ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం!

posted on: Mar 5, 2026 7:28PM

 

తెలుగువన్ నిర్వహించిన ‘వాస్తవ వేదిక’ కార్యక్రమంలో ప్రస్తుత మధ్యప్రాచ్య పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచంపై చూపుతున్న ప్రభావంపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో జరిగిన ఈ చర్చలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పాల్గొని కీలక అంశాలను విశ్లేషించారు.

ఈ సందర్భంగా ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా పాత్ర, అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలపై పీవీ రమేష్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశముందని, అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని వివరించారు.

యుద్ధాల్లో మతపరమైన అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని, దాని ప్రభావం ప్రాంతీయ స్థాయిని దాటి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని పీవీ రమేష్ పేర్కొన్నారు. “ఈ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా?” అన్న ప్రశ్నను రవిశంకర్ లేవనెత్తగా, ఈ యుద్ధాన్ని ఆపగల శక్తి ఎవరిదన్న అంశంపైనా చర్చ జరిగింది. ఇరాన్‌లో ప్రజాస్వామ్య హక్కుల పరిస్థితిపై కూడా చర్చ సాగింది. గతంలో ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ పాలనలో మహిళలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు ఉండేవని పీవీ రమేష్ తెలిపారు.

ఈ యుద్ధం భారతదేశంపై పడే ప్రభావంపై కూడా రవిశంకర్ ప్రశ్నించారు. యుద్ధం కొనసాగితే పెట్రోలు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని, భారత్ వద్ద చమురు నిల్వలు సుమారు మూడు నెలల వరకే ఉన్నాయని పీవీ రమేష్ పేర్కొన్నారు. దీని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందన్నారు.

అదే సమయంలో గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు ఉపాధి, వ్యాపార రంగాల్లో పనిచేస్తున్నారని, యుద్ధం మరింత తీవ్రతరమైతే వారికి కూడా ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు కృత్రిమ మేధస్సు (AI) ప్రభావంతో భారత ఐటీ రంగంలో ఉద్యోగాలపై కూడా మార్పులు వస్తున్నాయని రవిశంకర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి అనేక కీలక, ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, పీవీ రమేష్ మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించండి.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...