ఆస్పత్రి కాదు... శ్మశానం!

గోరఖ్‌పూర్ బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (బీఆర్డీ ఆస్పత్రి) ఇప్పుడు వైద్యశాలగా కాదు... వందలాది మంది చిన్నారులను చంపేసిన శ్మశానంగా మారిపోయింది. ఈ ఏడాదిలోనే ఎంతోమంది చిన్నారులను పొట్టన పెట్టుకున్న ఆస్పత్రిగా నిలిచింది. ఈ ఏడాదిలోనే ఈ ఆస్పత్రిలో 1256 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. కేవలం ఆగస్టు నెలలోనే 296 మంది చిన్నారులు ఈ ఆస్పత్రిలో మరణించారు. ఆగస్టులోనే ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఈ ఆస్పత్రిలోనే 60 మంది పిల్లలు చనిపోయారు. ఆక్సిజన్ సరఫరా చేసే సంస్థకు ఈ ఆస్పత్రి వర్గాలు బిల్లులు చెల్లించకపోవడంతో సదరు సంస్థ ఆక్సిజన్ సరఫరా నిలిపేసింది. దాంతో ఈ దారుణం జరిగింది. ఆగస్టు 26 నుంచి 28 తేదీల మధ్య కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఆస్పత్రిలో 42 మంది చంటిపిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

 

ఆగస్టు నెల ప్రారంభం వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించేస్తున్నానని ప్రచారం చేసుకున్న సన్యాసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుకి బీఆర్డీ ఆస్పత్రిలో జరుగుతున్న చిన్నారుల మృత్యు పరంపర ఇరకాటంలో పడేసింది. ఒకే ఆస్పత్రిలోనే కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో 1256 మంది చిన్నారులు మరణించడం అంటే మామూలు విషయం కాదు. ఈ అంశం మీద ముఖ్యమంత్రి ఇప్పటికీ న్యాయ విచారణకు ఆదేశించలేదు. ఆస్పత్రి వర్గాలు కూడా ఇన్ని మరణాలు సహజంగానే జరిగినట్టుగా చెబుతున్నాయి.

 

ఇతర ఆస్పత్రుల వారు తమ వల్ల కాదంటూ చేతులు ఎత్తేసిన కేసులు తమ దగ్గరకు వస్తున్నాయని, అలాంటి చిన్నారులు తమ ఆస్పత్రిలో మరణిస్తున్నారని  చెబుతున్నాయి. ఆక్సిజన్ ఆపడం వల్ల 60 మంది పిల్లల మరణానికి కారణమైన ఈ బోధనాస్పత్రి మాజీ ప్రిన్సిపాల్, అతని భార్యని అరెస్టు చేయడం ద్వారా తూతూ మంత్రం చర్యలు తీసుకున్నారు. ఏది ఏమైనా ఈ ఆస్పత్రిలో జరిగిన శిశు మరణాలన్నీ సహజమైనవేనా? ఏవైనా ఇతర కారణాలున్నాయా అనే విషయాన్ని ప్రభుత్వం విచారణ ద్వారా కనుక్కోవాల్సిన అవసరం వుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu