ఆరు నెలల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్!
posted on Nov 29, 2024 8:59AM
రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే పనులు ఎంత శరవేగంగా సాగుతాయో, ప్రజా ప్రయోజనాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ ఎంత చక్కగా ఉంటుందో ఐదు నెలల తెలుగుదేశం కూటమి పాలనలో ప్రజలకు చక్కగా అర్ధమౌతోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు హామీని నెరవేర్చే విషయంలో తెలుగుదేశం కూటమి సర్కార్ అడుగులు ఎంత వేగంగా పడుతున్నాయో చెప్పడానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ చేసిన ప్రకటనే సాక్ష్యం. ఆరు నెలలలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటౌతుందని ఆయన వెల్లడించారు.
అదే జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అంటూ ఓ అసంబద్ధ ప్రతిపాదనలో జగన్ ముందుకు వెళ్లారు. అప్పటికే 70 శాతం వరకూ పూర్తైన అమరావతి నిర్మాణాలను నిలిపివేశారు. అమరావతిని నిర్వీర్యం చేశారు. పోనీ మూడు రాజధానుల విషయంలో ఒక్కటంటే ఒక్క అడుగైనా ముందకు వేయగలిగారా అంటే అదీ లేదు. కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించిన జగన్ తన హయాంలో ఆ దిశగా ఒక్క ఇటుక పేర్చిన పాపాన పోలేదు. శాసన రాజధాని అని చెప్పిన అమరావతినీ పాడుపెట్టారు. ఇక విశాఖ విషయానికి వస్తే అక్కడ రుషికొండకు గుండు కొట్టి తన కోసం ప్యాలెస్ నిర్మించుకోవడం వినా రాజధాని నిర్మాణం దిశగా అడుగులు వేసింది లేదు.
కానీ తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ అమరావతే ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అని ప్రకటించి.. ఆ దిశగా కార్యాచరణ చేపట్టింది. జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేసింది. నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియకు సిద్ధమైంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం అన్వేషణ ఆరంభించారు. త్వరలోనే ప్రక్రియను పూర్తి కాబోతోంది. జగన్ సర్కార్ కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్‌గా చేస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తే, తెలుుదేశం కూటమి సర్కార్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ శాశ్వత భవన నిర్మాణానికి ఏడాదిన్న సమయం పట్టే అవకాశం ఉండటంతో తాత్కాలిక భవనంలో హైకోర్టు బెంచ్ ను ఆరు నెలలలోగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంటే అర్ధ సంవత్సరంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోంది. అదే సమయంలో లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాలు కూడా కర్నూలులోనే కొనసాగనున్నాయి. కర్నూలు ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతున్నది.
చిత్తశుద్ధితో, సంకల్పంతో పని చేస్తే పనులు ఎంత వేగంగా సాగుతాయన్నదానికి తెలుగుదేశం ప్రభుత్వం ఉదాహరణగా నిలుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతి నిర్మాణమే కాదు, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పట్టాలెక్కాయి. నిర్దుష్ట కాల వ్యవధిలో ఈ పనులు పూర్తి కానున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడాన్ని వారు ఇందుకు తార్కానంగా చూపుతున్నారు.