మీలో స్పోర్టివ్ నెస్(లెస్) ఎంత??

ఈ వేగవంతమైన ప్రపంచంలో ప్రతి  విషయానికి పోటీ పడాలి. ముఖ్యంగా నగరజీవనంలో  నడక అస్సలు పనికిరాదు. పరిగెడుతూనే ఉండాలి. అవకాశాల కోసమూ, అవసరాల కోసమూ. కొందరికి అదొక ఛాలెంజ్ అయితే మరికొందరికి జీవన్మరణ సమస్య కూడా అవుతుంటుంది. కాకపోతే ఈ బిజీ జీవితాల్లో, గందరగోళంలో ఎవరూ ఎక్కువగా గమనించరు అంతే. అందుకే జీవితాన్ని బతకడమనే పరుగుపందెంలో దించి పరిగేడుతూనే ఉంటారు అందరూ.  చిన్ననాడు ఆడుతూ పాడుతూ మొదలు పెట్టిన పరుగు క్రమంగా విద్య, ఉద్యోగం, సంసారం, ఆశలు, ఆశయాలు, పిల్లలు, వాళ్ళ చదువులు, కుటుంబంలో అందరిని కాంప్రమైజ్ చేయాలనే ఆలోచన ఇట్లా అన్నిటి కోసం పరుగు పెడుతూనే ఉంటారు. కానీ ఒక్కోసారి ఆ పరుగులో ఏదొక అడ్డంకి వల్ల తూలి పడటమో, లేక శక్తి చాలక పడిపోవడమో లేక ఇంకా వేరే కారణాలు కూడా ఉండచ్చు. 

 కానీ పడిపోగానే ఇక ముగిసిపోయినట్టు కాదు కదా. సాదారణంగా చాలామంది జీవితంలో సఫర్ అయ్యేది విద్య ఉద్యోగమనే అంశాల్లోనే. సరైన విధంగా టార్గెట్ చేరుకోకపోవడం చధవలేకపోవడం, చదివినా సరైన ఏకాగ్రత లేక చదివిన దాన్ని గుర్తుపెట్టుకోలేక పరీక్షల్లో పేలవమైన మార్కులు, ఫెయిల్ అవ్వడాలు ఇట్లాంటివి ఎదురవుతూనే ఉంటయి విద్యార్థుల జీవితంలో. ఇక విద్య ముగిశాక, ఉద్యోగం సంపాదించాక హమ్మయ్య అనుకోలేరు ఎవరూ. ఎందుకంటే ఉద్యోగం కూడా హాయిగా ఏమి సాగదు. టార్గెట్లు, ప్రాజెక్టులు, పై ఆఫీసర్లను మెప్పించడంలోనూ, వర్క్ పరంగా సాటిసిఫాక్షన్ అయ్యేలా చేయడంలో విఫలం అవుతూ ఆత్మన్యూనతకు గురయ్యే ఉద్యోగస్తులు కూడా ఎందరో.  అయితే ఓటమి నుండి పాఠం నేర్చుకుంటూ గెలుపు కోసం మరింత కష్టపడుతూ, తమని తాము మెరుగుపరుచుకునే వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు.

వాళ్ళందరిలో లోపించింది ఏమిటి అంటే .....

క్రీడాతత్వం. దాన్నే స్పోర్టివ్ నెస్ అని అచ్చంగా ఆంగ్లంలో అనేస్తున్నారు. క్రీడలనేవి చిన్నప్పటి నుండి మనకు తెలిసినవే. అయితే రాను రాను చదువుల పేరుతో వాటికి దూరం గా పిల్లలను కేవలం పుస్తకాలతోనే ఉంచడం వల్ల వాళ్లలో పెద్దయ్యే కొద్దీ గెలుపు ఓటమి అనేవాటిని ఎలా సమానంగా తీసుకోవాలి అనే విషయం అవగాహనలో లేక ఒత్తిడిలో పడిపోతున్నారు. అందుకనే మానసికంగా కూడా దృఢంగా లేక చిన్న విషయలకే ఎంతో డిస్టర్బ్ అయిపోతుంటారు ఇప్పటి తరం.  

క్రీడాతత్వం వల్ల ఏమి ప్రయోజనం?? 

ప్రతి పనిలో విఫలం, సఫలం సహజం. పోటీ ప్రపంచంలో గెలుపు, ఓటమి మరింత సహజం. వందమంది పోటీ పడే ఉద్యోగానికి ఒక్కరే ఎంపిక అవుతారు. అందులో మిగిలిన 99 మంది పనికిరాని వాళ్ళని కాదు లెక్క. వాళ్ళ ప్రయత్నంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందని, లేక అమలుపరిచే చోట ఏదో తప్పిదం చేసారని కూడా అనుకోవచ్చు. అదీ కాదు అంటే ఆ గెలిచిన వాళ్ళు, ఎంపికైన వాళ్ళు, ఇతరుల కంటే ఇంకా మంచి ప్రణాళికతో సన్నద్ధం అయ్యి ఉండవచ్చు. 

ఇట్లా విషయన్ని  అన్ని విధాలా విశ్లేషించుకుని, విమర్శించుకుని తమలో ఉన్న లోటుపాట్లను తెలుసుకునేల చేసేది క్రీడాతత్వమే.  అంతే కానీ ఒడిపోవడాన్ని సమర్థించుకోవడం కాదు. ఓటమికి గల  కారణాలను తెలుసుకోవడం. పరిశీలన, ఏకాగ్రత, విభిన్న ప్రణాళికలు, వవాటిని అమలుపరిచే విధానం, ప్రతి విషయాన్ని చూసే కోణం, స్పందించే తీరు వీటన్నిటి వల్ల మనుషులతో మెలిగే విధానం. వ్యక్తిత్వ పరంగా పరిపక్వత వంటివెన్నో ఈ క్రీడాతత్వం వల్లనే అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మీలో కూడా ఈ స్పోర్టివ్ నెస్ ఉందా?? లేదా లెస్ గా ఉందా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

                                                                                      ◆ వెంకటేష్ పువ్వాడ