సీఎం కేసీఆర్  పిసిరిగొట్టా.. నరసింహన్ ఎందుకలా అన్నారు? 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను భోళా శంకరుడు అంటుంటారు. ఎవరూ ఏ సాయం అడిగినా చేస్తారని  చెబుతారు. ముఖ్యమంత్రిగా కూడా ఆయన భారీ వ్యయాలతో కూడిన ప్రాజెక్టులకే డిజైన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ భారీ బడ్జెట్ పథకాలే. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకానికి కూడా ఏటా 15 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు భారీగా కనిపిస్తున్నా... ఆయన పిసిరోడట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి, తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అట. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే  చెప్పారు. 

సిద్దిపేట, కామారెడ్డిలో పర్యటించిన కేసీఆర్.. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో నిర్వహించిన సభలో సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తన గురించి కూడా ఇప్పటివరకు ఎవరికీ తెలియన రహస్యాలు చెప్పారు. అందులో ఒకటి మాజీ గవర్నర్ నరసింహన్ తనను పిసిరిగొట్టు అన్నారన్న విషయాన్ని చెప్పి అందరిలో నవ్వులు పూయించారు గులాబీ బాస్.

తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కేసీఆర్. అప్పడు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ ఉన్నారు. సీఎం కాగానే కేసీఆర్ కు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రికి ఉన్న కాన్వాయ్ వచ్చిందట. అయితే ఆ కాన్వాయ్ లోని వాహనాలన్ని బ్లాక్ కలర్ లో ఉండేవి. కేసీఆర్ కు ఆ కలర్ నచ్చలేదట. ఇదే విషయాన్ని అప్పటి సీఎంవో పోలీస్ అధికారి, ప్రస్తుత రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కు చెప్పారట కేసీఆర్. అప్పుడు మహేష్ భగవత్ కొత్త కార్లు తీసుకుందామని సలహా ఇచ్చారట. అయితే రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటుందో తెల్వదు... ఇలాంటి సమయంలో అడ్డగోలుగా ఖర్చు చేయకూడదని కేసీఆర్ చెప్పారట. ఆయనే మహేష్ భగవత్ కు ఓ ఐడియా కూడా ఇచ్చారట. అది ఏమిటంటే... కాన్వాయ్ లోని కార్లకు ఉన్న బ్లాక్ కలర్ పై వైట్ కలర్ వేయించమని చెప్పారట.

సీఎం కేసీఆర్ చెప్పినట్లే బ్లాక్ కార్లకు కలర్ మార్చి వైట్ కాన్వాయ్ గా మార్చేశారట. ఆ కాన్వాయ్ లోనే ఐదు నెలల పాటు తిరిగానని కామారెడ్డి సభలో కేసీఆర్ చెప్పారు.  ఈ విషయాన్ని ఏదో సమయంలో మహేష్ భగవత్ .. గవర్నర్ నరసింహన్ కు చెప్పారట. కొన్ని రోజుల తర్వాత తనను కలిసిన సీఎం కేసీఆర్ దగ్గర కార్ల విషయాన్ని ప్రస్తావించారట గవర్నర్. కేసీఆర్ కార్ల కలరు మార్చుకుని తిరుగుతున్నావా.. నువ్వెంత పిసిరిగోట్టువయ్యా అని అన్నారట. అది కాదు సార్.. రాష్ట్ర ఖజానా ఎలా ఉంటుందో ఇంకా అంచనాకు రాలేదు కదా.. అందుకే ఖర్చు పెట్టడానికి వెనుకాడానని గవర్నర్ కు చెప్పారట కేసీఆర్.  కొన్ని రోజుల తర్వాత పరిస్థితి పూర్తిగా అవగాహనకు వచ్చాకా కొత్త కాన్వాయ్ తీసుకున్నారట ముఖ్యమంత్రి కోసం.  కామారెడ్డి సభలో కేసీఆర్ చెప్పిన ఈ విషయాలను విని అంతా అశ్చర్యానికి లోనయ్యారు.