Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణా రవాణా శాఖకు హైకోర్టు మొట్టికాయలు
posted on: Mar 19, 2015 9:21PM
.jpg)
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తమ రాష్ట్రంలో ప్రవేశించే ఆంద్ర వాహనాలపై ప్రవేశ పన్ను విధిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఒక జి.ఓ. జారీ చేసినప్పుడు హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడంతో ఆ జి.ఓ.ను వెనక్కు తీసుకోవలసి వచ్చింది. కానీ ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ కలిగి ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో తిరుగుతున్న వాహనాలపై రాష్ట్ర రవాణాశాఖ అధికారులు జీవితపన్ను చెల్లించమని గత నెలరోజులుగా నోటీసులు జారీ చేస్తుండటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వాహనాలు ఏ రాష్ట్రంలో కొన్నప్పటికీ వాటిని కొన్నప్పుడే జీవిత పన్ను వసూలు చేస్తారు. కనుక తరువాత దేశంలో ఏ రాష్ట్రంలో తిరిగినప్పటికీ వాటిపై మళ్ళీ జీవితపన్ను విధించడానికి వీలులేదు. కానీ మళ్ళీ జీవితపన్ను చెల్లించమని రాష్ట్ర రవాణాశాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తుండటంతో, వాటిని సవాలు చేస్తూ కోర్టులో నిత్యం పిటిషన్లు పడుతున్నాయి. వాటిపై దృష్టి సారించిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొన్ని రోజుల క్రితం తెలంగాణా రాష్ట్ర రవాణాశాఖ అధికారులు చెన్నైకి చెందిన ఒక వైద్యుడికి కారుని పట్టుకొని దానిపై వడ్డీతో సహా అన్ని ఖర్చులు కలుపుకొని మొత్తం మొత్తం ఒక లక్షా డబ్బై ఎనిమిదివేలు జీవితపన్ను చెల్లించమని నోటీసులు జారీ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో రాజస్థాన్ కి చెందిన యస్.వి.ఈ.సి.అనే నిర్మాణసంస్థకు చెందిన ఒక లారీని జీవితపన్ను చెల్లించలేదంటూ రవాణా శాఖ అధికారులు నిలిపివేశారు.
ఇటువంటివే మరి కొన్ని కేసులు కోర్టు దృష్టికి రావడంతో చీఫ్ జస్టిస్ కళ్యాన్ సేన్ గుప్తా మరియు జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖకు మొట్టికాయలు వేసారు. ఒకసారి జీవిత పన్ను చెల్లించిన వాహనంపై మళ్ళీ జీవితపన్ను ఎందుకు విధిస్తున్నారని రవాణాశాఖ తరపున కోర్టుకి హాజరయిన న్యాయవాదిని నిలదీసినప్పుడు, తెలంగాణా రాష్ట్రంలో ముప్పై రోజులకంటే ఎక్కువ రోజులున్న వాహనానికి మళ్ళీ జీవితపన్ను చెల్లించవలసి ఉంటుందని ఆయన బదులిచ్చారు. ఆయన సమాధానం విన్న న్యాయమూర్తులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటువంటి చట్టం ఎక్కడ ఉందో తమకు చూపించాలని ఆదేశించారు. అంతేగాక ఈవిధంగా వాహనదారులను ఇబ్బందులు పెడుతున్న సదరు అధికారుల పేర్లను తమకు తెలియజేయాలని ఆదేశించారు. వారు సీజ్ చేసిన అన్ని వాహనాలను తక్షణమే విడుదల చేయమని ఆదేశించారు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే సంబంధిత అధికారుల నుండి నష్టపరిహారం వసూలుచేసి సదరు వాహనదారులకు చెల్లింపజేయిస్తామని న్యాయమూర్తులు హెచ్చరించారు. ఈ జీవితపన్ను వ్యవహారంపై వారం రోజుల్లోగా రవాణా శాఖ సంజాయిషీ ఇవ్వవలసిందిగా కోర్టు ఆదేశించింది.


(3).jpg)
.jpg)


