పోతూ పోతూ పొగబెట్టిన అన్సారీ!
posted on Aug 10, 2017 5:00PM
మన దేశంలో రాష్ట్రపతి పదవే అలంకారప్రాయం. ఇక ఉప రాష్ట్రపతి సంగతి చెప్పాలా? ఉప రాష్ట్రపతి అడపాదడపా రాజ్యసభ నిర్వహించినప్పుడు తప్ప మరెప్పుడూ కనిపించరు! ఎక్కడ చూసినా ప్రధాని , మంత్రులు మాత్రమే కనిపించే వ్యవస్థ మనది. ఇక మిగిలిన కీలకమైన చోట్ల రాష్ట్రపతికి పెద్ద పీట వేస్తారు. మొత్తం మీద రెండో అత్యున్నత స్థానమైన వైస్ ప్రెసిడెంట్ పోస్టు… చాలా వరకూ న్యూస్ లో వుండదనే చెప్పాలి!
ఉప రాష్ట్రపతి మాట ఇప్పుడెందుకు వచ్చిందంటే… మన తెలుగు వాడు వెంకయ్యకి సీటు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు హమీద్ అన్సారీ. పదేళ్లుగా సైలెంట్ గా వైస్ ప్రెసిడెంట్ గిరి కొనసాగించిన ఆయన వెళుతూ వెళుతూ మాత్రం వివాదం రాజేశారు. అదే ఇప్పుడు బీజేపి వారికి మంట రేపుతోంది! అన్సారీ యూపీఏ పాలకులు ఉప రాష్ట్రపతిగా ఎన్నిక చేసిన వ్యక్తి. బాగా చదువుకున్న వాడు, సీనియర్ బ్యూరోక్రాట్ అయినప్పటికీ … కాంగ్రెస్ కు, సోనియాకు నమ్మకస్థుడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా! అదే ఆయనకు వరుసగా రెండు సార్లు పదవి కట్టబెట్టింది. అయితే, మోదీ సర్కార్ ఉప రాష్ట్రపతి పదవిలో ఆరెస్సెస్ నేపథ్యమున్న సీనియర్ బీజేపి నాయకులు వెంకయ్యను కూర్చోబెట్టాలని నిర్ణయించింది. కాబట్టి అన్సారీకి రిటైర్మెంట్ తప్పలేదు!
హమీద్ అన్సారీ చివరి సారి రాజ్యసభ నిర్వహించిన వేళ అన్ని పార్టీల నేతలు ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. బీజీపి నాయకులు కూడా ఆయన గొప్ప వాడనే అన్నారు. మోదీ స్వయంగా తాము ఎంతో నేర్చుకున్నామని చెప్పుకొచ్చారు. అయితే, అంతలోనే అన్సారీ చేసిన ఓ కామెంట్ కలకలం రేపుతూ వార్తల్లోకి వచ్చింది. ఆయన ఓ ఇంటర్వ్యూలో దేశంలోని ముస్లిమ్ లు అభద్రతా భావానికి లోనవుతున్నారని అన్నారు! ఇది ఇంచుమించూ ఎవర్ని ఉద్దేశించి చేసిందో మనకు తెలిసిందే!
ఉప రాష్ట్రపతి పదవిలో కొనసాగిన అన్సారీ అధికార పక్షానికి తగిలేలా ముస్లిమ్ లు భయపడతున్నారని, బెదిరిపోతున్నారని కామెంట్స్ చేయటం సహజంగానే కాషాయ నాయకులకి నచ్చలేదు! బీజేపి అధికార ప్రతినిధి అయితే అన్సారీ రాజకీయ ఉపాధి కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఘాటుగా స్పందించారు! అయితే నిజం ఏంటో అన్సారీకే తెలియాలి. మోదీ వచ్చి మూడేళ్లు అయిపోయాక కూడా నిజంగా ముస్లిమ్ లు అభద్రతలో వున్నారా? లేక ఈ కామెంట్ ద్వారా ఆయన ఏదైనా రాజకీయ ఉద్యోగం సంపాదించే పనిలో వున్నారా? అల్లాకే తెలియాలి! ప్రస్తుతానికైతే … వెళుతు వెళుతూ ఆయన వార్తల్లోకి వ్యక్తిగా నిలిచారు! అంత మాత్రం క్లియర్…