మరికొన్ని కొత్త రూట్లలో దూసుకుపోనున్న మెట్రోరైలు

ప్రస్తుతం 55 రైళ్ల ద్వారా రోజు వెయ్యి ట్రిప్పులు నడిపిస్తున్నారు. మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు ఆపరేషన్స్‌ వల్ల ప్రతి నెలా రూ.40 కోట్ల ఆదాయం వ‌స్తుంది. అందులో రూ.30 కోట్లు ప్యాసింజర్‌ టికెట్ల నుంచి సమకూరుతోంది. ప్రయాణికుల నుంచి డిమాండ్‌ పెరుగుతుండటంతో మరో రెండు అదనపు రైళ్లను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ఈ రెండు రైళ్లు ప్రయాణికులకు వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.

మొదటి దశ ప్రాజెక్టులో మూడు కారిడార్లలో దాదాపు 74 కిలోమీటర్ల మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మించాల్సి ఉండగా మొత్తం 69 కిలోమీటర్లు పూర్తి చేశారు. మిగతా 5 కిలోమీటర్లు ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వే, మార్కింగ్‌ పను లు ప్రారంభం కాగా త్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నారు.

తెలంగాణా ప్రభుత్వం రెండో దశలో 62 కిలోమీటర్ల మెట్రోను విస్తరించాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసి, దీనికి బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. రెండోదశలో భాగంగా బీహెచ్‌ఈఎల్‌, హఫీజ్‌పేట్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, రేతీబౌలి, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాక్‌, లక్డీకాపూల్‌ వరకు 31 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు వయా ఇన్నర్‌రింగ్‌రోడ్డు మార్గంలో ఒవైసీ దవాఖాన, సైదాబాద్‌, ఫలక్‌నుమా మార్గం మీదుగా విమానాశ్రయానికి చేరుకుంటుంది. అదేవిధంగా నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు గల 5 కిలోమీటర్ల మార్గాన్ని కూడా కలుపుతారు. ఎలివేటెడ్‌ మెట్రోరైలు నిర్మించాంటే ఒక కిలోమీటర్‌ నిర్మాణానికి రూ.300 కోట్లు అవుతుంది.

ప్రస్తుత బడ్జెట్‌లో నగరానికి కేటాయించిన రూ.10 వేల కోట్లలో మెట్రోరైలు కేటాయింపులుండటంతో ఈ పనులు వేగవంతం అవుతాయని ఆశిస్తున్నారు. రెండోదశ విస్తరణ జ‌రిగితే నగరంలోని ఏ మూల నుంచైనా మరోమూలకు మెట్రోద్వారా ప్రయాణించడం మరింత సౌలభ్యం అవుతుంది.