Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బంగారు తెలంగాణ బహుదూరమేనా?
posted on: Jul 19, 2014 10:59AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దాన కర్ణుడిలాగా ప్రతిరోజూ కొన్ని వాగ్దానాలను తెలంగాణ ప్రజలకు ఇస్తూ వున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇక ‘బంగారు తెలంగాణ’ని నిర్మించుకోవడమే మన పని అన్నట్టుగా ఆయన హామీల మీద హామీలు గుప్పిస్తూ, రకరకాల పథకాలను ప్రకటిస్తూ తెలంగాణ ప్రజల్లో తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన పథకాలు, హామీల చిట్టా చూస్తే తెలంగాణలో ఏదో అద్భుతం జరగబోతోందన్న భ్రమ కలుగుతుంది. అయితే కేసీఆర్ వరాల జల్లు అమలుకు ఎంతవరకు సాధ్యమన్న విషయాలను వాస్తవ దృక్పథంతో పరిశీలిస్తే మాత్రం గుండె జల్లుమంటుంది. పథకాలు అయితే ఫుల్లుగా వున్నాయిగానీ, పైసల పరిస్థితి మాత్రమే డల్లుగా, నిల్లుగా వుంది. పేద దళిత రైతులకు ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ చెబుతున్నారు. అది కూడా ఆగస్టు 15 నుంచే భూ పంపిణీ మొదలుపెడతామని అంటున్నారు. తెలంగాణలో మొత్తం 18 లక్షల పేద దళిత కుటుంబాలు వున్నాయి. వారందరికీ మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలంటే 54 లక్షల ఎకరాల భూమి కావాలి. మరి వారందరికీ పంచేంత ప్రభుత్వ భూమి లేదు. అలాంటప్పుడు ప్రయివేటు భూమిని ప్రభుత్వమే కొని పంచాలి. ప్రయివేటు భూమి ఎకరం యావరేజ్‌గా మూడు లక్షలు వుంటుంది. ప్రయివేటు వ్యక్తుల నుంచి భూమిని కొనుగోలు చేయాలంటే లాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం మార్కెట్ విలువకు నాలుగు రెట్లు చెల్లించి కొనుగోలు చేయాలి. అంటే ఎకరానికి 12 లక్షలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మొత్తం 54 లక్షల ఎకరాల్లో కనీసం 30 లక్షల ఎకరాలు అయినా కొనుగోలు చేయాలంటే, 30 లక్షలని పన్నెండు లక్షలతో హెచ్చవేస్తే మూడు లక్షల అరవై వేల కోట్లు అవుతుంది. ఈ డబ్బంతా కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది? భూమి విలువ సంగతి అలా వుంచితే ప్రభుత్వం పంచదలచుకున్న భూమిని సర్వే చేయడానికే 6 వందల కోట్లు ఖర్చవుతుంది మరి! అలాగే తెలంగాణ ప్రభుత్వానికి రైతు రుణాల మాఫీకి 19 వేల కోట్లు, పోలీసు వాహనాల కొనుగోలుకు 4,342 కోట్లు, 2000 మంది అమరవీరుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షలు చొప్పున ఎక్స్.గ్రేషియా చెల్లించాలంటే రెండొందల కోట్లు కావాలి. కళ్యాణ లక్ష్మి పథకం కోసం 50 వేల కోట్లు కావాలి. ఇక కేసీఆర్ ప్రకటించిన పథకాలు, వరాలు ఇవన్నీ నెరవేర్చాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలన్నది ఆర్థిక నిపుణులు మాత్రమే చెప్పగలిగిన అంశం. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 70 వేల కోట్లు మాత్రమే. అయితే వార్షిక బడ్జెట్ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా వున్న ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. మరి బడ్జెట్‌కి, ఖర్చుకి వున్న హస్తిమశకాంతరాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా బేలన్స్ చేస్తుందనేది కాకలు తిరగిన ఆర్థిక నిపుణులకు కూడా అంతుపట్టని అంశం. కేసీఆర్ బంగారు తెలంగాణ సాధిస్తానని చెబుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును తలచుకుంటే బంగారు తెలంగాణ బహుదూరంగా వున్నట్టుగా అనిపిస్తోందని తెలంగాణకు చెందిన అధికారులు, ఆర్థికవేత్తలే అంటున్నారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ ఇస్తున్న హామీలు మాత్రం తెలంగాణ ప్రజల గుండెల నిండుగా వున్నాయి. అయితే ఆ కలలను నిజం చేయాల్సిన ఖజానా మాత్రం ఖాళీగా వుంది.


.jpg)
.jpg)


