గుడివాడలో గ‌డ‌బిడ‌.. టీడీపీ నేత‌ల అరెస్టుతో తీవ్ర ఉద్రిక్త‌త‌..

గుడివాడలో క్యాషినో రగడ పెరిగిపోతూనే ఉంది. కొడాలి కన్వెన్షన్ సెంటర్ లో క్యాషినో ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు టీడీపీ నేతల నిజనిర్ధారణ కమిటీ క్యాషినో కథ నిగ్గు తేల్చేందుకు యత్నించింది. కే కన్వెన్షన్ వద్దకు వెళ్లేందుకు యత్నించిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు వర్ల రామయ్య, కొనకళ్ల నారాయణ,  బోండా ఉమ, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు, ఆచంట సునీత, తంగిరాల సౌమ్య సహా ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పామర్రు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో గుడివాడలో పరిస్థితులు మరింత తీవ్ర స్థాయికి వెళ్లిపోయాయి.

కాగా.. టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. క్యాషినో నిర్వహించి ప్రజల నుంచి వందల కోట్లు కాజేసిన గడ్డం గ్యాంగ్ ను వదిలిపెట్టి నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతలను అదుపులోకి తీసుకోవడమేంటని నిప్పులు చెరిగారు. మహానుభావులు పుట్టిన గుడివాడ గడ్డను గడ్డం గ్యాంగ్ భ్రష్టు పట్టించిందని దుయ్యబట్టారు. మింగేందుకు ఏమీ మిగలలేదని చివరికి జనం వంటిపై ఉన్న గుడ్డలను కూడా లాగేసేందుకు క్యాషినో ఏర్పాటు చేశారంటూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

వైసీపీ రంగులతో పోలీసుల కళ్లు మూసుకుపోయాయని, జూదానికి కే కన్వెన్షన్ అడ్డాగా మారినట్లు ప్రపంచమంతా తెలిసినా పోలీసులకు కనిపించడంలేదని లోకేశ్ విమర్శించారు. క్యాషినో వెనక ఉన్న అసలు సూత్రధారులను అరెస్ట్ చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. క్యాషినో నడిపినప్పుడు అడ్డు రాని కోవిడ్ రూల్స్ పేరుతో టీడీపీ నేతలను అడ్డుకోవడాన్ని వైసీపీ సర్కార్ దిగజారుడుతనానికి తార్కారణమని లోకేశ్ తూర్పారపట్టారు.