బీఆర్ఎస్ నేత‌ల్లో అరెస్టుల భ‌యం.. ముందు జైలుకెళ్లేదెవ‌రో?

కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌ళ్లీ దూకుడు పెంచిందా? అధికారంలోకి వ‌చ్చిన తొలి రోజుల్లో గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై విచార‌ణ‌ల‌తో హ‌డావుడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి,  ఆ త‌రువాత కాస్త నెమ్మ‌దించారు. అయితే, మ‌రోసారి బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీపావ‌ళి పండుగ నాటికి బీఆర్ఎస్ కీల‌క నేత‌ల్లో ఒక‌రిద్ద‌రు అరెస్టు కాబోతున్నార‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఇందుకు కార‌ణం మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు.  బీఆర్ఎస్ సర్కార్‌ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకలపై జరుగుతున్న విచారణ తుది దశకు వచ్చిందని, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అనేక కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుంద‌ని పొంగులేటి వ్యాఖ్యానించారు. పొంగులేటి వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టి పారేశారు. ఏం చే్స్తారో చేసుకోండి.. భ‌య‌ప‌డేది లేద‌న్నారు. అయితే, బీఆర్ఎస్ నేత‌ల్లో మాత్రం ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతిపై విచార‌ణ చివ‌రి ద‌శ‌కు చేరింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణతో పాటు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌, విద్యుత్ కొనుగోలులో గోల్ మాల్ వ్య‌వ‌హారాల‌పై విచార‌ణసైతం తుది ద‌శ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసుల్లో కేసీఆర్‌, కేటీఆర్ ల‌లో ఎవ‌రో ఒక‌రు అరెస్టు అయ్యే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.  బీఆర్ఎస్ హ‌యాంలో కేసీఆర్ కాళేశ్వ‌రం ప్రాజెక్టును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని నిర్మించారు. ఇందుకోసం ల‌క్ష‌ల కోట్ల‌ను వెచ్చించారు. అయితే, ఈ ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత‌లు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజయం సాధించి కాంగ్రెస్  అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వ‌రం ప్రాజెక్టులో జ‌రిగిన అవినీతిని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయ‌మూర్తితో విచార‌ణ‌కు ఆదేశించారు. విచార‌ణ జ‌రిపిన జ‌స్టిస్ పీసీ ఘోష్ తుది నివేదికను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుందని సమాచారం. దాని ఆధారంగా కేసులు, అరెస్టులు జరిగే అవ‌కాశం ఉంది. విచారణలో మాజీ ఈఎన్‌సీలు, ఇంజినీర్లు చెబుతున్న దాన్నిబట్టి చూస్తే ప్రాజెక్టులో నిర్మాణంలో అవినీతి, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.   దీంతో క్రిమినల్ కేసులు పక్కాగా నమోదయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, గత ప్రభుత్వ పెద్దల అరెస్టులు, కాంట్రాక్టు సంస్థలకు చిక్కులు తప్పేలా లేవు. 2014లో మొదటి దఫా బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో హరీశ్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. రెండో దఫా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ స్వయంగా ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల‌ను పర్యవేక్షించారు. స్పష్టంగా చెప్పాలంటే కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణాల్లో ప్ర‌తిదీ కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింది. కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు ఇంజ‌నీరింగ్ అధికారులు, ప్ర‌భుత్వ అధికారులు న‌డుచుకున్నారు. ఇది బ‌హిరంగ విష‌య‌మే. ప్ర‌స్తుతం క‌ళేశ్వ‌రం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి బ‌య‌ట‌ప‌డినా అది కేసీఆర్ మెడ‌కు చుట్టుకునే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.  ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపైనా విచార‌ణ ఫైన‌ల్ స్టేజికి వ‌చ్చింది.  బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు, సినీ, వ్యాపార‌, రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌ముఖుల ఫోన్ల‌ను ట్యాపింగ్ చేశార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ‌కు ఆదేశించింది. విచార‌ణ క్ర‌మంలో ప‌లువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఈ విచార‌ణ ప్ర‌క్రియ తుదిద‌శ‌కు చేరిన‌ట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌, కేటీఆర్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. మ‌రోవైపు హైద‌రాబాద్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన ఫార్ములా కారు రేసులోనూ భారీ ఎత్తున అక్ర‌మాలు జ‌రిగాయ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రిపింది. ఈ అవినీతిలో మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌మేయం ఉంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అవ‌స‌ర‌మైతే ఈడీ విచార‌ణ‌కు కూడా ఆదేశించే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ధ‌ర‌ణి పోర్ట‌ల్ విష‌యంలోనూ విచార‌ణ జ‌రుగుతుంది. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ను తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం పెద్దెత్తున రాష్ట్రంలోని భూముల‌ను అన్యాక్రాంతం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీటిపైనా విచార‌ణ కొన‌సాగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ హ‌యాంలో ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రం నుంచి జ‌రిపిన విద్యుత్ కొనుగోళ్ల‌లోనూ భారీగా అవినీతి జ‌రిగింద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం భావిస్తుంది. ఈ అంశంపైనా విచార‌ణ కొన‌సాగుతున్నది.  వీట‌న్నింటిలో చాలా వ‌ర‌కు కేసీఆర్‌, కేటీఆర్ ప్ర‌మేయం ఉంద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం భావిస్తోంది. విచార‌ణ నివేదిక‌లు పూర్తి స్థాయిలో వ‌చ్చిన త‌రువాత.. నివేదిక వివ‌రాల‌ను బ‌ట్టి త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను తీసుకొనేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది.  దీపావ‌ళి పండుగ నాటికి రాష్ట్రంలో పొలిటిక‌ల్ బాంబు పేలుతుంద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు బీఆర్ఎస్ నేత‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై, ఫోన్ ట్యాపింగ్ పై విచార‌ణ నివేదిక‌లు రెండుమూడు రోజుల్లో ప్ర‌భుత్వానికి అంద‌బోతున్నాయ‌ని.. దీపావ‌ళి నాటికి అందుకు బాధ్యులైన బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి.. వరుసగా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అరెస్టుల పర్వం మొదలైతే.. ముందుగా జైలుకు వెళ్లేది ఎవరు? ఏ  కుంభకోణంలో ఎవరెవరు ఇరుక్కుంటారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు.. సామాన్య ప్ర‌జ‌ల్లోనూ ఆసక్తి రేపుతోంది. అయితే  ఈ అంశంపై తాజాగా టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి పేల్చ‌బోయే బాంబుల‌ కోసం తాను ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాన‌ని అన్నారు. ఇదే స‌మ‌యంలో త్వ‌ర‌లోనే మ‌రికొంత మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌న్న కొత్త అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. దీంతో కాంగ్రెస్ గూటికి చేర‌బోయే బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు ఎవ‌ర‌నే అంశంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.
Publish Date: Oct 27, 2024 10:23AM

కేటీఆర్ సారూ.. మాట దాటేశారేంటి?

గత ఏడాది జనవరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. అంతే అప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాలలో తిరుగులేని నేతగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాక్టివ్ రాజకీయాల నుంచి  నిష్క్రమించేశారు. అధికారంలో ఉన్నంత కాలం, అంతకు ముందు తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో కూడా  మాటల మాంత్రికుడు, రాజకీయ చాక్యుడు.. ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందే  ఉంటారు. వారు వ్యూహ రచన చేయడానికి ముందే వాటికి విరుగుడు వ్యూహాలను అమలు చేసి వారిని నిరుత్తరులను చేస్తారు. కేసీఆర్ రాజకీయాలను తట్టుకోవడం కష్టం అంటూ అంతా వ్యాఖ్యానించిన కేసీఆర్ ఇప్పుడు మాటలే మరిచిపోయి మౌనిలా మారిపోయిన పరిస్థితి.  అయితే కేసీఆర్ మౌనం, ఆయన రాజకీయ ఇన్ యాక్టివ్ నెస్ బీఆర్ఎస్ కు శాపంగా పరిణమించింది.  కేసీఆర్ మౌనం నేపథ్యంలో పార్టీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావులు నడిపిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలకు పిలుపునిస్తూ, రేవంత్ సర్కార్ విధానాలపై ఘాటు విమర్శలు గుప్పిస్తూ, మరీ ముఖ్యంగా హైడ్రా, మూసీ బాధితులకు అండగా ఉంటామన్న భరోసా ఇస్తూ ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు. అయితే అది సరిపోవడం లేదు. వారు ఎంత దూకుడుగా ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నా కేసీఆర్ మౌనం పెద్ద లోటుగా కనిపిస్తోంది. ఎక్కడకు వెళ్లినా, ఏ వేదికపై ప్రసంగిస్తున్నా వారికి ఎదురౌతున్న ప్రశ్న కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారా? రాజకీయాల నుంచి నిష్క్రమించేశారా అన్న ప్రశ్నలే ఎదురౌతున్నాయి. ఆ ప్రశ్నలకు వారి సరిగా బదులు ఇవ్వలేకపోతున్నారని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.   తాజాగా ఉబీపీ కాంక్లేవ్ లో పాల్గొన్న కేటీఆర్ కు కేసీఆర్ మౌనం, యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉండటంపై ప్రశ్న ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం షాక్ నుంచి కేసీఆర్ ఇంకా తేరుకోలేదా?  ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఎందుకు ఉంటున్నారు? అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి కేటీఆర్ చెప్పిన సమాధానం ఎవరినీ సంతృప్తి పరచలేకపోయింది. అంతే కాకుండా కేటీఆర్ మాట దాటేశారంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకీ కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఎందుకు ఉంటున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఏమిటంటే.. కేసీఆర్ ఓ అద్భుతమైన వ్యక్తి, ఆయన జీవితంలో చాలా చూశారు. ఆయనో ఉక్కు మనిషి.  ఏం జరిగినా ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమి ఆయపై ఎలాంటి ప్రభావం చూపదు. చూపలేదు. అయినా.. మీరు అడగాల్సిన ప్రశ్న ఇది కాదు.. అంటూ తనకు అలవాటైన రాజకీయ ప్రసంగాన్ని ధారాళంగా చేసేశారు. అయన ఇంకా ఏమన్నారంటే..  మీరు కేసీఆర్ మౌనం గురించి కాదుకాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల వాగ్దానం ఏమైంది?  వంద రోజుల్లో నెరవేరుస్తామన్న వాగ్దానాల సంగతేంటి?  అని అడగాలి అని బదులిచ్చారు.  కేసీఆర్ ఏబీపీ కాంక్లేవ్ వేదికగా ఇచ్చిన ఈ సమాధనం పట్ల పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. ఆయన మాటదాటేశారని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ మౌనం గురించి అడిగితే కేసీఆర్ రేవంత్ సర్కార్ పై విమర్శలు చేసి టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారంటున్నారు.  
Publish Date: Oct 26, 2024 5:23PM

బెటాలియన్ కానిస్టేబుళ్ళు ఆందోళన చేస్తే చర్య తప్పదు: డిజిపి  జితేందర్ 

రాష్ట్రంలో బెటాలియన్‌ కానిస్టేబుళ్ల ఆందోళన చర్చనీయాంమైంది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మాదిరిగా  ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని బెటాలియన్ కానిస్టేబుల్స్ డిమాండ్ చేస్తున్నారు. పోలీసు అధికారుల ఇళ్లల్లో వెట్టి చాకిరి  కోపం బెటాలియన్ కానిస్టేబుల్స్ ఉపయోగపడుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ  ఆందోళనపై డీజీపీ జితేందర్‌ తీవ్రంగా స్పందించారు. ఆందోళనల వెనుక కాంగ్రెస్  ప్రభుత్వ వ్యతిరేక శక్తులున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్ల సెలవులపై పాత పద్ధతినే అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఆందోళన చేయడం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ రిక్రూట్‌మెంట్‌ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని డీజీపీ ఘాటుగా హెచ్చరించారు. బెటాలియన్  కానిస్టేబుళ్ళ కుటుంబాల ఆందోళన వెనక రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక శక్తులున్నాని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Publish Date: Oct 26, 2024 4:06PM

లోకేష్ ప్రస్తావన.. బాబు కళ్లల్లో మెరుపు చూసి తీరాల్సిందే!

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!  సరిగ్గా సుమతీశతక కారుడు చెప్పినట్లుగా చంద్రబాబులో ఇప్పుడు పుత్రోత్సాహం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. నందమూరి బాలకృష్ణ టాక్ షో  అన్ స్టాపబుల్ సీజన్ 4 శుక్రవారం (అక్టోబర్ 25)న ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. తన అరెస్టు, జగన్ అరాచకపాలన, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో తన విజన్..  ఇలా అనేక అంశాలపై చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు నాటి సంఘటనలను వివరిస్తున్నప్పుడు ఒకింత ఎమోషనల్ అయ్యారు. తప్పు చేయని తనను అరెస్టు చేయడమే కాకుండా ఆ సమయంలో తనను ట్రీట్ చేసిన విధానం కడుపు తరుక్కుపోయేలా చేసిందని చంద్రబాబు చెప్పారు. ఇవన్నీ ఒకెత్తైతే.. తన కుమారుడు నారా లోకేష్ పాదయాత్ర గురించి బాలయ్య అడిగిన ప్రశ్నకు చంద్ర బాబు  సమాధానం ఇచ్చారు. ఆ సందర్భంలో ఆయన కళ్లలో ఆనందం, గర్వం ప్రస్ఫుటంగా కనిపించాయి. తన కుమారుడిగానో, ఎన్టీఆర్ మనవడిగానో, బాలయ్య మేనల్లుడిగానో కాకుండా తన కంటూ ఒక గుర్తింపు, ప్రత్యేకత చాటుకోవాలని లోకేష్ భావించారనీ, అందుకే తాను వారించినా వినకుండా పాదయాత్ర చేశారని చంద్రబాబు చెప్పారు. తండ్రిగా తాను పాదయాత్ర వద్దనే చెప్పానన్నారు. ఒక విద్వేష పూరిత ప్రభుత్వం అధికారంలో ఉంది. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడమే కాదు అంతకు మించి ఏదైనా చేస్తారేమోనన్న భయం ఉంది. నేరుగా చెప్ప కున్నా పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ పై వైసీపీ మూకలు భౌతిక దాడులకు పాల్పడతాయన్న భయం ఉందని చంద్రబాబు పరోక్షంగా చెప్పారు. అయితే లోకేష్ సాహసోపేతంగా నిర్ణయం తీసుకున్నారనీ, విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేశారని చంద్రబాబు చెప్పారు.  ఆయన చెప్పడమే కాదు.. రాష్ట్ర ప్రజానీకం నారా లోకేష్ లోని పరివర్తనలు చూశారు. ఆయన తనను తాను మేకోవర్ చేసుకున్న తీరును చూశారు.  పరిపూర్ణమైన రాజకీయనాయకుడిగా, ప్రజా నేతగా లోకేష్ సర్వామోదం పొందారు.  అయితే లోకేష్ కు ఈ సర్వామోదం అంత తేలిగ్గా రాలేదు.   నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే  ఆయనను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి. పప్పు అన్నారు. బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు చేశారు?  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడు పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదును పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు జీవితబీమా, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు.. ఆయనపై సైకలాజికల్ ఎటాక్ ప్రారంభించారు. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని చూశారు. ఒక ప్రణాళిక ప్రకారం ఆయన వ్యక్తిత్వంపై దాడి చేయా లన్న కుట్రతో వ్యవహరించారు.  ఆయన చదువు, భాష, ఆహారం, ఆహార్యం ఇలా వేటినీ వదలకుండా ఆయనను మానసికంగా కుంగదీయాలని చూశారు.  అయితే లోకేష్ కుంగిపోలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. మంత్రిగా అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చేశారు. ప్రత్యక్ష ఎన్నికలలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా కృంగిపోలేదు. పడిలేచిన కెరటంలా ఎగిశారు. ఎదిగారు. ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి మాటల స్ఫూర్తి తో  ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు. యువగళంతో తానేమిటో నిరూపించుకున్నారు.పార్టీకి భవిష్యత్ నాయకుడన్న నమ్మకాన్ని పార్టీలోనే కాదు ప్రజలలోనూ కలిగిం చారు. తండ్రికి తగ్గ తనయుడిగా కాదు..తండ్రిని మించిన తనయుడిగా జేజేలు అందుకుంటున్నారు.  అందుకే బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోలో చంద్రబాబు తన తనయుడు లోకేష్ గురించి మాట్లాడుతూ గర్వంగా ఫీలయ్యారు. పుత్రోత్సాహం ఆయన కళ్లల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.  
Publish Date: Oct 26, 2024 3:35PM

నియోజకవర్గాల పునర్విభజన 2026లోనే.. జమిలి దిశగా తొలి అడుగు!?

దేశంలో జమిలి ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలన్నీ ఇప్పటి నుంచే జమిలికి రెడీ అయిపోయాయి. ఆ దిశగా తమతమ పార్టీల క్యాడర్ ను ప్రిపేర్ చేస్తున్నాయి.  సార్వత్రిక ఎన్నికలను ముందుకు జరిపి మరీ జమిలి నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి ఇటీవల విస్పష్టంగా చెప్పేశారు. ఆ విషయంలో శషబిషలకు తావులేదని తేల్చేశారు.  షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు 2029లో జరగాలి. అయితే అంత కంటే రెండేళ్లు ముందుగానే అంటే 2027 జమిలికి కేంద్రం ముహూర్తం పెట్టేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జమిలికి ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న కృత నిశ్చయంతో కేంద్రం ఉండటంతో 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృ త్వంలో ఏర్పాటైన కమిటీ ఇప్పటికే తేన నివేదికను సమర్పించింది. దీంతో జమిలి దిశగా కేంద్రం వేగం పెంచింది. వచ్చే శీతాకాల సమావేశాలలోనే జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. ఆ బిల్లుల ఆమోదంతో పాటే జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన రాజ్యాంగ సవరణలు కూడా చేసేయాలని భావిస్తోంది.  కమిటీ ఓ నివేదికను సమర్పించింది. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశా ల్లో జమిలికి సంబంధించిన బిల్లులను ఆమోదించేలా కేంద్రం కార్యారణ రెడీ చేస్తోంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ సహా మరికొన్ని విపక్ష పార్టీలు జమిలిని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజస్వామ్యానికి జమిలి గొడ్డలిపెట్టు అని వాదిస్తున్నాయి. జమిలిని గట్టిగా వ్యతిరేకిస్తామని కుండబద్దలు కొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జమిలితో మోడీ సర్కార్ ఎలా ముందుకు సాగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 
Publish Date: Oct 26, 2024 2:23PM

వెనక నుంచి ఢీ కొన్న లారీ... ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తృటిలో ప్రమాదం తప్పింది.   హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ కు వెళ్తున్న పాయల్ శంకర్ కారును, వెనుక నుండి వచ్చిన ఓ లారీ వేగంగా ఢీకొట్టింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడ వద్ద శుక్రవారం (అక్టోబర్ 25) ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ధ్వంసం కాగా.. పాయల్ శంకర్ స్వల్పంగా గాయపడ్డారు.   అనంతరం ఎమ్మెల్యే వేరే కారులో ఆదిలాబాద్ కు పయనమయ్యారు.   ఎమ్మెల్యే ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన తీరు అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరిగిందా అన్న సందేహాలు పాయల్ శంకర్ అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.  
Publish Date: Oct 26, 2024 1:06PM