తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. బీఅల‌ర్ట్‌..

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న‌ట్టుండి మ‌బ్బేసింది..మ‌స‌కేసింది. ద‌స‌రా రోజే అక్క‌డ‌క్క‌డా చినుకులు. శ‌నివారం సైతం ప‌లుచోట్ల వాన‌లు. ఇవేమీ సడెన్‌గా ఊడిప‌డిన‌ వ‌ర్షాలు కావు. వాతావ‌ర‌ణ శాఖ ముందే చెప్పింది. శుక్ర‌-శ‌ని-ఆదివారాల్లో ఏపీ, తెలంగాణ‌లో ప‌లుచోట్ల వాన‌లు కుర‌వ‌నున్నాయ‌ని తెలిపింది. అన్న‌ట్టుగానే.. వెద‌ర్ రిపోర్ట్‌కు త‌గ్గ‌ట్టే తెలుగు స్టేట్స్‌లో వ‌ర్షాలు ప‌డుతున్నాయి. 

ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశాలను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్ల‌డించింది. తెలంగాణ‌లోనూ వాన‌లు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

ఉత్తర కోస్తాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గాలుల కారణంగా సముద్రంలో అలలు ఎగసి పడనున్నాయ‌ని.. మత్స్యకారులు ఆదివారం వ‌ర‌కూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు.