గుజరాత్ ఫలితాలు.. తలరాత మార్చిన "నోటా"..

 

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ సంగతి పక్కన పెడితే, గుజరాత్ ఫలితాలు మాత్రం బీజేపీకి చుక్కలు చూపించాయి. అసలు ఏం జరుగుతుందో కూడా ఎవ్వరిక అర్ధంకాని పరిస్థితిలో ఎన్నికలు ఫలితాలు వచ్చాయి. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో విజయం పరంపర కొనసాగించిన బీజేపీకి, గుజరాత్ ఎన్నికల్లో గెలుపు మాత్రం అంత ఈజీగా దక్కలేదు. ప్రతిపక్ష పార్టీని తక్కువగా అంచనా వేశారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పోటా పోటీగా నిలిచింది. అందుకే బీజేపీ కేవలం 99 సీట్లు మాత్రమే దక్కించుకోవాల్సి వచ్చింది. ఇక కాంగ్రెస్ అయితే గత కొన్ని ఏళ్లుగా ఉన్న రికార్డును చెరిపి...గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలిచింది.

 

ఇక ఈ ఎన్నికల ఫలితాలు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం హీరో అయ్యాడు. బీజేపీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకొని రాహుల్ ప్రసంగాల్లో పస పెంచడం వల్ల గట్టి పోటీనే ఎదురైంది. రాహుల్ కు తోడుగా.. పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్ధిక్ పటేల్.. ఇంకా ఓబీసీ రిజర్వేషన్ల కోసం అల్పేశ్‌ ఠాకూర్‌, దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ జిగ్నేష్‌ మెవాని అందరూ మోడీకి వ్యతిరేకంగా ప్రచారాలు చేసినవారే. దీంతో ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు.. గెలిచింది కానీ.. ఆ సంతోషం అయితే బీజేపీ నేతలకు లేదన్న విషయం అర్దమైపోతుంది. కానీ పైకి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అంతే.

 

అంతేకాదు ఈ ఎన్నికల ఫలితాల్లో ఇంకో షాకింగ్ విషయం బయటపడింది. నోటా వల్ల కూడా రాజకీయ నేతల తలరాతలు మారిపోతాయన్న విషయం మరోసారి బయటపడింది. ఈ ఎన్నికల్లో కొందరి నేతల కంటే అత్యధికంగా నోటాకే ఓట్లు వచ్చాయట. మొత్తం 5 లక్షల 42వేల 196 ఓట్లు నోటాకే పడ్డాయట. అంటే గుజరాత్‌లో 2 శాతం ఓట్లు నోటాకే పడ్డాయి. ఇంకా అశ్చర్యకరమైన విషయం ఏంటంటే... బీఎస్‌పీ..ఎన్‌సీపీ పార్టీల నేతలు..ఇండిపెండెంట్‌ అభ్యర్థుల కంటే కూడా నోటాకే ఎక్కువగా ఓట్లు రావడంతో నేతలు షాకవుతున్నారు. ఈ నోటాని ఎక్కువగా ఉపయోగించుకున్న వారిలో ఎక్కువ మంది మెజారిటీ యంగ్ గుజారాతీలు అని తెలిసింది…యంగ్‌ పటీదార్‌ ఓటర్లు కూడా నోటాకే ఎక్కువగా ఓట్లు వేసినట్టు తెలిసింది. మొత్తానికి నోటా నేతల రాతలతో ఒక ఆట ఆడుకుంది అనే చెప్పాలి.