వ‌జ్రాల వ్యాపారికి 'ప‌ద్మ' అవార్డు.. ఉద్యోగుల‌కు తిరిగిచ్చేస్తున్న 'శ్రీమంతుడు'..

చ‌దివింది నాలుగో త‌ర‌గ‌తి. చేసేది వ‌జ్రాల ఎగుమ‌తి. 50 దేశాల‌తో వ్యాపారం. ఏటా 6వేల కోట్ల ట‌ర్నోవ‌ర్‌. ఎంత సంపాదించామ‌న్న‌ది కాదన్న‌య్యా.. స‌మాజానికి ఎంతోకొంత తిరిగిచ్చేశామ‌న్న‌దే ముఖ్యం అనే మ‌న‌స్త‌త్వం. అందుకే, త‌న కంపెనీలో ప‌ని చేసే ఉద్యోగుల‌కు కార్లు, ఫ్లాట్లు, విల్లాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు గిఫ్ట్‌లుగా ఇస్తుంటారు. పేద‌ల‌కు పెళ్లిల్లు, విద్యార్థుల‌కు ఆర్థిక సాయం కూడా చేస్తుంటారు. అందుకే, గుజరాత్‌కు చెందిన సావ్జీ ఢోలాకియాకు ఈఏడాది ప‌ద్మ‌శ్రీ పుర‌ష్కారం వ‌రించింది. 

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా దుధాలా గ్రామంలో 1962 ఏప్రిల్‌ 12న ఓ రైతు కుటుంబంలో సావ్జీ ఢోలాకియా జన్మించారు. నాలుగ‌వ త‌ర‌గ‌తితోనే చ‌దువు మానేశారు. 13 ఏళ్ల వయసులో మేనమామ దగ్గర పని కోసం సూరత్ షిఫ్ట్ అయ్యారు. కొన్నేళ్ల పాటు సావ్జీ, ఆయన సోదరులు మేనమామ దగ్గరే వజ్రాల పాలిషింగ్‌ వర్క్‌ నేర్చుకున్నారు. ఆ తర్వాత 1984లో సొంతంగా వజ్రాల వ్యాపారం మొదలుపెట్టారు.   

మొద‌ట్లో వీరి వ్యాపారం అంతంత మాత్ర‌మే. 1992లో ముంబైలో శ్రీ హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ పేరుతో వజ్రాలను విదేశాల‌కు ఎగుమతి చేయ‌డం ప్రారంభించ‌డంతో వారి ద‌శ తిరిగింది. ఇంతింతై.. ఏటేటా భారీగా బిజినెస్ జ‌రిగింది. 2014లో సావ్జీ కంపెనీ వార్షిక టర్నోవర్‌ 400 కోట్లు దాటింది. ప్ర‌స్తుతం కంపెనీ టర్నోవర్‌ 6వేల కోట్లకు పైనే. ముంబై నుంచి 50కి పైగా దేశాలకు వజ్రాలు ఎగుమతి చేస్తుంటారు. అమెరికా, బెల్జియం, యూఏఈ, హాంకాంగ్‌, చైనాల్లోనూ అనుబంధ సంస్థలున్నాయి.   

సావ్జీ ఢోలాకియాకి చెందిన‌ కంపెనీలో దాదాపు 6500 మంది పని చేస్తున్నారు. సిబ్బందిని ఎంతో ప్రేమ‌తో చూసుకుంటారు. ఏటా వారి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానుకలు అందిస్తున్నారు. 2011లో దీపావళి కానుకగా తన సిబ్బందికి ఖరీదైన బహుమతులతో పాటు భారీ బోనస్‌ కూడా ఇచ్చారు. 2015లో ఉద్యోగుల‌కి 491 కార్లు, 200లకు పైగా ఫ్లాట్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. 2018లో త‌న ఉద్యోగుల్లో 600 మందికి కార్లు, 900 మందికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను.. ప్రధాని మోదీ చేతుల మీదుగా అందించారు. సిబ్బందితో పాటు పేద యువతులకు పెళ్లిళ్లు చేయడం, విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడంలో ముందుంటారు. సావ్జీ ఢోలాకియా సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారంతో అభినందించింది. రియ‌ల్ శ్రీమంతుడిని అవార్డుతో గౌర‌వించింది.