోంది. అయితే, ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టిన బీజేపీ...ఈటల గుర్తు ..కమలం ..కమలం గుర్తు ఓటేద్దాం ఈటలను గెలిపిద్దామని... పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారాన్ని చేపట్టింది. ఈటల కూడా ప్రతి సందర్భంలో కమలం పువ్వు గుర్తును గుర్తుచేస్తున్నారు. అయినా గుర్తు మార్పు కొంప ముచుతుందేమో అన్న భయం అయితే ఈటలను వెంటాడుతూనే ఉందని అంటున్నారు.