ఏపీకి వరుస తుపాన్లు ముప్పు!

ఆంధ్రప్రదేశ్ కు ఈ నెలలో మరో మూడు తుపాన్ల ముప్పు ఉంది. భారత వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ఈ నెల 10 తరువాత ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా మూడు తుపాన్లు రాబోతున్నాయి. వీటిలో అరేబియా సముద్రంలో ఏర్పడే తుపాను, బంగాళాఖాతంలో ఏర్పడే రెండు తుపాన్ల కారణంగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో  పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ శాఖ పేర్కొంది.  దీనికి తోడు ఈ నెల 10 తరువాత రాష్ట్రంలో వరుస తుపాన్లతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా జిల్లాల యాంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసింది. 
Publish Date: Oct 7, 2024 10:11AM

ఏపీకి తరలనున్న సినీపరిశ్రమ?

సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరల నుందా? తెలంగాణను వీడి ఆంధ్రప్రదేశ్ లో స్టూడియోల నిర్మాణం, షూటింగులు జరుపుకోనుందా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఎవరైనా సరే ఔననే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఒక ప్రభుత్వ కార్యక్రమంలో నటి సమంత, నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల రచ్చ రేవంత్ సర్కార్ వర్సెస్ టాలీవుడ్ గా మారిపోయింది. దీంతో తెలుగుసినీ పరిశ్రమ హైదరాబాద్ లో కొనసాగుతుందా, ఆంధ్రాకు తరలిపోతుందా అన్న చర్చ మొదలైంది. నటుడు నాగార్జునకు మద్దతుగా తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఏకతాటిపై నిలబడటం, దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ముందు ముందు సినీపరిశ్రమ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సంబంధాలు మరింత చెడే అవకాశం ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం  టాలీవుడ్ పెద్దలు  హైదరాబాద్ ను వీడి ఏపీకి పరిశ్రమను తరలించాలని యోచిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలే అంటున్నాయి. పరిశ్రమను ఏపీకి తరలించే విషయంలో తీవ్ర స్థాయిలో ఆలోచనలు, చర్చలు జరుగుతున్నాయంటున్నారు.  ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని సాధించి పెడుతున్న తమ పరిశ్రమ పట్ల ప్రభుత్వానికి కనీస గౌరవం లేకపోవడం బాధ కలుగుతున్నదని సినీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటున్నారు. దీంతోనే  పరిశ్రమను ఏపీలోని విశాఖ తరలించాలనే ఆలోచన చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. దసరా తరువాత ఈ విషయంపై టాలీవుడ్ పెద్దలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశాలున్నాయంటేన్నారు.  ఇదే జరిగితే హైదరాబాద్ సినీ నిర్మాణ ప్రాభవం పై గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది.   అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఆ తరువాత వాటిని ఉపసంహరించుకుని సమంతకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  సినీ పరిశ్రమ మొత్తం నాగార్జున కు మద్దతుగా నిలిచింది.  ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం ముఖ్యంగా పరిశ్రమకు చెందిన పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గా ఉండడం వల్ల పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ కు తరలించాలని, అక్కడ తమకు సముచిత గౌరవం లభిస్తుందని పరిశ్రమ పెద్దలు అంటున్నారు. అంతే కాకుండా చంద్రబాబు గతంలోనే  పరిశ్రమను విశాఖకు ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. అక్కడకు తరలివేళ్లేందుకు యోచిస్తున్నారు.  తమకు విశాఖలో  స్థలాలు కేటాయిస్తే స్టూడియోలు నిర్మించుకుంటామని కొందరు పెద్దలు ఇప్పటికే ప్రకటించారు కూడా.  తమకు గౌరవం లేనిచోట  ఉండలేమని అంటున్నారు.  అన్నిటికీ మించి తెలుగుసినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ తరలిరావడానికి ముఖ్య కారకుడు నాగార్జున తండ్రి, నటసామ్రాట్ అక్కినేనే అన్న సంగతి తెలిసిందే. ముందుగా ఆయనే అప్పటిలో మద్రాసును వదిలి హైదరాబాద్ కు వచ్చి అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి పూనుకున్నారు. అంతే కాకుండా తనతో సినిమాలు చేయాలననుకునే వారెవరైనా సరే హైదరాబాద్ కు రావలసిందేనని కచ్చితంగా చెప్పారు.  అంటే నాడు టాలీవుడ్ హైదరాబాద్ తరలిరావడానికి తొలి అడుగు వేసింది అక్కినేని కుటుంబమే. అటువంటి అక్కినేని కుటుంబాన్నే అవమానిస్తే ఎలా సహించేది అంటూ టాలీవుడ్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మొత్తం మీద సినీ పరిశ్రమ రేవంత్ సర్కార్ పై విశ్వాసాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో టాలీవుడ్ కు స్పష్టమైన హామీ ఇచ్చి సమస్య పరిష్కారానికి ముందుకు రాకపోతే పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలిపోవడం ఖాయమని అంటున్నారు.  అదే సమయంలో టాలీవుడ్ కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన హెచ్చరికలను బట్టి అటువంటి యోచన ఏదీ రేవంత్ సర్కార్ కు లేదని భావించాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు.  ‘కొండా సురేఖపై టాలీవుడ్ నుంచి ఇంకొక్క మాట వచ్చినా సహించేది లేదు. ఆమె ఒంటరి కాదు.ఇప్పటికే కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఇక మాట్లాడొద్దు’ అని మంత్రి పొన్న ప్రభాకర్ మీడియా సమావేశం పెట్టి మరీ టాలీవుడ్ ను హెచ్చరించారు.  దీంతో టాలీవుడ్ పట్ల ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోయే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Oct 7, 2024 9:49AM

నిన్ను నువ్వే రక్షించుకోవాలంటాడు చాణక్యుడు..!!

ఆచార్య చాణక్యుడు గొప్ప వ్యక్తి, సలహాదారు, వ్యూహకర్త, ఉపాధ్యాయుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త. అతని జ్ఞానం, సామర్థ్యాలు భారతదేశ చరిత్రను మార్చాయి. మానవుల సంక్షేమం కోసం తన విధానంలో ఎన్నో ఆలోచనలను ఇచ్చారు చాణక్యుడు.  అవి నేటికీ ప్రసిద్ధి చెందాయి. మీరు ఈ సూత్రాలను పాటించినట్లయితే మిమ్మల్ని విజయాల మెట్లు ఎక్కకుండా ఎవరూ ఆపలేరు. అంతే కాదు, వారి సూత్రాలను అవలంబించడం ద్వారా మనం రోజువారీ జీవితంలో జరుగుతున్న అన్ని కష్టాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. మనల్ని మనం రక్షించుకోవడానికి చాణక్యుడి ఎలాంటి సూత్రాలు పాటించాలి..? మీ ప్రసంగం మధురంగా ఉండాలి: చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం, ప్రసంగం మధురంగా ఉండే వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలడు. కఠినమైన మాటలు మాట్లాడే వ్యక్తి జీవితంలో విజయం సాధించడం కష్టమే అంటాడు చాణక్యుడు. డబ్బును ఎప్పుడూ విస్మరించవద్దు: చాణక్యుడి విధానం ప్రకారం, ఏ వ్యక్తి తన ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులకు చెప్పకూడదు. మీరు చాలా డబ్బు సంపాదించి ఉంటే లేదా ఆర్థిక సంక్షోభంలో ఉంటే, అలాంటి ఆలోచనలను మీలో ఉంచుకోండి. పొరపాటున కూడా ఇతరులతో పంచుకోవద్దు. ఇది మీకు మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. ఈ తప్పు చేయవద్దు: మీరనుకున్న విజయాలను సాధించాలంటే...మీ ప్రణాళికల గురించి ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచాలని చెబుతాడు చాణక్యుడు.  ఎందుకంటే మీరు మీ ప్లాన్ గురించి ఎవరికైనా చెబితే, వారు మీ నుండి ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల మీరు విజయవంతం కాకపోవచ్చు. ఎల్లప్పుడూ ఓపికతో పని చేయండి: ఏది జరిగినా సహనం కోల్పోకూడదని చాణక్యుడు చెప్పాడు. అలాగే, వారు ఎల్లప్పుడూ తమ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవాలి. మనం ఏమీ చేయలేము అని అనుకుంటే అది మన వల్ల జరగదు. ఈ పనిని మనం చేయగలమనే పాజిటివ్ ఆలోచనతో మొదలు పెడితే...ఈ పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఎక్కువ ఖర్చు పెట్టకండి: చాణక్య విధానం ప్రకారం, ప్రతి వ్యక్తి డబ్బును పొదుపు చేయాలి. ఎందుకంటే సంక్షోభ సమయాల్లో, డబ్బు మీ గొప్ప మిత్రుడిగా పనిచేస్తుంది. చేతిలో డబ్బు ఉందని ఫిర్యాదు చేసే బదులు వీలైనంత ఎక్కువ పొదుపు చేసేందుకు ప్రయత్నించండి.
Publish Date: Oct 7, 2024 9:30AM

శరీరానికి కొవ్వు కూడా అవసరమే.. ఎందుకంటే..

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు,  తదితరాలు పోషకాహారంలోనే  సమృద్ధిగా ఉంటాయి. శరీరం సరిగ్గా పని చేయడానికి అన్ని రకాల పోషకాలు అవసరం అవుతాయి. కొవ్వు కూడా వాటిలో ఒకటి. అయితే, కొవ్వును తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పరిమాణం పెరుగుతుందని అనుకుంటారు. కానీ మన శరీరానికి కొవ్వు చాలా అవసరం. ఈ కొవ్వు రెండు రకాలుగా ఉంటుంది.   ఆరోగ్యకరమైన కొవ్వు ,  అనారోగ్యకరమైన కొవ్వు. మనకు ఆరోగ్యకరమైన కొవ్వు అవసరం.   చాలా మందికి ఆరోగ్యకరమైన కొవ్వులు ఏవో, అవి ఎందులో లభిస్తాయో వాటి ఉపయోగాలు ఏంటో సరిగ్గా తెలియదు.  దీని గురించి తెలుసుకుంటే.. ఆరోగ్యకరమైన కొవ్వు అంటే.. కొవ్వులు కూడా ఒక రకమైన పోషకాలు. ప్రొటీన్-ఐరన్ లాగా మన శరీరం శక్తిని పొందడానికి, విటమిన్‌లను శోషించడానికి,మెరుగైన గుండె,మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరం. మోనోఅన్‌శాచురేటెడ్ , పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులను  ఆరోగ్యకరమైన కొవ్వులుగా పరిగణిస్తారు. ఇవి  అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే ఆరోగ్యకరమైన కొవ్వులు తప్పనిసరిగా తీసుకోవాలి.  ఆరోగ్యకరమైన కొవ్వులు ఎందుకు ముఖ్యమైనవంటే.. కండరాలను నిర్మించడానికి ప్రోటీన్, రక్త పరిమాణాన్ని నిర్వహించడానికి శరీరానికి ఐరన్ ఎలా  అవసరమో, అదే విధంగా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా  చాలా ముఖ్యమైనవి. ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలపై చేసిన అధ్యయనాలు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలవని, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయని, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుందని , శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుందని స్పష్టం చేశాయి. ఆరోగ్యకరమైన కొవ్వును డైటరీ ఫ్యాట్ అని కూడా అంటారు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.కానీ  దానిని అధికంగా తీసుకుంటే, అది  ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తుంది. కాబట్టి మీ ఆహారంలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వును ఆహారంలో అనేక రకాలుగా పొందవచ్చు.   సాల్మన్, మాకేరెల్ మొదలైన వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి  ఆరోగ్యకరమైన కొవ్వులు.  అలాగే ఆలివ్ నూనె, బీన్స్, అవకాడో, బాదం, నెయ్యి వంటి వాటిలో ఆగోర్యకరమైన కొవ్వులు ఉంటాయి.    ◆నిశ్శబ్ద.
Publish Date: Oct 7, 2024 9:30AM

తమిళనాట ఏపీ ఫార్మ్యులా.. పవన్ పొలిటికల్ స్కెచ్!?

ప‌వ‌న్ క‌ల్యాణ్.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఈ పేరు మారుమోగుతోంది. తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వివాదం విష‌యంలో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీశాయి. ఏపీలో సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కొన‌సాగుతున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఆయ‌న ఉన్న‌ట్లుండి త‌మిళనాడు రాజ‌కీయాల‌పై దృష్టిసారించిన‌ట్లు క‌నిపిస్తోంది. పవ‌న్ వ్యూహం వెనుక బిగ్ స్కెచ్ ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. వ‌చ్చే ఏడాది చివ‌రిలో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఆ ఎన్నిక‌ల నాటికి తాను అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకునేలా ప‌వ‌న్ ఇప్ప‌టి నుంచి క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇంత‌కీ.. ప‌వ‌న్ త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఎలాంటి పాత్ర పోషించ‌బోతున్నారు.. ఏపీలో ఫార్ములాను త‌మిళ‌నాట ప్ర‌యోగించ‌బోతున్నారా.. ప‌వ‌న్ త‌మిళ రాజ‌కీయం అక్క‌డి సినీ ఇండ‌స్ట్రీపై ఎలాంటి ప్ర‌భావం చూప‌బోతుందో  అన్నన చర్చ మొదలైంది. ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ క‌లిసి పోటీచేశాయి. ఈ క్ర‌మంలో అసెంబ్లీ, పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సార‌ధ్యంలోని జ‌న‌సేన పార్టీ వంద‌శాతం స్టైక్ రేట్ తో విజ‌యం సాధించింది. ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప‌వ‌న్ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  ఏపీలో వైసీపీ దారుణ ఓట‌మికి చంద్ర‌బాబుతోపాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ దికూడా కీల‌క భూమిక‌. చంద్ర‌బాబు వ్యూహం, ప‌వ‌న్ దూకుడుతో వైసీపీ కేవ‌లం ప‌ద‌కొండు స్థానాల‌కే ప‌రిమితం అయింది. ఏపీలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో అవినీతి అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ హ‌యాంలో తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యిని వినియోగించిన‌ట్లు లాబ్ రిపోర్టులు వ‌చ్చాయి. తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర స్వామి అంటే దేశ‌వ్యాప్తంగానే కాక‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువులు భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో కొలుస్తారు. అలాంటి తిరుమ‌ల‌లో జ‌గ‌న్ హ‌యాంలో క‌ల్తీ నెయ్యి వాడార‌నే విష‌యం పెద్ద దుమారాన్నే రేపింది. అప‌చారం జ‌రిగినందుకు క్ష‌మించ‌మ‌ని కోరుతూ ప‌వ‌న్  ప‌ద‌కొండు రోజుల‌ పాటు ప్రాయ‌శ్చిత్త దీక్ష‌  చేప‌ట్టారు. తిరుమ‌ల కొండ‌పై దీక్ష‌ను విర‌మించి  తిరుప‌తిలో వారాహి సభ  నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో వారాహి డిక్లరేషన్ చేస్తూ సనాతన ధర్మం గురించి ప‌వ‌న్ మాట్లాడారు. ఇదే క్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేద‌ని సీరియస్‌గానే ప‌వ‌న్‌ వార్నింగ్ ఇచ్చారు.  వారాహి స‌భ‌లో ప‌వ‌న్ వ్యాఖ్య‌లపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌ జ‌రిగింది.. త‌మిళ‌నాడులో అయితే పవన్ వ్యాఖ్యలు రాజ‌కీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై  ఉదయనిధి స్టాలిన్ స్పందించకపోయినా.. డీఎంకే పార్టీ, ఆ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా రియాక్టయ్యారు. పవన్ కళ్యాణ్‌కు కౌంటర్లు ఇస్తున్నారు. దీనికి తోడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై త‌మిళ‌నాడులో కేసు కూడా న‌మోదైంది. ఇదంతా ఒకెత్తయితే.. త‌మిళ‌నాడు గురించి ప‌వ‌న్ మాట్లాడిన ప్ర‌తి మాట వెనుక వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతున్నది. త‌మిళ‌నాట మ‌రో ఏడాదిన్న‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను టార్గెట్ గా చేసుకొని ప‌వ‌న్ ఇప్ప‌టి నుంచే త‌న వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నార‌ని,  ఆయ‌న వెనుక బీజేపీ పెద్ద‌లు ఉన్నార‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్త‌వానికి. త‌మిళ‌నాడులో ప‌ట్టు సాధించాల‌ని బీజేపీ ఎప్ప‌టినుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నది.  కానీ, సాధ్యం కావటం లేదు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకేతో పొత్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్లినా పెద్ద‌గా ఫ‌లితం ద‌క్క‌లేదు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ విడిగా పోటీ చేసింది. క‌నీసం ఒక్క‌సీటును కూడా ద‌క్కించుకోలేక పోయింది. దీనికితోడు కాంగ్రెస్‌, డీకేఎం కూట‌మి 39 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించి క్లీన్ స్వీప్ చేశారు. గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో తమిళనాడులో బీజేపీ అన్నామలైను హైలెట్ చేసింది. అన్నామ‌లైకు రాష్ట్ర వ్యాప్తంగా విప‌రీతమైన క్రేజ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ అది ఓటుగా మారలేదు. దీంతో   బీజేపీ ఈసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ ను త‌మిళ‌నాడులో ప్ర‌యోగించాల‌ని భావిస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.  ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో హిందుత్వం పేరుతో ఎంట్రీ ఇస్తే.. అక్క‌డి సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు కూడా ల‌భిస్తుంద‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో ప‌వ‌న్ సైతం త‌మిళ రాజ‌కీయాల‌పై దృష్టి కేంద్రీక‌రించారు. హిందుత్వం పేరుతో త‌మిళ‌నాడులోని హిందువుల‌ను ఏక‌తాటిపైకి తీసుకురావ‌డంతో పాటు.. ఏపీలో ప్ర‌యోగించిన ఫార్ములాను త‌మిళ‌నాడులో ప్ర‌యోగించాల‌ని ప‌వ‌న్, బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌. ఏపీలో ఎన్నిక‌ల ముందు బీజేపీ, టీడీపీని ఒకేతాటిపైకి తీసుకురావ‌డంలో ప‌వ‌న్ పాత్ర కీల‌మైంది. అదే స‌మ‌యంలో త‌మిళ‌నాడులో డీఎంకేకు గ‌ట్టి పోటీదారుగా ఉన్న అన్నాడీఎంకే, ఇత‌ర పార్టీల‌ను బీజేపీ ప‌క్క‌కు తీసుకొచ్చేలా ప‌వ‌న్ పావులు క‌దుపుతున్నారు. సినీ హీరో విజ‌య్ కొత్త పార్టీని స్థాపించిన విష‌యం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తామ‌ని ఇప్ప‌టికే విజ‌య్ చెప్పారు. విజ‌య్ కు త‌మిళ‌నాట మంచి క్రేజ్ ఉంది. డీఎంకే పార్టీ, విజ‌య్ పార్టీ మిన‌హా మిగిలిన అన్ని పార్టీల‌ను ఎన్డీయే కూట‌మిలోకి తీసుకొచ్చేలా ప‌వ‌న్ ప్ర‌య‌త్నాలు మొదలు పెట్టినట్లు క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో డీఎంకే పార్టీకి బద్ధశత్రువైన.. అన్నాడీఎంకే పార్టీ గురించి ప‌వ‌న్ వ‌రుస‌ ట్వీట్లు చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.  అన్నాడీఎంకే పార్టీ ఏర్పాటై 53 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎంజీఆర్ గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అలాగే అన్నాడీఎంకే పార్టీ శ్రేణులకు, మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంజీఆర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మ‌రోవైపు డీఎంకే, విజ‌య్ పార్టీలు ఎక్కువ‌గా క్రిస్టియ‌న్, ముస్లీం ఓట్ల‌పై దృష్టిసారించాయి. దీంతో ఎన్డీయే కూట‌మి ఆధ్వ‌ర్యంలో హిందుత్వ ఓట్ల‌ను టార్గెట్ చేయడమే బీజేపీ  లక్ష్యంగా చెబుతున్నారు‌. ఈ క్ర‌మంలో అన్నామ‌లైతో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్   సేవ‌ల‌ను కూడా బీజేపీ వినియోగించుకోబోతుంది. ప‌వ‌న్ ఇప్ప‌టికే రంగంలోకి దిగ‌డంతో త‌మిళ‌నాట రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. మ‌రి ప‌వ‌న్ టార్గెట్ రీచ్ అవుతారా.. ప‌వ‌న్ ద్వారా బీజేపీ అనుకున్న ల‌క్ష్యానికి చేరుకుంటుందా  అనేది వేచి చూడాల్సిందే.
Publish Date: Oct 7, 2024 9:12AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులు కలిసి రావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం(అక్టోబర్ 6)  తిరుమల శ్రీవారిని మొత్తం 86వేల 859 మంది దర్శించుకున్నారు. వారిలో 37వేల 173 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 63లక్షల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం(అక్టోబర్ 7) అయితే భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. 
Publish Date: Oct 7, 2024 9:01AM