హుజురాబాద్ లో ఓటర్ల హంగామా.. డబ్బుల కోసం ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి

హుజురాబాద్ నియోజకవర్గంలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓటర్లకు పార్టీలు జోరుగా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. పోటాపోటీగా మందు, మనీ పంపిణి చేస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు తమకు డబ్బులు ఇవ్వడం లేదంటూ ఆందోళన చేస్తున్నారు. ఏకంగా రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేస్తున్నారు. ఓట్లకు డబ్బులు ఇవ్వాలని ఓపెన్ గానే డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఓటింగులో పాల్గొనబోమని తేల్చి చెబుతున్నారు. 

హుజురాబాద్ నియోజకవర్గం కమలపూర్ మండలంలో అయితే ఓటర్లు రగిలిపోతున్నారు. అధికార పార్టీ నేతలు కొందరికి డబ్బులు ఇచ్చి మరికొందరికి ఇవ్వలేదని ఆరోపిస్తూ రోడ్డెక్కారు. తమకు డబ్బులు ఇవ్వాలంటూ ఏకంగా తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. వందలాది మంది మహిళలు రావడంతో పోలీసు బలగాలను అక్కడ మోహరించారు. సెంట్రల్ బలగాలు ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్న మహిళలను అక్కడినుంచి తరలించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలపై మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కమలాపూర్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్వగ్రామం. ఇక్కడ ఈటలకు గట్టి పట్టుంది. దీంతో కమలాపూర్ లో సెలెక్ట్ చేసిన ఓటర్లకే టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచారని తెలుస్తోంది. అయితే తమ పక్క ఇంట్లో డబ్బులు ఇచ్చి.. తమకు ఇవ్వకపోవడంతో కొందరు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అందరికి ఇవ్వాలని డబ్బులు పంపించారని, లోకల్ లీడర్లే ఇవ్వడం లేదని కొందరు ఓటర్లు ఆరోపించడం ఆసక్తిగా మారింది. 

ఓట్లకు డబ్బులు ఇవ్వాలంటూ ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు ఓటర్లు వస్తుండటంతో అధికారులు పరేషాన్ అవుతున్నారు. వాళ్లకు ఏం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కొందరు మహిళలు ఎంత చేపినా వినకపోవడంతో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఓటుకు ఆరు నుంచి 10 వేల రూపాయలు ఇస్తుండటం వల్లే ఓటర్లు డబ్బులు కావాలని రోడ్డెక్కుతున్నారనే చర్చ సాగుతోంది. పోలింగ్ నాటికి ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్నఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. 

Related Segment News