దేశంలో ముస్లింల జనాభా పెరుగుతోందా? 

భారత దేశం అంటే హిందూ దేశంగా భావిస్తారు. అయితే కొన్ని రోజులుగా దేశంలో ఓ ప్రచారం సాగుతోంది. దేశంలో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతుందని.. ఇది ఇలాగే కొనసాగితే మరో ముప్పే ఏండ్లలో భారత దేశంలో హిందువుల కంటే ముస్లిం జనాభే ఎక్కువ అవుతుందనే చర్చ జరుగుతోంది.ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషత్ తో పాటు పలు హిందూ సంఘాలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. విజయదశమి సందర్భంగా చేసిన ప్రసంగంలో మోహన్ భగవత్ మరోసారి ఇదే అంశంపై మాట్లాడారు. 

దేశంలో ముస్లిం, క్రిస్టియన్ జనాభా పెరిగిపోతుందని చెప్పారు మోహన్ భగవత్.  జనాభా నియంత్రణ విధానాన్ని తీసుకురావాలన్నారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించాలని సూచించారు. ఇది అందరికీ సమానంగా వర్తింపచేయాలని.. జనాభా అసమతౌల్యత పెద్ద సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ లో ప్రజలను భయపెట్టడం కోసం ఉగ్రవాదులు హింసను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ తాలిబన్ ఉగ్రవాదం నుంచి జనాభా నియంత్రణ వరకు పలు అంశాలపై మోహన్ భగవత్ మాట్లాడారు. 

జనాభా నియంత్రణ విధానాన్ని తీసుకురావాలన్న  ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. మోహన్ భగవత్ విజయదశమి ప్రసంగం అబద్దాలు సగం సత్యాలతో నిండి ఉందని ఓవైసీ ఆరోపించారు. జనాభా నియంత్రణ విధానం ఆర్టికల్ 370 రద్దు ఇతర అంశాలపై భగవత్ చేసిన కామెంట్లను ఖండించారు అసద్. ముస్లింలు క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని ఆయన పునరావృతం చేశారని చెప్పారు. కాని దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉందని ఒవైసీ చెప్పారు. బాల్య వివాహాలు సెక్స్ సెలక్టివ్ అబార్షన్ ల వంటి సామాజిక దూరాచారాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. 

ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ లో ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారని భగవత్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఈ ఏడాది జరిగిన పౌరహత్యలను ఒవైసీ ప్రస్తావించారు. హత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించినఅసద్.. దీనివల్ల ఇంటర్నెట్ షట్ డౌన్ లు సామూహిక నిర్బంధాలతో కశ్మీర్ ఒక రావణకాష్టంలా మారిందని విమర్శించారు. సగం నిజం సగం అబద్దం చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగపడడం ఉండదని ఓవైసీ విమర్శించారు.