50వేల కోట్లు దోచుకున్న కేసీఆర్‌.. ఆ డ‌బ్బుతోనే హుజురాబాద్‌లో పాలి..టిక్స్‌!

రాజ‌కీయ నాయ‌కులు ఎన్నైనా అంటారు. ఏవైనా ఆరోప‌ణ‌లు చేస్తారు. నోటికొచ్చింన విమ‌ర్శ చేస్తుంటారు. పాలిటిక్స్‌లో ఇవ‌న్నీ కామ‌న్ అనుకుంటారంతా. అదే, ఏ రాజ‌కీయ నాయ‌కుడో కాకుండా, మంచి ఇమేజ్ ఉన్న ఏ అధికారో ఇలాంటి కామెంట్లు చేస్తే తీవ్ర క‌ల‌క‌లం రేప‌డం ఖాయం. తెలంగాణ‌లో ఇప్పుడ‌దే జ‌రుగుతోంది. సీఎం కేసీఆర్ అవినీతి పాల‌న గురించి ఏడేళ్లుగా విప‌క్షాలు ఊద‌ర‌గొడుతూనే ఉన్నాయి. వాటిని వినీ వినీ జ‌నం సైతం అల‌వాటు ప‌డ్డారు. కేసీఆర్ క‌రెప్ష‌న్ అంటే కొత్త‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. కానీ....

ఇటీవ‌ల ఐపీఎస్‌కు రాజీనామా చేసి.. మ‌రో వారంలో రాజ‌కీయ అరంగేట్రం చేయ‌బోతున్న ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ సీఎం కేసీఆర్ అవినీతిని మామూలుగా టార్గెట్ చేయ‌డం లేదు. డే వ‌న్ నుంచి ఆయ‌న కేసీఆరే ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. మిగ‌తా ప్ర‌తిప‌క్షాల జోలికి వెళ్ల‌డం లేదు. కేసీఆర్‌నే మాట‌ల‌తో కుళ్ల‌బొడుస్తున్నారు. ఓవైపు ఆయ‌న గులాబీ బాస్ మ‌నిషంటూ, హుజురాబాద్‌లో పోటీ చేస్తారంటూ ఓ వ‌ర్గం ప్ర‌చారం చేస్తుండ‌గా.. ప్ర‌వీణ్‌కుమార్ మాత్రం రోజురోజుకూ కేసీఆర్‌పై విమ‌ర్శ‌ల డోసు పెంచుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. 

తెలంగాణ‌లో గులాబీ జెండా పోయి, నీలి జెండా రావాలంటూ పిలుపిచ్చారు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌. 'మన పిల్లల బతుకులు మారాలంటే బహుజన రాజ్య స్థాపనే అంతిమ లక్ష్యం కావాలి. బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే ఐక్యంగా పోరాడాలి. బహుజన వర్గాల అభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి లేదు. వారిని కావాలనే చదువుకు దూరం చేస్తున్నారు. అందుకోసమే విద్యా సంస్థల్లో నియామకాలు చేపట్టడం లేదు. ఏడేళ్లుగా దళితులపై లేని ప్రేమ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయంలోనే ఎందుకు వచ్చిందో చెప్పాలి' అంటూ సీఎం కేసీఆర్‌ను నిల‌దీశారు.

దళితులను పావులుగా వాడుకునేందుకే ‘దళిత బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకంపై ఖర్చుచేసే నిధులతో చదువులకు దూరమైన పేద విద్యార్థుల కోసం పెట్టవచ్చు. ఆ నిధులతో ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చు అన్నారు. 

మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలతో సీఎం కేసీఆర్‌ రూ.50 వేల కోట్లు దోచుకున్నారని, ఆ పథకాలలో కమీషన్లు తీసుకొని ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు ప్ర‌వీణ్‌కుమార్‌. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణను కేసీఆర్‌ అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. ఎవరెస్టును అధిరోహించిన మాలావత్‌ పూర్ణకు కామారెడ్డిలో 300 గజాల స్థలం ఇచ్చి, ష‌టిల్‌ క్రీడాకారిణి సింధూకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో స్థలం కేటాయించడం వివక్షకు నిదర్శనం కాదా? అని నిలదీశారు. 

ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ వేస్తున్న ప్ర‌శ్న‌లు సీఎం కేసీఆర్‌కు సూటిగా తాకుతున్నాయి. మిగ‌తా ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కుల ఆరోప‌ణ‌ల‌కంటే.. ఇంకా పూర్తి స్థాయిలో రాజ‌కీయ వాస‌న‌లు అంట‌ని ప్ర‌వీణ్‌కుమార్ లేవ‌నెత్తుతున్న అంశాలు ప్ర‌జ‌ల‌ను ఆలోచింప‌జేస్తున్నాయి. అయితే, కేవ‌లం బ‌హుజ‌న ఎజెండా మాత్ర‌మే ఎత్తుకుంటుండ‌టంతో మిగ‌తా వ‌ర్గాలు ఆయ‌న‌కు ద‌గ్గ‌ర కాలేక‌పోతున్నాయ‌ని అంటున్నారు. అన్నివర్గాల‌ను క‌లుపుకొని పోతూ.. కేసీఆర్‌పై దండెత్తితే మ‌రింత రాజ‌కీయ అడ్వాంటేజ్ ఉంటుంద‌నేది కొంద‌రి మాట‌.