సిద్దూను ఓడించడమే లక్ష్యమా? కెప్టెన్ వెనుక బీజేపీ ఉందా? 

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ త్వరలో కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. నిజానికి ఇదే విషయాన్ని ఆయన ఇంతకు ముందు కూడా చెప్పారు. ఇప్పడు మళ్ళీ మరోమారు పునరుద్ఘాటించారు. అయితే, అప్పుడు ఆయన ఆ విషయాన్ని స్వయంగా చెప్పకుండా, తమ వ్యక్తిగత కార్యదర్శి ద్వారా చెప్పించారు. ఇప్పుడు ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి తమ మనసులోని భావలాను పంచుకున్నారు.కెప్టెన్ అమరేందర్ సింగ్ రాటుతేలిన రాజకీయ నాయకుడు. నాలుగు పదుల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలా ఆటుపోట్లు చూశారు. దేశమంతా ముఖ్యంగా ఉత్తర  భారతదేశం అంతటా కాంగ్రెస్ వ్యతిరేక గాలులు వీస్తున్న సమయంలో కూడా పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన నాయకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్. నిబద్దత,సైనిక క్రమశిక్షణ ఉన్న నాయకుడు. 

అసెంబ్లీ ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేని సమయంలో, గత ఐదారు నెలలుగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే కెప్టెన్ తనంతట తానుగా కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు రాలేదు, కాంగ్రెస్ అధినాయకత్వం పొమ్మన కుండా పొగపెట్టి ఆయన్ని బయటకు పంపించింది. నిజానికి, కాంగ్రెస్ పార్టీని వదిలేసిన చివరి  రోజుల్లో ఆయన చిన్నా పెద్దల నుంచి ఎదురైన అవమానాలు చాలానే భరించారు. పీసీసీ చీఫ్ గా సిద్దూ వద్దని ఆయన ఎంత గట్టిగా చెప్పినా, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా ఆయన మాటను పెడచెవిన పెట్టారు. పట్టించుకోలేదు. సిద్దూను పీసీసీ చీఫ్ గా నియమించారు. అయినా కెప్టెన్ అలాగే సర్దుకు పోయారు. చివరకు ఆయన ఇంకా ముఖ్యమంత్రి పదవిలో ఉండాగానే, కనీసం ఆయనకు సమాచారం ఇవ్వకుండా, ఆయన స్థానంలో నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయడంతో, ఇక మరో దారి లేక  రాజీనామా చేశారు. ఆ తర్వాత సిద్దూ ఇంకో చిచ్చుపెట్టి ఆయన కూడా రాజీనామా చేశారు. అందుకే ఇప్పుడు పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ తలలేని మొండెంలా మిగిలింది.  

అయితే అదంతా ముగిసిన అధ్యాయం అనుకుంటే, ఇప్పుడు కెప్టెన్ సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడం వలన కొత్తగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే చిక్కులు ఏమిటీ, అంటే ఏమీ ఉండక పోవచ్చును. నిండామునిగి వాడికి చలేమిటి అన్నట్లు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకో వలసిన దాని కంటే ఎక్కువే పోగొట్టుకుంది. కాబట్టి, కెప్టెన్ పార్టీ పెట్టడం వలన కొత్తగా పోయేది ఏమీ లేదని, పార్టీ నాయకులే అంటున్నారు. కొత్తగా పార్టీ పెట్టి అమరీందర్ సింగ్’ బావుకునేంది కూడా ఏమీ ఉండదు.ఏమిచేసినా, ఏమి చేయక పోయినా, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండక పోవచ్చును. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. అయితే, తనను అవమానకరంగా బయటకు పంపిన పార్టీని, అందుకు మూల కారణం అయిన సిద్దూను ఓడించడమే కెప్టెన్ లక్ష్యం కావచ్చును. కావచ్చును కాదు,ఆయన అదే విషయం గతంలోనూ చెప్పారు ఇప్పుడూ చెప్పారు.గతంలోనే ఆయన సిద్దూను దేశద్రోహి, ప్రమాదకర వ్యక్తి అని పేర్కొన్నారు.  

కెప్టెన్ కొత్త పార్టీ గురించి పంజాబ్ రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తికర చర్చ జరుగుతోంది. భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఒకరిద్దరు మినహా ఎవరూ కెప్టెన్ వెంట రాలేదు. మరో వంక బీజేపీ’ కెప్టెన్ పెట్టె ప్రతి బీజేపీతో పొత్తు పెట్టుకుంతుందని  వస్తున్న  వార్తలు,ఆయన వెంట నడవాలనుకునే వారు కూడా ఒకటికి రెండు సార్లు అలోచించు కుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు  వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరానికి పైగా సాగుతున్న ఆందోళన, పంజాబ్’లో బీజేపీని బూచిని చేసింది. బీజేపీ పరు వింటేనే రాజకీయ నాయకులు ఆమడదూరం పరుగులు తీస్తున్నారు. ఈ నేపధ్యంలో  కెప్టెన్ పార్టీ... కాంగ్రెస్ ను ఏ మేరకు దెబ్బబ్బతీస్తుందో .. అసలేం చేస్తుందో చూడవలసి ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.