పది వేలు సరే.. ప్రాణాలకు రక్షణేది! ఆ పనిచేస్తే ఆయన దేవుడే? 

వరదలతో అల్లాడిపోయిన హైదరాబాద్ ప్రజలను వర్షాలు ఇంకా వణికిస్తూనే ఉన్నాయి. రాత్రి నుంచి సిటీలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్ ఏరియాలో భారీ వర్షం కురిసింది. మరో 48 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రేటర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఐఎండీ అలర్ట్ తో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ నుంచి స్పీడ్ బోట్లను తెప్పించింది.  వరద ముంపు ఎక్కువగా ఉన్న మీర్ పేట, దిల్ షుక్ నగర్, ఓల్డ్ సిటీలోని బస్తీలు, లోట్టు ప్రాంతాల్లో స్పీడ్ బోట్లను  అందుబాటులో ఉంచింది. అవసరమైతే మరిన్ని బోట్లను తెప్పిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. 

 

వరద బాధితులకు పరిహారం కూడా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ఏరియాల్లోని ప్రతి ఇంటికి 10 వేల రూపాయలు ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు లెక్కలు తీస్తున్నారు. వరదలతో సిటిలో ఇప్పటికే వంద మందికి పైగానా చనిపోయారు. చెరువుల్లో, నాలాల్లో ఇంకా మృతదేహాలు లభ్యమవుతూనే ఉన్నాయి. అయితే వరద బాధితులకు సర్కార్ సత్వర సాయం చేయడాన్ని స్వాగతిస్తూనే... ప్రభుత్వానికి మరిన్ని ప్రశ్నలు వేస్తున్నారు  గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు. వరదల నుంచి ప్రజల ప్రాణాలకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. కాలనీలన్ని చెరువులుగా మారిపోయాయని, తమకు బతుకు భరోసా లేకుండా పోయిందని అవేదన చెందుతున్నారు. నష్ట పరిహారం ఇవ్వడంతో  పాటు శాశ్వాత వరద నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇండ్లలోకి వరద చేరకుండా , కాలనీలు మునగకుండా చూడాలని బాధితులు వేడుకుంటున్నారు. 

 

ఇటీవలే సిటీలోని వరద ప్రాంతాలను పరిశీలించారు మంత్రి కేటీఆర్. అక్కడి సమస్యలను స్వయంగా చూశారు. గ్రేటర్ వరదలపై మాట్లాడిన కేటీఆర్.. నాలాల కబ్జాలు నిజమేనని ఒప్పుకున్నారు. చెరువు శిఖం భూముల్లోనూ కట్టాడాలు ఉన్నాయన్నారు. ఇటీవలే మైలార్ దేవ్ పల్లి పరిసరాలను ముంచెత్తిన పల్లె చెరువును పరిశీలించిన ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కూడా చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అంగీకరించారు. ఇప్పుడు సిటి జనాలు ఈ విషయాలనే ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. అక్రమ కట్టడాలున్నాయని చెబుతూ వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. చెరువుల్లోని కబ్జాలను ఎందుకు తొలగించడం లేదని నిలదీస్తున్నారు. నాలాలపై ఉన్న ఇండ్లను తొలగిస్తామని ఐదేండ్ల క్రితం ఇచ్చిన హామీ ఏమైందని బస్తీ వాసులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. 

 

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారెవరూ టెన్షన్​ పడొద్దని.. ఆదుకునేందుకు దేవుడి లాంటి సీఎం కేసీఆర్ ఉన్నారని గ్రేటర్ పరిధిలోని మంత్రులు, మేయర్, టీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు.టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చినాక అక్రమ కట్టడాలు ఎక్కడా లేవు. 2014 తర్వాత కట్టినవన్నీ చట్టానికి లోబడి ఉన్నయి. కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగితే మొత్తం హైదరాబాద్ మునిగిందని ప్రచారం చేయటం కరెక్ట్​ కాదు. గత పాలకుల పాపమే ఈ పరిస్థితికి కారణమన్నారు. అయితే గ్రేటర్ అధికార పార్టీ నేతల మాటలపైనా సిటి  ప్రజలు విమర్శలు చేస్తున్నారు. 2014కు ముందే అక్రమ కట్టడాలు ఉన్నాయని చెబుతున్న నేతలు.. ఆరేండ్లు అవుతున్నా వాటిని ఎందుకు తొలగించలేదని అడుగుతున్నారు. గత ఎన్నికల సమయంలో వరద నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారా లేదా అని నిలదీస్తున్నారు. రాజకీయాలు చేయకుండా చిత్తశుద్ధిలో వరద నివారణకు శాశ్వాత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

 

హైదరాబాద్ ను వరదలు ముంచెత్తకుండా చర్యలు చేపడితే నిజంగా కేసీఆర్ దేవుడేనని చెబుతున్నారు గ్రేటర్ ప్రజలు. టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు ఆయన దేవుడో కాదో నిరుపించుకోవాల్సిన సరైన సమయం ఇదేనని చెప్పారు. తమ లీడర్లు నష్టపోతారనే, కబ్జాలు తీసేస్తే కొన్ని ఓట్లు రావనే కారణాలు చూడకుండా..ఓట్లు రాజకీయలను పక్కన పెట్టి  పార్టీలకతీతంగా పనిచేసి భాగ్యనగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని  స్పష్టం చేస్తున్నారు. ఎప్పటిలానే మాటలతో సరిపెట్టకుండా చిత్తశుద్దితో చర్యలు చేపట్టి హైదరాబాద్ ను వరదల నుంచి రక్షించాలని గ్రేటర్ వాసులు కోరుకుంటున్నారు.