మెట్టు దిగి అసెంబ్లీకి వస్తున్న మాజీ సీఎం!

 ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని ఎంత హడావుడి చేస్తున్నారో అందరికీ తెలుసు. ఆఖరికి స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోర్టు మెట్లు కూడా ఎక్కారాయన. తనకు హోదా వచ్చే వరకు అసెంబ్లీ మెట్లెక్కనని  భీష్మించుకు కూర్చొన్నారు. అంతా తన ఇష్ట ప్రకారమే జరగాలని భావించే మాజీ సీఎంకు శాసనసభ నిభందనలు తెలిస్తే కాని తత్వం బోధ పడలేదు. ఏ శాసనసభ్యుడైనా స్పీకర్‌కు సరైన రీజన్ చూపించకుండా ఆరు నెలల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కి ఉంటుంది. అయితే స్పీకర్లు తమకు ఉన్న ఆ విచక్షనాధికారాల్ని పెద్దగా ఉపయోగించిన సందర్భాలు కనిపించవు. అయితే ఏపీలో స్పీకర్‌గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజులను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వేధింపులకు గరి చేశారు. వారు ఎక్కడ తమ విచక్షణాధికారాలకు పని చెప్తారో అన్న భయంతో జగన్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం అసెంబ్లీకి రావడానికి రెడీ అయ్యారు. కేసీఆర్ కూడా తెలంగాణలో అనర్హత వేటు భయంతోనే బడ్జెట్ సమావేశాల రోజు అసెంబ్లీలో అటెండెన్స్ వేయించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ కూడా అదే భయంతో బెట్టు మాని.. మెట్టు దిగుతున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తున్నారు సోమవారం శాసనమండలిలోని వైసీపీ కార్యాలయంలో మీటింగ్‌ ఉంది.. సభ్యులంతా హాజరవ్వాలని బొత్స సత్యనారాయణ రాసిన లేఖతో జగన్ అసెంబ్లీ షెడ్యూల్ ఖరారైంది.
Publish Date: Feb 22, 2025 6:34PM

పెద్దల సభలోకి లోకనాయకుడు.. క్లారిటీ ఇచ్చిన కమల్

మక్కల్ నిది మయ్యమ్ పార్టీ అధినేత, విశ్వనటుడు కమల్ హాసన్‌ను అధికార డీఏంకే పార్టీ రాజ్యసభకు పంపనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎం కె స్టాలిన్.. ఇప్పటికే తన కేబినెట్ మంత్రి ద్వారా కమల్ హాసన్‌కు సమాచారం పంపారు. ఈ ఏడాది జులైలో డీఏంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌ను పెద్దల సభకు పంపేందుకు డీఏంకే సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఏంకేతో మక్కల్ నిది మయ్యమ్ పొత్తు పెట్టుకొంది. అయితే ఆ ఎన్నికల్లో కోయంబత్తురు నుంచి కమల్ హాసన్ బరిలో నిలవాలని భావించారు.  కోయంబత్తురు నియోకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ఈ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలోకి దిగారు. దీంతో డీఏంకే అధినేత, సీఎం ఎం.కె. స్టాలిన్ సలహా, సూచనలతో కమల్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. మరోవైపు తమిళ ప్రముఖ నటుడు విజయ్ సైతం తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించారు. ఆయన సైతం ప్రజల మధ్యకు వెళ్తున్నారు. అందులో భాగంగా వివిధ సమయాల్లో పలు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోవైపు 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఏంకే పార్టీ అధినేత, సీఎం ఎం.కె.స్టాలిన్ తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నారు. అందులోభాగంగా కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపడం ద్వారా చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందనే బలమైన సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు డీఏంకే ఈ నిర్ణయం తీసుకుందని పరీశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను రాజ్యసభకు వెళ్తున్న విషయాన్ని లోకనాయకుడు తాజాగా నిర్ధారించారు.  ఎంఎన్‌ఎం 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చెన్నైలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో జెండాను ఆవిష్కంచి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కమల్ హసన్ తాను రాజ్యసభకు వెడుతున్న విషయాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా తన పొలిటికల్‌ కెరీర్‌పై కమల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చానని, 20 ఏళ్ల ముందే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఇప్పుడు తన ప్రసంగం, స్థానం వేరేలా ఉండేవని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పార్లమెంట్‌లో మన పార్టీ గొంతు వినిపించబోతోందని ఆయన చేసిన  వ్యాఖ్యలతో  కమల్‌ హాసన్‌ రాజ్యసభలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవల జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లు అయింది.
Publish Date: Feb 22, 2025 1:22PM

పాక్‌కి షాక్ ఇచ్చి లెక్క సరిచేస్తారా?

ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఎన్ని జట్లు తలపడుతున్నా, భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ లెక్కే వేరేగా ఉంటుంది. ఆ రెండు దేశాల అభిమానులే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు టీవీల ముందుకు చేరిపోతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియా, పాక్ మధ్య పోరు అంటే హైఓల్టేజ్‌ మ్యాచ్‌. చిరకాల ప్రత్యర్థులైన దాయాది జట్లు ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం తలపడుతున్నాయి. గత ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించిన పాక్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పాక్‌ మొదటి మ్యాచ్ ఓటమితో ప్రారంభించగా.. బంగ్లాపై ఘన విజయంతో భారత్‌ రెట్టించిన ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది.  ఈ సారి బ్యాట్స్‌మాన్ ఫకర్‌ జమాన్‌ దూరం కావడం పాక్‌ జట్టుకు పెద్ద లోటే. స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ ఫామ్‌ లేమి కూడా వారిని ఇబ్బంది పెడుతుంది. మరోవైపు బుమ్రా లేకపోయినా.. టీమ్‌ఇండియా పేస్‌ దళాన్ని తొలి మ్యాచ్‌లో అద్భుతంగా షమీ ఐదు వికెట్ల ప్రదర్శనతో ముందుకు నడింపించాడు. అతడికి హర్షిత్‌ రాణా తోడయ్యాడు. స్పిన్నర్లు కూడా తమవంతు ప్రాత్ర పోషించారు. మరి వీరు పాకిస్థాన్‌పై ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఇక దూకుడుగా ఆడుతున్న రోహిత్‌, సెంచరీ గిల్‌ మరోసారి చెలరేగితే.. టీమ్‌ఇండియాకు భారీ పరుగులు ఖాయమే. పాకిస్థాన్‌పై గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. తన మునుపటి ఫామ్‌ను అందుకొని రాణిస్తే పాక్‌కు కష్టాలు తప్పవు  తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన పాకిస్థాన్‌కు భారత్‌తో మ్యాచ్‌ అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ ఆతిధ్య జట్టు టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాల్సిందే. దీంతో ఆ జట్టును భారత్ ఏమాత్రం తక్కువగా అంచనా వేయడం లేదు. దాయాదుల పోరు అంటే రెండు జట్ల ఆటగాళ్లు ప్రాణంపెట్టి ఆడతారన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. అందులో మూడు సార్లు పాకిస్థాన్‌ నెగ్గి పైచేయి సాధించింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ గ్రూప్‌ స్టేజ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయాన్ని భారత్‌ నమోదు చేసింది. గ్రూప్‌ బీలో భాగంగా జూన్‌ 4న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్‌కు 41 ఓవర్లలో 289 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. అయితే.. పాక్‌ 33.4 ఓవర్లలో 164 పరుగులే చేసింది. డక్‌వర్త్‌ పద్ధతిలో టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. యువరాజ్‌ మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.  2017 ఫైనల్‌కు చేరిన భారత్‌.. తిరిగి పాకిస్థాన్‌తోనే తలపడింది. జూన్‌ 18న లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా మ్యాచ్‌ జరగ్గా.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో టీమ్‌ఇండియా ముందు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. ఘోరంగా విఫలమై 158 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో తొలిసారి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీని ముద్దాడింది. ఆనాటి ఫైనల్‌లో ఘోర ఓటమికి బదులు తీర్చుకొనే అవకాశం ఇప్పుడు టీమ్‌ఇండియాకు వచ్చింది. గత వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన మన మెన్ ఇన్ బ్లూ... మరోసారి ఆ జట్టును ఓడించి సత్తా చాటాలని ప్రతీ భారత అభిమాని కోరుకుంటున్నాడు. దుబాయ్‌ వేదికగా జరిగే ఆదివారం నాటి మ్యాచ్‌లో విజయం సాధించి చాంపియన్ ట్రోఫీలో రెండ జట్ల మధ్య ఫలితాల లెక్కను 3-3తో సరిచేయాలని ఆకాంక్షిస్తున్నారు. పలువురు సీనియర్లకు ఇదే చివరి ట్రోఫీ అని భావిస్తున్న తరుణంలో పాకిస్థాన్‌పై చెలరేగి ఆడి.. కెరీర్‌కు ముగింపు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Publish Date: Feb 22, 2025 1:09PM

మహాకుంభ్ లో ఇప్పటికే 60 కోట్ల మంది పుణ్యస్నానాలు

ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాకు భక్త జనం పోటెత్తుతున్నారు. శుక్రవారం నాటికే మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లకు చేరువైంది.  మామూలుగా 12ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలుగా కాకుండా  మహాకుంభమేళా 144 సంవత్సరాల తరువాత వచ్చింది. 40 రోజులు పాటు సాగే ఈ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మహా శివరాత్రితో ముగియనున్న కుంభమేళా గడువు దగ్గరపడుతుండటంతో భక్తుల తాకిడి మరింత పెరుగుతోంది.  హిమాలయాలనుంచి కూడా సాధువులు వచ్చి పుణ్య స్నానాలు చేయడం విశేషం. దేశం,విదేశాల నుంచి కూడా కుంభమేళాకు తరలి వస్తున్నారు.  విమానాలు,రైళ్లు,బస్సులు,కార్లు ఇలా ఏ వాహనం దొరికితే దానిలో ప్రయాగ్ రాజ్ బాట పడుతున్నారు భక్తులు.  వాహనాలతో వందల కి.మీ ట్రాఫిక్ జామ్ అవుతున్నది.  భారతదేశ జనాభా 145 కోట్లలో హిందువులు 110 కోట్లకు పైగా ఉన్నారు.వారిలో సగం మందికి పైగా ఇప్పటికే మహాకుంభమేళాకు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు.  
Publish Date: Feb 22, 2025 11:37AM

జగన్‌కి సీఎం అపాయింట్‌మెంట్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా?

ముఖ్యమంత్రిగా అయిదేళ్లు పరదాల మాటున, ప్యాలెస్ పాలన  ఎలా ఉంటుందో చూపించిన జగన్‌కు ఏపీ ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. కనీసం జగన్‌కు ప్రతిపక్షనేత హోదా కూడా లేకుండా చేయడంతో ఆయన దాన్ని వంకగా చూపిస్తూ అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు. ఆ క్రమంలో ఆ మాజీ ముఖ్యమంత్రిని పులివెందుల ఎమ్మెల్యేగానే చూస్తూ టీడీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి.  మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితల దగ్గర నుంచి అందరూ జగన్‌ని పులివెందుల ఎమ్మెల్యేగానే సంభోదిస్తున్నారు. ప్రతిపక్షనేత హోదా ఎలాగూ రాదని తెలిసినా జగన్ మాత్రం దాని కోసం న్యాయ పోరాటం చేస్తూ సొంత పార్టీలోనే అభాసుపాలవుతున్నారు. ఓటమి తర్వాత జగన్ ఎప్పుడు, ఎక్కడ ఉంటారో వైసీపీ శ్రేణులకే అంతుపట్టడం లేదు. తాడేపల్లి ప్యాలెస్ టూ బెంగళూరు ప్యాలెస్‌కు షటిలింగ్ చేస్తూ,  పులివెందులలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చి మాయమవుతున్నారు . మధ్యమధ్యలో జైళ్లకు వెళ్లి రిమాండ్‌లో ఉన్న తన పార్టీ నేతలను పరామర్శించి వస్తున్నారు. అంతేకాని సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాల పర్యటనలు చేస్తానని ఘనంగా ప్రకటించిన ఆయన దాని ఊసే ఎత్తడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పులివెందులు సమస్యలకు లింకు పెట్టి తాజాగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.  జగన్‌ తన నియోజకవర్గం పులివెందుల సమస్యల పరిష్కారం కోసం సీఎం వద్దకు వస్తానంటే చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తానని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి లేటెస్ట్‌గా ప్రకటించారు.  ఎన్నో ఏళ్ల నుంచి ఓట్లు వేసి గెలిపించిన పులివెందుల ప్రజలంటే మాజీ సీఎం జగన్‌కు ఏమాత్రం ప్రేమ లేదని, అక్కడ ఎన్నో సమస్యలున్నాయని,  వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత పులివెందుల ఎమ్మెల్యేగా జగన్‌కు ఉందని దెప్పిపొడిచారు. జగన్ అసెంబ్లీకి గైర్హాజరవుతుండటంతో పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని, ఒకవేళ ఉప ఎన్నికల్లో జగన్‌ మళ్లీ గెలిచినా అసెంబ్లీకి వెళ్లేది లేదని బీటెక్ రవి యద్దేవా చేశారు. ఏదేమైనా పులివెందుల ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాలం, కర్మం కలిసి రాకపోతే మాజీ సీఎం అయినా, ఇంకెవరైనా పరిస్థితి ఇలాగే ఉంటుందేమో.
Publish Date: Feb 22, 2025 11:17AM

చెత్త బుట్టలోకి చెత్తపన్ను

చంద్రబాబు సర్కార్ చెత్త పన్నును రద్దు చేసింది. జగన్ హయాంలో 2012 నవంబర్  నుంచి రాష్ట్రంలో చెత్త పన్ను వసూలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం జగన్ సర్కార్ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించి.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంది. రాష్ట్రంలో చెత్తపన్నును రద్దు చేస్తూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  గత ఏడాది డిసెంబర్ 31నుంచీ చెత్త పన్ను రద్దు అమలులోకి వచ్చినట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొంది. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు చెత్త పన్నును రద్దు చేశారు. 
Publish Date: Feb 22, 2025 9:54AM