అదిగదిగో హుజూరాబాద్ నోటిఫికేషన్.. ఎప్పుడంటే...

హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చేస్తోంది. ఎప్పుడో కాదు, ఇప్పుడో, ఇంకాసేపటికో  ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని, అటు బీజీపీ, ఇటు తెరాస వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో నాయకుల నోట వినిపిస్తోంది. ఈ ‘శుక్రవారం’ (సెప్టెంబర్ 17) కాదంటే పై శుక్రవారం (సెప్టెంబర్ 24) నోటిఫికేషన్ నూరునొక్క శాతం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. అలాగే, అదే కాకపోతే ఇక నవంబర్ వరకు ‘నో ఛాన్స్’ అని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే, నోటిఫికేషన్ ఈరోజు వస్తుందా రేపు వస్తుందా లేక ఇంకెప్పుడో వస్తుందా అనే విషయాన్ని పక్కన  పెడితే, నోటిఫికేషన్ ఆలస్యం అయ్యే కొద్దీ, బీజేపీ వర్గాల్లో టెన్షన్ పెరిగిపోతోంది అనేది మాత్రం నిజం. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి, జనంలో  పార్టీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పట్ల సానుభూతి తరక్క ముందే ఎన్నికలు కానిచేస్తే, తేలిగ్గా బయట పడిపోతాం, అని ఈటల సహా, బీజేపీ నాయకులు తొందరపడుతున్నారు. మరో వంక ముఖ్యమంత్రి కేసీఆర్, ఎన్ని సర్వేలు చేపించినా, ప్రతి సర్వేలోనూ, ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, తెరాస ఓటమి ఖాయం..’ అనే నివేదికలు వస్తున్నాయి. కాబట్టి, అధికార పార్టీ దింపుడు కళ్ళెం ఆశతో ఎన్నికల వాయిదాకు  చేయగల ప్రయత్నాలన్నీ చేస్తోంది.  

పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నిక ప్రకటన చేయడానికి ముందు కేంద్ర ఎన్నికల సంఘం, ఉప ఎన్నికలు జరగవల్సిన  అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో  పాటుగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది ... ఎన్నికలకు సిద్దమా ... కాదా చెప్పాలని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరోనాను సాకుగా చూపి, చేతులెత్తేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్‌ ఉప ఎన్నిక ప్రకటన చేసిన సందర్భంలో  తెలంగాణ సహా దేశంలోని ఇతర రాష్ర్టాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలను కొవిడ్‌ కారణంగా జరపలేకపోతున్నామని, ఆ తర్వాత ఈ ఎన్నికలు ఎప్పుడు జరిగేది ప్రకటిస్తామని పేర్కొన్నది. దీంతో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నవంబర్‌ వరకు జరిగే అవకాశం లేదని తేలిపోయింది.

ఇదిలా ఉంటే, కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రకటనను సరిగ్గా ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఢిల్లీలో మకాం చేసి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన సమయంలోనే రావడంతో,రాష్ట్రంలో పలు రకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ గల్లీలో కుస్తీపడుతూ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో, టీఆర్‌ఎస్‌కు కేంద్రంలో ఉన్న బీజేపీతో అవసరాలు ఉన్న కారణంగానే లాలూచీ పడుతున్నాయని విమర్శలు వచ్చాయి. అయితే, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం మ్యానేజి చేయగలిగితే, లేదా అలాంటి ఉద్దేశం ఉంటే, బీజేపీ ప్రధమ శత్రువు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  ఉప ఎన్నికను అడ్డుకోవాలి, కానీ ఆ పని చేయలేదు., కాబట్టి కుస్తీ .. దోస్తీ ..లాలూచీ అన్నీ కట్టుకధాలే అని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. 

సరే అదెలా ఉన్నప్పటికీ,  హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధింఛి ఈరోజు (సెప్టెంబర్ 17) తెలంగాణ విమోచన దినోత్సం కార్యక్రమలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో రాష్ట్ర నాయకులు చర్చించే అవకాసం ఎటూ ఉంటుంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితిని చర్చించే సందర్భంగా ఈ విషయం సహజం గానే చర్చకు రావచ్చని అంటున్నారు. అమిత్‌షా స్పందనను బట్టే ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఆధారపడి ఉంటుందనే అభిప్రాయం కూడా బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ శుక్రవారం ( సెప్టెంబర్ 17)  కాని, అమిత్‌షా వచ్చిన వెళ్లిన తర్వాత శుక్రవారం ( సెప్టెంబర్ 24) గాని ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాకపోతే అది జరిగేది నవంబర్‌లోనేనని బీజేపీ వర్గాల సమాచారం. అయితే, ఎన్నిక ఇప్పుడు జరిగినా ... నవంబర్’లో జరిగినా ఫలితంలో మాత్రం మార్పు ఉండదని, ఒక విధంగా ఆలస్యం అయిన కొద్దీ అధికార పార్టీ మరింత ఇరకాటంలో పడుతుందని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు.