గాంధీతో గొడ‌వ‌.. హిట్ల‌ర్‌తో షేక్‌హ్యాండ్‌.. నేతాజీ 125వ జ‌యంతి..

ఫ్రీడ‌మ్ ఫైట‌ర్‌.. ఆజాద్ హింద్ ఫౌజ్‌కి ఆద్యుడు.. బ్రిటిష్ సేన‌ల‌కు సింహ‌స్వ‌ప్నం.. జ‌ర్మ‌నీ, జ‌పాన్‌ల‌తో స్నేహ‌హ‌స్తం.. అండ‌మాన్‌, నికోబార్ దీవుల ఆక్ర‌మ‌ణ‌.. బ‌ర్మాకు బ‌ల‌గాలు.. స్వేచ్ఛా వాకిట‌ భార‌తావ‌ని.. అంత‌లోనే సుభాష్ చంద్ర‌బోస్ అదృశ్యం. అప్ప‌టి అదృశ్యం ఇప్ప‌టికీ మిస్ట‌రీనే. ఆ భార‌త‌మాత ముద్దుబిడ్డ‌.. స్వేచ్ఛా నిప్పుక‌ణిక‌.. నేతాజీ 125 జ‌యంతిని దేశ‌మంతా ఘ‌నంగా జ‌రుపుకుంటోంది. 

సుభాష్ చంద్రబోస్ జయంతినీ చేర్చుతూ.. కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలను జనవరి 24కి బదులుగా 23 నుంచే ప్రారంభించడం విశేషం. నేతాజీ జ‌యంతిని ‘పరాక్రమ్‌ దివస్‌’గా నిర్వహిస్తోంది. ‘సుభాష్‌ చంద్ర‌బోస్ ఆప‌ద ప్రబంధ‌న్’ అవార్డుల‌నూ ప్రదానం చేస్తోంది. 

సుభాష్ చంద్ర‌బోస్ జీవితం అత్యంత ఆస‌క్తిక‌రం. ఆయ‌న లైఫ్‌లో అనేక మ‌లుపులు, ట్విస్ట్‌లు. బ్రిటిష్ వారితో పాటూ కాంగ్రెస్‌ను, గాంధీనీ ఢీ కొట్టిన చ‌రిత్ర‌. బ‌హుషా అందుకే కాబోలు.. క‌మ‌ల‌నాథులు సుభాష్ చంద్ర‌బోస్‌ను త‌మ‌వాడిని చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటారు. 

1897 జనవరి 23న జన్మించారు సుభాష్ చంద్రబోస్. 1919లో ఐసీఎస్ (ఇప్పటి ఐఏఎస్‌-ఐపీఎస్ లాంటిది) కు సెలెక్ట్ అయ్యాడు. కానీ, దేశం మీద ప్రేమ‌తో బ్రిటిస్ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేయ‌లేక ఐసీఎస్‌ను వ‌దిలేశాడు. ఐసీఎస్‌ను కాద‌నుకున్న తొలి భార‌తీయుడిగా బోస్ పేరు దేశ‌వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్‌తో క‌లిసి స్వాతంత్య్ర పోరాటంలో భాగ‌స్వామి అయ్యారు. 1938 కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా నెహ్రూ నుంచి బాధ్య‌త‌లు అందుకున్నారు. స్వ‌త‌హాగా దూకుడు స్వ‌భావి అయిన బోస్‌కు.. గాంధీ వ‌ర్గానికి పొస‌గ‌లేదు. ఆ నెక్ట్స్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎల‌క్ష‌న్స్‌లోఉ.. సుభాష్ చంద్ర‌బోస్‌కు చెక్ పెట్టేందుకు గాంధీ.. త‌న మ‌నిషిగా తెలుగువాడైన భోగ‌రాజు ప‌ట్టాభిసీతారామ‌య్య‌ను రంగంలోకి దింపాడు. గాంధీని ధిక్క‌రించి.. భోగ‌రాజును 203 ఓట్ల తేడాతో ఓడించి.. రెండోసారి కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా గెలిచారు బోస్. అయినా, గాంధీజీ ఆయ‌న్ను నెగ్గ‌నీయ‌లేదు. కార్యనిర్వాహకవర్గం ఏర్పాటులో గాంధీ సహకరించకపోవడంతో ప్రతిష్టంభన ఏర్ప‌డ‌గా.. సుభాష్ చంద్ర‌బోస్ రాజీనామా చేయ‌క త‌ప్ప‌లేదు. ఆ త‌ర్వాతి కాలంలో కాంగ్రెస్‌నూ వీడాల్సి వ‌చ్చింది.

నేతాజీ త‌న‌ 20 ఏళ్ల ఫ్రీడ‌మ్ ఫైట్‌లో వేరువేరుగా 11 ఏళ్లు జైల్లోనే గ‌డిపారు. అందుకే, ఆయ‌న‌ ఆరోగ్యం బాగా క్షీణించింది. క్షయ వ్యాధి, గాల్‌బ్లాడర్ సమస్య ఉన్నట్లు బ్రిటీష్ డాక్టర్లు నిర్ధారించారు. తక్షణ చికిత్స చేయించకపోతే ప్రాణానికే ప్రమాదమని నివేదిక ఇచ్చారు. ‘విడుదల చేస్తాం. కానీ అతడు భారత భూభాగంలో ఉండకూడద’ని బ్రిటిష్ ప్రభుత్వం షరతు పెట్టింది. అలా, 1940 డిసెంబరులో జైలు నుంచి విడుదలయ్యారు బోస్‌. 

అది రెండో ప్ర‌పంచ యుద్ధం జ‌రుగుతున్న కాలం. బ్రిటీష్ పోలీసుల, గూఢచారుల కండ్లుగప్పి, భయంకర యుద్ధవాతావరణంలో, క్షీణించిన ఆరోగ్యంతో.. 16 జనవరి 1941న కలకత్తా నుంచి బయలుదేరిన సుభాష్.. నాలుగు నెలలు కఠిన ప్రయాణం చేసి బెర్లిన్ చేరుకున్నారు. హిట్లర్‌ను కలిసి, తాను నిర్వహించబోయే సాయుధ పోరాటానికి సహాయం కోరారు. స‌హ‌జంగా జ‌ర్మ‌నీస్‌ మిన‌హా మిగ‌తా వారికి అస‌లేమాత్రం గౌర‌వం ఇవ్వ‌ని హిట్ల‌ర్‌.. బోస్‌కు మాత్రం షేక్‌హ్యాండ్ ఇచ్చార‌ని అంటారు. సుభాష్‌ను జర్మనీ నుంచి జ‌పాన్ చేర్చడానికి హిట్ల‌ర్ సహకరించారు. మూడు నెలల ప్ర‌యాణం త‌ర్వాత‌.. భయంకర యుద్ధ ప‌రిస్థితుల్లో.. శత్రు సైనికులు, గూఢాచారులను బురిడీ కొట్టించి.. 1943 మే నెలలో జపాన్ చేరారు సుభాష్ చంద్ర‌బోస్‌.

13,000 మంది సైనికులతో ఇండియన్ నేషనల్ ఆర్మీకి అధినాయ‌కుడు అయ్యారు. నాకు ర‌క్తం ఇవ్వండి.. మీకు స్వాతంత్య్రం ఇస్తా.. అంటూ త‌న ఫౌజ్‌లో స్పూర్తి ర‌గిలించి.. బ్రిటిష్ ఇండియాపైకి దండెత్తాడు. 1943 నవంబర్‌లో అండమాన్, నికోబార్ దీవులను బ్రిటిష్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. 

ఆ త‌ర్వాత‌ బర్మా. అక్కడి నుంచి ఇంఫాల్‌. అంత‌లోనే రెండో ప్ర‌పంచ యుద్ధ ఫ‌లితం బోస్‌కు ప్ర‌తిబంధ‌కంగా మారింది. జర్మనీ, జపాన్ ఓట‌మితో బోస్‌.. చివరి ప్ర‌యత్నంగా సోవియట్ రష్యా సహాయం కోసం జపాన్ యుద్ధవిమానంలో మాస్కో ప‌య‌న‌మ‌య్యారు. 1945 ఆగస్టు 18 మధ్యాహ్నం సుభాశ్ ప్ర‌యాణిస్తున్న విమానం కూలిపోయింది. అయితే, ఆ ప్ర‌మాదంలో బోస్ మ‌ర‌ణించారా? ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారా? మారు వేషంలో ఉన్నారా? గుమ్నామీ బాబా ఆయ‌నేనా? ఇలా బోస్‌.. అప్ప‌టి నుంచీ ఓ మిస్ట‌రీ.  

బోస్ పోరాటం బ్రిటిష‌ర్ల‌పై ఎంతో ఒత్తిడి పెంచింది. రెండేళ్ల త‌ర్వాత‌ దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చింది. స్వ‌తంత్ర దేశంలో చంద్ర‌బోస్ క‌నుక ఉండిఉంటే.. భారతదేశ స్థితి ప్రస్తుతానికి భిన్నంగా, ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉండేదని భావించే వారూ ఉన్నారు. ఎవ‌రి అంచ‌నాలు వారివి.