టార్గెట్ పొంగులేటి.. హ‌రీష్ అస‌లు స్కెచ్ అదేనా?

posted on: Apr 6, 2026 9:59AM

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హ‌రీష్ రావు మంత్రి పొంగులేటిని ఎందుకు టార్గెట్ చేశారు. ఇటీవల అసెంబ్లీలో రాఘ‌వా క‌న్ స్ట్ర‌క్ష‌న్స్ వ్య‌వ‌హారం.. తాజాగా నాద‌ర్ గుల్ లో 7 వేల కోట్ల భూ కుంభ‌కోణం అంటూ గుప్పిస్తున్న ఆరోపణలు.   ఇంత‌కీ ఈ కొత్త కుంభ‌కోణం వివ‌రాలేంటి?  అని చూస్తే..
హ‌రీష్ ఏం  చేసినా ఒక ప‌క్కా  స్కెచ్ ప్ర‌కార‌మే చేస్తారు. ఎందుకంటే  ఆయ‌న మైండ్ సెట్ అలాంటిది. మందుల సామెల్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్న‌ట్టు.. ఒక ప‌క్క కేటీఆర్ ని క్రాస్ చేసి పార్టీ ఆక్ర‌మ‌ణ ఎలా  చేద్దామ‌ని ఎలా  ట్రై చేస్తున్నారో.. ఇప్పుడు ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌ని కూడా అలాగే ల‌క్ష్యంగా చేసుకున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో సాగుతోంది. 

 పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో..  ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి  వినిపించిన సంగ‌తి  తెలిసిందే.  వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే.  ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.

సీఎం రేవంత్ ప్ర‌క‌ట‌న‌  బ‌ట్టి  చూస్తే ఇదేదో త‌న‌కు, త‌న కుటుంబానికి గ‌ట్టిగానే త‌గిలేలా ఉంద‌ని భావించిన హ‌రీష్.  పొంగులేటి చుట్టూ ఉన్న వ్య‌వ‌హారాల‌పై  దృష్టిసారించిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే ఆయ‌న నాద‌ర్ గుల్ కుంభ‌కోణాన్ని తెర‌పైకి తెచ్చిన‌ట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా, సరోర్‌నగర్ మండలం, నాదర్‌గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613 లో  373 ఎకరాల ప్రభుత్వ భూమి.  సుమారు 7 వేల‌ కోట్ల రూపాయల విలువైన ఈ ప్రభుత్వ భూమిని మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలు..  కోహినూర్ గ్రూప్, శిల్పా ఇన్ఫ్రా వంటివి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు హరీష్ రావు.

గతంలో వైఎస్సార్ హయాంలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించి టీజీఐఐసీకి అప్పగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఇది 22A నిషేధిత జాబితాలో ఉండేదీ భూమి. అయితే, ఇప్పుడు అధికార బలాన్ని ఉపయోగించి.. రైతులను భయపెట్టి, ఫెన్సింగ్ వేసి ఈ భూమిని కబ్జా చేస్తున్నారని హరీష్ రావు ఆరోపిస్తున్నారు.   600 మంది పేద రైతులు ఈ భూమి వల్ల నష్టపోతున్నారని అంటున్నారు హ‌రీష్‌.

బేసిగ్గా ఏదైనా గీత‌ను చిన్న‌గీత‌గా చూపించాలంటే, దాని ప‌క్క‌నే పెద్ద గీత గీస్తే సరిపోతుందంటారు. హరీష్ సరిగ్గా అదే ఫార్ములా ఉపయోగిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  త‌మ హ‌యాంలో జ‌రిగిన మైనింగ్ అక్ర‌మాల ముందు పోలిస్తే ఇవి చాలా చాలా పెద్ద‌వి  కాబ‌ట్టి.. ఇవేవీ సీఎంకి క‌నిపించ‌వా?  హైడ్రాకు క‌నిపించ‌వా? అంటూ ఆరోపిస్తున్నారు. 

కాగా హ‌రీష్ ఆరోప‌ణ‌ల‌కు కాంగ్రెస్ కౌంట‌ర్ ఇస్తోంది.  హ‌రీష్ రావు ఆరోపణలన్నీ రాజ‌కీయ ప్రేరేపితాలే అంటోంది.  బీఆర్ఎస్ హ‌యాంలోనే ఈ స్థ‌లంలో కోహినూర్ కంపెనీ రేకుల షెడ్డు వేసింద‌ని  కాంగ్రెస్ చెబుతోంది. జ‌రిగిన  త‌ప్పంతా వారి హ‌యాంలో జ‌ర‌గ్గా వాటిని పట్టుకుని ఇప్పుడు కాంగ్రెరస్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారని విమర్శిస్తున్నది. 

ఇక రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వివాదం విషయానికి వస్తే..  మార్చి చివరి వారంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు ఈ అంశాన్ని లేవనెత్తారు మంత్రి పొంగులేటికి చెందినదిగా చెప్పబడే రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ, ఎలాంటి అనుమతులు లేకుండా స్టోన్ క్రషింగ్, మైనింగ్ చేస్తోందన్నది ఆయన ఆరోపణ.   ముఖ్యంగా జీవో 111 పరిధిలో   నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, ఇప్పటికే ఆ కంపెనీకి నోటీసులు ఇచ్చి 2.74 కోట్ల రూపాయల జరిమానా   వసూలు చేశామని వెల్లడించింది. అయితే పొంగులేటి పేరును రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించడం గొడవకు దారితీసింది. 

ఇంతకీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని హరీష్ టార్గెట్ చేయడానికి కారణం.. ఆయన ప్రస్తుతం రెవెన్యూ,  మైనింగ్ శాఖల మంత్రి. భూములు, గనులు ఆయన పరిధిలోనే ఉంటాయి కాబట్టి, భూ ఆక్రమణలు,  అక్రమ మైనింగ్ ఆరోపణలు నేరుగా ఈయనపైనే ప్రభావం చూపుతాయి. పొంగులేటి గతంలో బీఆర్ఎస్‌లో ఉండి, తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ను దెబ్బతీయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన్ని ఇరుకున పెట్టడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది.

ఇక చెరువుల ఆక్రమణల పేరుతో హైడ్రా ద్వారా ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల కట్టడాలను కూల్చివేస్తోంది. దీనికి ప్రతిగా, మంత్రి కుటుంబమే భూ కబ్జాలకు పాల్పడుతుంటే హైడ్రా ఎందుకు మౌనంగా ఉంది? అని ప్రశ్నించడం ద్వారా హరీష్ రావు ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేశారు. మొత్తానికి, ఈ 7 వేల కోట్ల భూ కుంభకోణం ఆరోపణలతో తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కింది. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...