అపరాధ భావం లేకుండా ఇతరులకు "నో" చెప్పాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే..!

 


నేటి బిజీ జీవితాల్లో అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించడం వల్ల మనల్ని మనం కోల్పోవడం, మనకు మనం ప్రాధాన్యత ఇచ్చుకోవడం తగ్గుతుంది. ఇతరులు ఏదైనా అడిగినప్పుడు చాలామంది  నో చెప్పాలనుకుంటారు. కానీ చివరికి సరే అని చెబుతుంటారు. నో చెబితే ఎదుటివారు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఒకటైతే.. మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారు అనే మంచితనం కూడా ఇలా సరే అని చెప్పడానికి కారణం అవుతుంది.  కానీ ఇలా సరే అని చెప్పిన తరువాత చాలామంది ఆ పని పూర్తీ చేయడంలో చాలా అలసిపోతారు,  తమ మీద తాము చిరాకు పడతారు, నేనెప్పుడూ ఇంతే ఇలా తప్పు  చేస్తుంటాను అని అసంతృప్తి కలిగిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ సరిహద్దులు నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం.

సరిహద్దులు నిర్ణయించుకోవడం అంటే ఇతరులను దూరం పెట్టడం లేదా దూరం చేసుకోవడం అస్సలు కాదు.. తమను తాము గౌరవించుకుంటూ ఇతరులను కూడా గౌరవించేలా చేసేది ఇలా సరిహద్దులు నిర్ణయించుకోవడమే..  సరిగ్గా సరిహద్దులను నిర్ణయించినప్పుడు సంబంధాలు బలపడతాయి. అపరాధ భావన  లేదా తప్పు చేసిన ఫీలింగ్ లేకుండా ఎవరికైనా నో చెప్పాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే..

దేని వల్ల ఎక్కువ అలసిపోతున్నాం, చిరాకు వడుతున్నాం,  ఒత్తిడి గురవుతున్నాం అనే విషయాలు ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకుంటే ఏది ముఖ్యం,  ఏది ముఖ్యం కాదు.. అనే విషయాలు అర్థం చేసుకోవచ్చు.  ఇది ఎవరికైనా ఏ విషయానికి నో చెప్పాలి,  దేనికి చెప్పకూడదు  అని నిర్ణయించుకోవడంలో సహాయపడుతుంది.

ఎవరైనా ఏదైనా సహాయం అడిగినప్పుడు దాని విషయంలో పరిమితులు,  సామర్థ్యం మొదలైనవి మొహమాటం లేకుండా చెప్పాలి.  షో-ఆఫ్ చేయడానికి చాలామంది తమ గురించి కొండంత చెప్పుకుని తరువాత ఇబ్బంది పడుతుంటారు. అందుకే తమ గురించి తాము ఎక్కువ చెప్పుకోకూడదు. ఇలా చేస్తే ఇండైరెక్ట్ గా నో చెప్పినట్టు అవుతుంది.

ఇతరులు ఏదైనా అడిగినప్పుడు ఆ పని చేసే సామర్థ్యం లేదా సమయం లేనప్పుడు అదే విషయాన్ని చెప్పాలి.  అంతేకానీ ఎదుటివారికి అనవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. ఇది అపార్థాలకు,  తగాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది.

ఎవరికైనా దేని గురించి అయినా కారణాలు చెప్పే బదులు,  తాము ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం వంటివి వివరించి చెప్పాలి.  ఇది ఎదుటి వ్యక్తిని బాధపడకుండా ఉంచుతుంది.

ఎదుటివారు సరిహద్దులను మరచిపోయి అన్ని విషయాలను, పనులను సహాయం అడుగుతుంటే.. అలాంటి వారికి సున్నితంగానే సరిహద్దును గుర్తు చేయాలి.  సాధ్యమైనంత వరకే సమయాన్ని ఇవ్వాలి కానీ ఇతరుల కోసమే పూర్తీ సమయాన్ని వెచ్చించకూడదు.

ఎదుటివారి దృష్టిలో ఎప్పుడూ తటస్థంగానే ఉండాలి.  అంచనాలు పెరుగుతూ ఉంటే వారి దృష్టిలో ఆశించడం కూడా పెరుగుతుంది. ఎవరి అవసరాలు వారికి ముఖ్యమని ఎదుటివారికి అర్థమయ్యేలా చేస్తుండాలి. ఇలా ఉంటే ఎదుటివారు కూడా ఏ విషయం అడగాలి, ఏది అడగకూడదు  అనే విషయం అర్థం చేసుకోగలుగుతారు.

సొంత పనులు వదులుకుని మరీ ఇతరుల కోసం పాకులాడకూడదు.  ఎవరికోసం ఖర్చయ్యే సమయం అయినా సరే.. ఎన్ని కారణాలు చూపించినా  ఒక్క సెకెను కూడా తిరిగి తెచ్చుకోలేం. కాబట్టి సొంత పనుల తర్వాతే ఇతరుల పనులు చేసివ్వాలి.  ఇది స్వార్థం అని చాలామంది అనుకుంటారు. కానీ మనం బాగుంటేనే.. ఇతరుల కోసం మనం చేసే పనులకు గౌరవం ఉంటుంది.

                                 *రూపశ్రీ

Online Jyotish
Tone Academy
KidsOne Telugu