కరువు ఎఫెక్ట్..ఐపీఎల్ మ్యాచ్‌లకు మురుగునీరు

మహారాష్ట్రలో కరువు ఎఫెక్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లపై గట్టిగా పడుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు తీసుకుంటున్న చర్యలపై బీసీసీఐ బాంబే హైకోర్టుకు వివరణ ఇచ్చింది. మహారాష్ట్రలో కరువు పరిస్థితుల వల్ల ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం నీటి వృథాపై లోక్‌సత్తా మూవ్ ‌మెంట్, ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థలు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై న్యాయస్థానం సీరియస్ అయింది. మ్యాచ్‌ల ఏర్పాట్లపై వివరణ ఇవ్వాల్సిందిగా బీసీసీఐని ఆదేశించింది.

 

ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం మురుగునీటిని రీసైకిల్ చేసి ఉపయోగిస్తామని బీసీసీఐ కోర్టుకు తెలిపింది. అంతేకాకుండా నాగ్‌పూర్‌లో జరిగే మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు వివరించింది. పంజాబ్ కింగ్స్ తాము ఆడబోయే మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పూణే, ముంబైలలో జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. ఈ రెండు స్టేడియాల్లో 17 మ్యాచ్‌లు జరగనున్నాయి.