మేడారంలో మొదలైన నిలువు దోపిడీ

హైదరాబాద్ లాంటి మహా నగరవాసులు కూడా ప్రతి రెండేళ్లకోసారి మేడారానికి క్యూ కడతారు. పేరుకు అతిపెద్ద గిరిజన కుంభమేళాగా చెబుతారే కానీ... మైదాన ప్రాంత, గిరిజనేతర ప్రజలతో అటవీ ప్రాంతమంతా కిక్కిరిసిపోతుంది. జాతరకు 20 రోజుల ముందు నుంచే భక్తుల పుణ్యస్నానాలు, శివసత్తుల పూనకాలతో జంపన్నవాగు పునీతమవుతుంది. ప్రతి జాతరకూ జనం పెరుగుతున్నారే తప్ప ఎక్కడా తగ్గింది లేదు. జాతర ముగిసేలోపు దాదాపు 3 కోట్ల మంది భక్తులు దర్శించుకునే జనజాతరగా మేడారాన్ని చెబుతారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గిన జాడ లేదు. మొన్న జనవరి 26 రోజున సెలవు కావడం చేత దాదాపు 5 లక్షల భక్తులు హాజరయ్యారు. మాఘశుద్ధ పూర్ణిమ సమీపిస్తున్న దృష్ట్యా క్రమంగా భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. జనవరి 30 ఆదివారం ఉండడంతో ఈ సంఖ్య 10 లక్షలు తాకే అవకాశం ఉందంటున్నారు. జాతర  ఆ తరువాత ఇప్పుడు ప్రతిరోజూ  తగ్గే అవకాశం కూడా లేదు. సమ్మక్క-సారక్క జాతరకు పెరుగుతున్న ఆదరణ కారణంగానే ఏటేటా ప్రభుత్వం నిధుల కేటాయింపు పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి జాతరకు తెలంగాణ ప్రభుత్వం  అక్కడ ఏర్పాట్లు, సౌకర్యాల కోసం రూ. 75 కోట్లు కేటాయించింది. 

ఇక జనం ఎక్కడ చేరతారో అది ప్రముఖ వ్యాపార కేంద్రంగా మారడం సహజమే. దీన్నో అవకాశంగా తీసుకున్న వ్యాపార వర్గాలు అక్కడికి అన్ని రకాల వస్తువులు, తినుబండారాలు తరలించి రూపాయి పెట్టుబడికి 10 రెట్లు లాభాలు ఆర్జించేలా రేట్లు పెంచుతున్నారు. దీంతో ఖరీదైన భక్తుల సంగతి పక్కనపెట్టి.. కేవలం అమ్మవార్లను దర్శించుకొని వెళ్దాం అని వచ్చే సామాన్య భక్తులు, నిజాయతీగా మొక్కులు తీర్చుకుందామనుకునే పేదల చేతి చమురు విపరీతంగా వదులుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ఏ మొక్కులూ మొక్కుకోనివారు సైతం వ్యాపారస్తుల లాభాపేక్ష కారణంగా దేవతల ముందు నిలువు దోపిడీకి గురికావాల్సి వస్తోంది. ఫిబ్రవరి 16-19 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. 16 రోజున సారక్క గద్దె మీదికి వస్తుండగా, 17న సమ్మక్కను తీసుకొస్తారు. 18న అమ్మవార్లు ప్రజలందరికీ దర్శనమిచ్చి 19న మళ్లీ వనాల బాట పడతారు. 

ఇక మేడారంలో ప్రస్తుతం రేట్లు ఎలా మండిపోతున్నాయో ఓసారి చూద్దాం. ధరల్లో స్థానిక వ్యాపారులు ఒకరకంగా, స్థానికేతర వ్యాపారులు ఒకరకంగా రేట్లు ఫాలో అవుతున్నారు.  అయితే స్థానికేతర వ్యాపారులు లేకపోతే జాతరలో భక్తుల అవసరాలు తీర్చడం సాధ్యం కాదన్నఅభిప్రాయాలు కూడా ఉన్నాయి. కానీ రేట్లు మరీ విచక్షణరహితంగా పెంచడం భావ్యం కాదంటున్నారు సామాన్య భక్తులు. 

బ్రాయిలర్ కోడి కిలో ప్రస్తుతం రూ. 180-200 నడుస్తోంది. అయితే ఇలాంటి అంశాల్లో స్థానిక వ్యాపారులు మార్కెట్ రేట్లు అనుసరిస్తుండగా స్థానికేతర వ్యాపారులు మాత్రం వీరు పెట్టిందే రేటు అమ్మిందే వస్తువు అన్నట్టుగా తయారైంది. ఇక నాటుకోడి విషయానికొస్తే కిలో రూ. 500 - 650 వరకు నడుస్తోంది. మద్యం రేట్లు ఆకాశానికంటాయి. ప్రతి క్వాటర్ బాటిల్ మీద రూ. 50-80 కి పెంచి అమ్ముతున్నారు. బయట రూ. 300 ఉండే బ్లెండర్ స్ప్రైడ్ క్వాటర్ ఇక్కడ రూ. 380 అమ్ముతున్నారు. ఇక బీర్లయితే అక్షరాలా డబుల్ రేట్లకు అమ్ముతున్నారు. గుడి ముందు వేలంపాటలో దుకాణాలు దక్కించుకున్నవారు పూజాసామగ్రి సెట్లను రూ. 150కి అమ్ముతున్నట్టు భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ప్యాకేజీలో రెండు కొబ్బరికాయలు, రెండు బంగారం కడ్డీలు (చిన్నసైజు బెల్లం ముక్కలు), 4 అగరువత్తులు, పసుపు-కుంకు ప్యాకెట్లు 2 చిన్నవి. దాదాపు రూ. 60 విలువ చేసే ఈ వస్తువులకు రూ. 150 వసూలు చేస్తున్నారు. అయితే తాము రూ. 10 వేలు చెల్లించి వేలంలో షాపులు దక్కించుకున్నామని, అందువల్ల తాము కూడా ఎక్కడి నుంచో ఎన్నో కష్టనష్టాలకోర్చి వస్తున్నాం కాబట్టి ఎంతోకొంత లాభం చూసుకోవాల్సిందే కదాని సర్ది చెబుతున్నారు. 

ఇక మేడారంలో రోడ్ల వెంట పొలాల్లో షాపులు పెట్టుకోవడానికి స్థానికేతర వ్యాపారులు చిన్నచిన్న గుడారాలు వేసుకునేందుకు ఆయా భూముల యజమానులకు పెద్దమొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తోంది. 3-5 గజాల స్థలానికి ఈ జాతర జరిగే దాదాపు 20 రోజులకు దాదాపు రూ. 25 వేలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఆ గుడారాల్లో పెట్టుకునే షాపులన్నీ తమ వస్తు, సేవలకు విపరీతంగా రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి. ఇక ఇవే ధరలు గుడి సమీపంలో అయితే గజానికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు నడుస్తున్నట్టు పలువురు వ్యాపారులు చెబుతున్నారు. అమ్మవార్ల దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులు మరీ ఇక్కట్ల పాలు కాకుండా ధరల్ని నియంత్రించేలా చర్యలు చేపడితే మేడారం ప్రభ ఇంకా వెలిగిపోతుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా చర్యలు తీసుకుంటారా? చూడాలి మరి.