సబితకు చుక్కెదురు.. ఉద్వాసన తప్పదా ?

కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి, తెరాసలో చేరి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చిక్కుల్లో చిక్కుకున్నారా? ఓ వంక శాఖపరమైన సమస్యలు, మరోవంక రాజకీయ సవాళ్ళు ఒకేసారి దండయాత్ర చేయడంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా, అంటే, అవును, ఆమె ఒక్కసారిగా ముప్పేట దాడిని ఎదుర్కుంటున్నారు.  ఇంటా బయటా విమర్శలు ఎదుర్కుంటున్నారని, అంటున్నారు.  

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళనను పరిష్కరించే క్రమమలో విద్యార్ధుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమెనే సిల్లీ మంత్రిని చేశాయి. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ఒకటిగా పేరొందిన, బాసర ట్రిపుల్ ఐటీలో కనీస మౌలిక వసతులు లేవని విద్యార్ధులు ఆందోళనకు దిగితే, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, విధ్యార్దుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని అన్నారు. ఆమె చేసిన ఆ వ్యాఖ్య పెద్ద దుమారమే రేపింది. ఒక విధంగా విధ్యర్ధులను రెచ్చ గొట్టి, ఉద్యమం ఉధృతం కావడానికి కూడా ఆమె వ్యాఖ్యలే కారణ మయ్యాయి. మరోవంక  విద్యార్ధుల నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా ఆమె, విమర్శలు ఎదుర్కున్నారు.

అలాగే, గురుకుల పాఠశాలలలో, పిల్లలకు సన్న బియ్యంతో, పౌష్టిక ఆహారం అందిస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా, వాస్తవంలో బియ్యంలో పురుగులు వస్తున్న ఉదంతాలు, వెలుగు చూస్తున్నాయి. పిల్లలు పురుగుల అన్న తినలేక పస్తులుంటున్నారు. ఆకలితో  రోదిస్తున్నారు. అస్వస్థకు గురవుతున్నారు. ఇదంతా కూడా ఎక్కడో కాదు, మంత్రి సబితా ఇంద్ర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని, పాఠశాలలలోనే ఈ పరిస్థితులు ఉన్నాయని, మీడియాలో సచిత్ర కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఇక పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, ఉపాధ్యాయుల కొరత ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనే విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇంటర్ పరీక్షా ఫలితాల విడుద ఎన్నిసార్లు సార్లు వాయిదా పడిందో  విద్యాశాఖ  అధికారులకు అయినా తెలుసో లేదో అనుమానమే. నిజానికి లోపం, ఎక్కడుందో కానీ, ఇప్పటికే కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య వాగ్దానం గాలికి వదిలేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం, ఇప్పుడు, సబితా ఇంద్రా రెడ్డి   అవగాహన రాహిత్యం కారణంగా మరింత అభాసు పాలవుతోందని, అంటున్నారు. 

అదొకటి అలా ఉంటే, ముందూ వెనకా చూసుకోకుండా ప్రభుత్వ  పాఠశాలలలో  పని చేసే టీచర్లు అందరూ తమ వార్షిక ఆదాయాన్ని ప్రకటించాలంటూ పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన జీవో పెద్ద దుమారమే రేపింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు.. ప్రతిపక్షాలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.. తప్పుపట్టాయి.  ఉపాధ్యాయులను టార్గెట్‌ చేసి ఉద్దేశ్ పూర్వకంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందనే విమర్శలు వచ్చాయి. దీంతో,వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

ఇలా అడుసు తొక్కడం, కాలు కడగడం విద్యాశాఖకు, విద్యాశాఖ మంత్రికి అలవాటుగా మారి పోయిందని వస్తున్న విమర్శలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చి వేస్తున్నాయని తెరాస శ్రేణులే అంటున్నాయి.   
ఇవన్నీఒకెత్తు అయితే, సొంత పార్టీ నుంచే మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. మంత్రి భూకబ్జాలు ప్రోత్సహిస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తీగల కృష్ణా రెడ్డి గత కొద్ది రోజులుగా ఆమెపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అంతే కాకుండా ఆమె భూకబ్జాల చిట్టా మొత్తం బయట పెడతానని బహిరంగంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. తగ్గేదేలే’ అంటూ సవాలు విసురుతున్నారు. మరో వంక సబితా సబితా ఇంద్రారెడ్డి, అలాంటిదేమీ లేదంటూనే, ఉన్నా,  ముఖ్యమంత్రి చూసుకుంటారని, సీఎం చాటున రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్నారు.

ఇరువురు నేతల మధ్య బాహాటంగా జరుగుతున్న రగడ పార్టీలో చర్చకు కారణంగా మారింది. పబ్లిక్ లో పార్టీ ప్రతిష్టను దిగజార్చింది.  కాగా, మంత్రి పై తీవ్ర విమర్శలు చేసిన తీగల, కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా చెరువులు, పాఠశాలల స్థలాలను కూడా సబితా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, ఆమె రాజకీయ చరిత్రను వదలకుడా తీగల రాజకీయ విమర్శలు చేశారు. రాజకీయ అస్త్రాలు సంధించారు.ను  ఆమె తెరాస టికెట్ మీద గెలలేదని, గుర్తు చేసిన ఆయన, మంత్రి సబితా ఇంద్రారెడ్డి వైఖరిపై సీఎం కేసీఆర్ తో కూడా తాను చర్చిస్తానని పేర్కొన్నారు.

అయితే, రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్న తీగల ఆరోపణలను ముఖ్యమంత్రి ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారనేది,చూడవలసి ఉందని అంటున్నారు. అయితే, విద్యా శాఖ పనితీరు పై వస్తున్న విమర్శలు, రాజకీయంగా వస్తున్న విమర్శల నేపధ్యంలో ముఖ్యమంత్రి, ఆమెకు ఉద్వాసన పలికే అవకాశం లేక పోలేదని పరిశీలకులు అంటున్నారు. అలాగే, ఇంతాకాలం ప్రత్యర్ధులు టార్గెట్ గా ఎన్నికల వ్యూహ రచన చేస్తున్న ముఖ్యమంత్రి, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ దూకుడు పెంచిన నేపధ్యంలో ఇక పార్టీ, ప్రభుత్వ పక్షాళనపై దృష్టి పెట్టే అవకాశం లేక పోలేదని అంటున్నారు.అదే జరిగితే, కొందరు ఫిరాయింపు మంత్రులకు ఉద్వాసన తప్పక పోవచ్చని, ఆ జాబితాలో సబితా ఇంద్రా రెడ్డి పేరు ఖాయంగా ఉంటుందని అంటున్నారు.